logo

రాచనగరికి పర్యాటక మణిహారం

రాచనగరి గొప్పదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో కాంతులీనేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. మైసూరు ‘టూరిజం సర్క్యూట్’ను రూపొందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో

Published : 12 Aug 2022 01:18 IST

మైసూరు: పుస్తకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

మైసూరు, న్యూస్‌టుడే : రాచనగరి గొప్పదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో కాంతులీనేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. మైసూరు ‘టూరిజం సర్క్యూట్’ను రూపొందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా ఉన్నత విద్యాశాఖ, మైసూరు విశ్వవిద్యాలయం సహకారంతో ఇక్కడి ‘మానస గంగోత్రి’ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన యువజన మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ కళాశాల, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. మైసూరుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ, ఆసుపత్రుల ఉన్నతీకరణ, మహారాజు, మహారాణి కళాశాలల సమగ్ర అభివృద్ధికి, పట్టు, జౌళి, లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యా కేంద్రంగా గుర్తింపు ఉన్న రాచనగరిలో 1000 గదులు ఉన్న విద్యార్థుల హాస్టల్‌ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. దేశ నిర్మాణం కోసం యువ శక్తిని ఉపయోగించుకోవాలన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు యువత సహకారం అత్యవసరం అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు అందరూ ప్రాతః స్మరణీయులని పేర్కొన్నారు. మైసూరు రాజుల పాలనలో కర్ణాటక అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఐటీ బీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ, ఎమ్మెల్యేలు రామదాసు, జి.టి.దేవేగౌడ, నటుడు యశ్‌, వర్సిటీ అధికారులు యువజనోత్సవాల్లో పాల్గొన్నారు.

సాగర సంభ్రమం!
మండ్య: కన్నడిగుల జీవనాడి కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర అమృత మహోత్సవాలను డిసెంబరులో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. స్వాతంత్ర అమృత మహోత్సవాలు, దసరా ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఈ వేడుకల నిర్వహణకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు, ఇంజినీర్లు, పర్యాటకుల సమక్షంలో వేడుకలను ఆచరిస్తామని చెప్పారు. కౌశల్యాభివృద్ధి, జాతీయ జీవనోపాధి జాగృతి, సంజీవిని- కెఎస్‌ఆర్‌ఎల్‌పీఎస్‌ సంస్థలు మండ్య విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మండ్య జిల్లాలో రైతులు, కార్మికులకు స్వాభిమానంతో దేశానికి అన్నాన్ని అందిస్తున్నారని ప్రశంసించారు. వీసీ కాలువను నాగేగౌడ అభివృద్ధి చేశారని, ప్రస్తుతం రూ.504 కోట్లతో ఉప కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. మద్దూరు కాలువల సమగ్ర అభివృద్ధికి ఈ ఏడాది పద్దులో రూ.500 కోట్లు రిజర్వు చేశామన్నారు. త్వరలో మైషుగర్‌ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమలో ఎథనాల్‌ తయారీ విభాగాన్ని తానే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని చెరకు సాగు రైతులకు ఇకపై ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వం చూస్తుందని భరోసా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న పథకాలను రైతులు, కార్మికులు, మహిళలు, పేదలు వినియోగించుకునేలా స్థానిక నాయకులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మంత్రులు అశ్వత్థ నారాయణ, కె.గోపాలయ్య, నారాయణగౌడ, ఎంపీ సుమలత, జిల్లాధికారి అశ్వతి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని