logo

చదువులమ్మ అమృతానందం!

అఖిల భారత ఉన్నత విద్యా సమీక్ష (ఏఐఎస్‌హెచ్‌ఈ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) మొదలు గ్లోబల్‌ క్యూఎస్‌ సమీక్షలు ఎప్పుడు ప్రకటించినా కర్ణాటక ఉత్తమ ర్యాంకులు మెరుగైన స్థానంలోనే నిలుస్తోంది. రాష్ట్రంలో అగ్రహార, శివపురి, బ్రహ్మపురి, ఘటికాస్థాన, మఠాల విద్యా వ్యవస్థల నుంచి రాష్ట్రంలో

Published : 13 Aug 2022 01:22 IST

నూతన జాతీయ విద్యా విధానానికి కన్నడ పాలకుల నాందీ

ఈనాడు, బెంగళూరు : అఖిల భారత ఉన్నత విద్యా సమీక్ష (ఏఐఎస్‌హెచ్‌ఈ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) మొదలు గ్లోబల్‌ క్యూఎస్‌ సమీక్షలు ఎప్పుడు ప్రకటించినా కర్ణాటక ఉత్తమ ర్యాంకులు మెరుగైన స్థానంలోనే నిలుస్తోంది. రాష్ట్రంలో అగ్రహార, శివపురి, బ్రహ్మపురి, ఘటికాస్థాన, మఠాల విద్యా వ్యవస్థల నుంచి రాష్ట్రంలో నాణ్యమైన విద్యా బోధన దొరుకుతూనే ఉంది. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యల్లో సంప్రదాయ విధానాలను క్రమంగా సవరించిన కర్ణాటక విద్యా వ్యవస్థ నేడు రోబో, కృత్రిమ మేథతో ఆధునిక విద్యను అందరికీ అందుబాటులోనికి తెచ్చింది.

ఆధునిక బోధన..: అప్పటి వరకు గ్రామాలు, ప్రాంతాలకే పరిమితమైన పాఠ్యాంశాలు సమగ్ర విద్య సలహా సమితి (ఈఐఏసీ) ఏర్పాటుతో బోధన లక్ష్యం విస్తృతమైంది. స్వాతంత్య్రానికి పూర్వం మరాఠి భాష ప్రభావంతో హుబ్బళ్లి- ధార్వాడల్లో మరాఠా బోధనశాలలు ఏర్పాటై ముంబై రాష్ట్రం పర్యవేక్షణలో నడిచేవి. ఆపై మైసూరు ఉచిత ఆంగ్ల మాధ్యమశాలలను సామాన్యులకు అందుబాటులో తెచ్చారు. ఈ పాఠశాలలకు సమాంతరంగా క్రిస్టియన్‌ మిషనరీ బోధన 1950 వరకు రాష్ట్రంలో నగరవాసులకు అనువైన విద్యను అందించింది. చదువు విలువ పెరిగే కొద్దీ ప్రాంతాలు, సంస్కృతులకు పరిమితమైన విద్య కాస్త 1956 నాటికి సమగ్ర విద్య సలహా సమితి ఏర్పాటుకు దారి తీసి రాష్ట్రమంతా ఏకరూప విద్యా విధానం తెరపైకి వచ్చింది.

నగరీకరణ ఘనం: గ్రామాల నుంచి నగరాలకు వలస వచ్చేవారి సంఖ్య పెరగటం, ఉపాధి కోసం ఇంటి కంటే కార్యాలయాలకే పరిమితమయ్యే నగరవాసుల కోసం ప్రాథమిక, మాధ్యమిక విద్యా బోధన కోసం 1956లో ఏర్పాటైన కర్ణాటక ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించింది. ఆ సమయంలో బోధన ప్రమాణాలు ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు కీలకంగా మారాయి. కొఠారి కమిషన్‌ సిఫార్సుల ప్రకారం.. రాష్ట్రంలో నాలుగు అంచెల విద్యా విధానం, ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో 1964 నాటికి ఏకరూప విద్యా బోధన అధికారికంగా విద్యాలయాల్లో అమలు చేసిన ప్రభుత్వం ఆ ఏట 537 పాఠశాలల్లో 1.15 లక్షల మందిని చేర్పించి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. నాలుగు అంచెల బోధన పీయూ, సాంకేతిక విద్య అవసరాల కోసం వృత్తి విద్యా బోధనను ప్రారంభించేందుకు జాతీయ స్థాయి మొదలియార్‌ సమితి సిఫార్సుల్లో కీలక అంశాలపై రాష్ట్రం దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్య ప్రమాణాలను జాతీయ స్థాయి దాటి ప్రపంచ స్థాయికి మళ్లించింది.

ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల ఐఐఎస్‌సీ

విశ్వవిద్యాలయాల విప్లవం : 1956 నాటికి కేవలం నాలుగు విశ్వవిద్యాలయాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నెగ్గుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా విశ్వవిద్యాలయాల చట్టాలను తెరపైకి తెచ్చి నేటికి వాటి సంఖ్యను 58కి చేర్చింది. ప్రాంతీయ అసమానతలను తగ్గించే దిశగా 1916లో నాలుగో కృష్ణరాజ ఒడయార్‌ ప్రారంభించిన మైసూరు విశ్వవిద్యాలయం చదువుల విప్లవానికి నాంది పలికింది. ఆపై వరుసగా బెంగళూరు, మంగళూరు, ధార్వాడ, శివమొగ్గ, రాయచూరు, చిత్రదుర్గ, కలబురగిల్లో విశ్వవిద్యాలయాలను స్థాపించి సంప్రదాయ విద్యను అన్ని ప్రాంతాలకూ విస్తరించారు. సబ్జెక్టులు, భాషలు, సంస్కృతులు, కళలలు, వ్యవసాయానికే పరిమితమైన బోధన అందిస్తూనే ఇదే ప్రాంతాల్లో సాంకేతిక విద్యను మద్రాస్‌ విశ్వవిద్యాలయం ఆసరాతో అందించారు. ఈ క్రమంలో మఠాలు కూడా అక్షర దాసోహ సేవలతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని ఉచిత విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యా ప్రమాణాలను పెంచాయి.

ఎన్‌ఈపీతో : విద్యా విధానాన్ని మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేసిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని అమలు చేసిన తొలి రాష్ట్రం కర్ణాటక. 2020లో ఎన్‌ఈపీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఆపై నాలుగు నెలలకే ఎన్‌ఈపీ నివేదికను కేంద్రానికి సమర్పించింది.

యాజమాన్య బోధనతో ఉపాధి బాట

ఉపాధ్యాయుల శిక్షణ

1914 నాటికి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయ శిక్షణ వ్యవస్థ లేకపోవటంతో పట్టభద్రులంతా చెన్నై బాట పట్టేవారు. 1925లో మైసూరు మహరాజుల ఆసరాతో మైసూరు విశ్వవిద్యాలయం బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ టీచింగ్‌ను ప్రారంభించి 1952 నాటికి ఈ బీఈడీ కోర్సులను స్వయంగా నిర్వహించే స్థాయికి చేరుకుంది. మరో నాలుగేళ్లకు ఎంఈడీ చదువులకు మైసూరు విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టి రాష్ట్రంలోనే నాణ్యమైన బోధకులను తీర్చి దిద్దింది.

అత్యధికం బెంగళూరులోనే

సంప్రదాయ, సాంకేతిక విద్యను సమాంతరంగా అందుబాటులోకి తెచ్చిన కర్ణాటకలో 1980 నాటికి సాంకేతిక విద్య జోరందుకుంది. వృత్తి విద్య, పరిశోధన అభివృద్ధి, ఉపాధి రంగాలు ఊపందుకోవటంతో బెంగళూరు నగరం క్రమంగా ఉన్నత విద్యకు కేంద్రంగా మారింది. 1909లో బెంగళూరు ఏర్పాటైన భారతీయ విజ్ఞాన సంస్థ రాష్ట్ర పరిశోధన ప్రగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగా, ఐఐటీ ధార్వాడ, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఎల్‌ఎస్‌యూ సంస్థలు తమదైన ప్రత్యేక సబ్జెక్టుల్లో ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, క్యూఎస్‌ సమీక్షల్లో సత్తా చాటాయి. 2021 ఏఐఎస్‌హెచ్‌ఈ సమీక్ష ప్రకారం అత్యధిక కళాశాలలున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉండగా, ప్రతి లక్ష మందికి 57 కళాశాలలు, 18-23 వయసున్న విద్యార్థుల ఉన్నత విద్యా ప్రవేశాల(జీఈఆర్‌) ప్రమాణం 23 శాతంతో రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర ఉన్నత విద్యాశాఖ ప్రకటించిన ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లోనూ రాష్ట్రానికి చెందిన 14 కళాశాలలు 11 కేటగిరీల్లో తొలి పదిలో స్థానం సంపాదించటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని