logo

ఉక్కు నగరంలో ఉద్యమ కెరటాలు

ఉక్కు నగరంగా.. సరిహద్దు జిల్లాగా పేరు పొందిన బళ్లారి జిల్లా స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రపోషించింది. నగరంలో స్వాతంత్య్ర పోరాట ప్రదేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతమైన విమానాశ్రయం సమీపంలోని టర్కీ ఉద్యానవనం, అల్లీపురం జైలును ప్రస్తుతం విమ్స్‌ ఆసపత్రి,  వైద్య కళాశాలలోని పలు స్మారకాలు

Published : 13 Aug 2022 01:22 IST

మహాత్ముడు నడయాడిన నేల

బళ్లారిలో రిక్షాలో వెళ్లిన లాల్‌ బహదూర్‌ శాస్త్రి

1937 అక్టోబరు 10న బెళగవి జిల్లా హుదలిలో హరిజన కరియప్పతో కలిసి వెళ్తున్న గాంధీజీ

బళ్లారి, న్యూస్‌టుడే: ఉక్కు నగరంగా.. సరిహద్దు జిల్లాగా పేరు పొందిన బళ్లారి జిల్లా స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రపోషించింది. నగరంలో స్వాతంత్య్ర పోరాట ప్రదేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కంటోన్మెంట్‌ ప్రాంతమైన విమానాశ్రయం సమీపంలోని టర్కీ ఉద్యానవనం, అల్లీపురం జైలును ప్రస్తుతం విమ్స్‌ ఆసపత్రి,  వైద్య కళాశాలలోని పలు స్మారకాలు, రేడియోపార్క్‌లోని డైట్‌ కళాశాలల్లో గాంధీజీ చితాభస్మం, బళ్లారి రైల్వేస్టేషన్‌లోని గాంధీజీ విశ్రాంతి తీసుకున్న స్మారకం, అర్థర్‌ వెల్‌సన్‌ జైలును ప్రస్తుతం టి.బి.శ్యానిటోరియం ఆసుపత్రిగా మార్పు చేసినా జైలుకు సంబంధించిన స్మారకాలు కనిపిస్తున్నాయి.

ఆర్భాటాలకు దూరం

ఉక్కు నగరంగా పేరు పొందిన బళ్లారి జిల్లాకు ఎందరో మహానుభావులు పరిచయం. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా బళ్లారికి వచ్చిన స్వతంత్ర సమరయోధులు ఇక్కడే జైలు జీవనం గడిపారు. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాత ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా బళ్లారి నగరానికి విచ్చేశారు. కింద కూర్చుని అందరూ సమానమని చాటి చెప్పారు. స్వాతంత్య్రానికి పూర్వం గాంధీజీ రెండు సార్లు బళ్లారికి వచ్చినా రైల్వేస్టేషన్‌లో ఉండిపోయారు. 1939లో రాజాజీ బళ్లారి నగరానికి విచ్చేశారు. ప్రస్తుతం గాంధీభవనం ఉన్న ప్రదేశంలో టేకూరు సుబ్రహ్మణ్యం, భీమ్‌రావ్‌ తదితరులతో స్వాతంత్య్ర పోరాటంపై చర్చించారు. 1952లో తుంగభద్ర జలాశయాన్ని అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజాజీ పరిశీలించారు. 1943లో స్వాతంత్య్రానికి ముందు బళ్లారి బి.డి.ఎ.ఎ క్రీడామైదానంలో జరిగిన సమావేశానికి డా.బాబు రాజేంద్రప్రసాద్‌, టేకూరు సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. 1951లో మద్రాస్‌ ప్రభుత్వంలో నిర్మిస్తున్న తుంగభద్ర జలాశయాన్ని అప్పటి ప్రధాని నెహ్రూ పరిశీలించారు. 1956లో లాల్‌ బహుదూర్‌ శాస్త్రి రైలు ద్వారా బళ్లారికి చేరుకొని ఎలాంటి ఆర్భాటం లేకుండా రిక్షాలో సంగనకల్లు రహదారిలోని లోక్‌సభ సభ్యుడు టేకూరు సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకొని కుర్చీలో కాకుండా చాపపై కూర్చుని అల్పాహారం తీసుకున్నారు. రైల్లో హుబ్బళ్లికి బయలుదేరి వెళ్లారు. 1937 అక్టోబరు 10న బెళగావి జిల్లా హుదలిలో హరిజన కరియప్పతో కలిసి పర్యటించారు. స్వాతంత్య్ర పోరాటంపై యువకులకు అవగాహన కల్పించారు. అదే ఏడాది హుదలి హరిజన కరియప్ప కుమార్తె వివాహంలో గాంధీజీ ఉత్సాహంగా పాల్గొన్నారు. హుదలిలో శ్రమదానం చేయడం, ప్రత్యేకంగా ఆరుబయట తోటలో బావి వద్ద స్నానం చేస్తూ సామాన్య జీవనం సాగించారు.

1951లో తుంగభద్ర జలాశయం పరిశీలించేందుకు వచ్చిన అప్పటి ప్రధాని నెహ్రూ, తదితరులు

టర్కీ ఉద్యానవనం

బళ్లారి నగర శివారు ప్రాంతమైన విమానాశ్రయం ప్రధాన ద్వారం పక్కనే టర్కీ ఉద్యానవనం నిర్మించారు. ఆంగ్లేయులు భారతదేశం పాలించే సందర్భంలో టర్కీ దేశంపై కూడా దండయాత్ర చేసి కోర్జునరల్‌ అగపాస్‌ రుహున ఫతిహ రాజుతోపాటు మహారాణి సెహిట్‌ టార్క్‌ అస్కరి రుహున ఫతిహ, 600 మంది టర్కీ సైనికులను బళ్లారి నగరంలోని అల్లీపురం జైల్లో బంధించారు. అక్కడే శిక్ష అనుభవిస్తున్న తరుణంలో 1918లో రాజు, సతీమణి మృతిచెందారు. ఆంగ్లేయులు టర్కీ రాజు, రాణి మృతదేహాలకు బళ్లారి విమానాశ్రయం సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం రాజు కుటుంబసభ్యులు టర్కీ ఉద్యానవనంగా అభివృద్ధి చేసి రాజుల గుర్తుగా స్తూపం నిర్మించారు. నేటికీ ఈ ఉద్యానవనం టర్కీ మహారాజులు ఆధీనంలో ఉంది. ఏటా టర్కీ నుంచి మహారాజు కుటుంబ సభ్యులు వచ్చి రెండు రోజులు ఇక్కడే గడిపి వెళ్తుంటారు.

1956లో టేకూరు సుబ్రహ్మణ్యం ఇంట్లో చాపపై కూర్చున్న లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, తదితరులు

సమర యోధుల గురుతులు ఎన్నో...

స్వాతంత్య్ర పోరాటంలో బళ్లారి ప్రజలు కీలక పాత్ర పోషించారు. వారిలో లోక్‌సభ స్థానం నుంచి హ్యాట్రిక్‌ విజయం సాధించిన టేకూరు సుబ్రహ్మణ్యం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో ప్రముఖులు. ఆయనకు గుర్తుగా బుడా కార్యాలయ సమీపంలోని ఉద్యానవనానికి టేకూరు సుబ్రహ్మణ్యం ఉద్యానవనంగా నామకరణం చేశారు. బళ్లారి కేంద్ర కారాగారంలోనూ ప్రత్యేక స్తూపం ఏర్పాటు చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న టేకూరు సుబ్రహ్మణ్యంతో పాటు, ఘంటసాల, కామరాజ్‌, వాయిలాల గోపాలకృష్ణ, నీలం సంజీవరెడ్డి, బళ్లారికి చెందిన సమరయోధులను అల్లీపురం జైల్లో ఉంచడం ప్రస్తావనార్హం.

టర్కీ మహారాజులకు స్మరణార్థం నిర్మించిన స్తూపం

టర్కీ మహారాజ, సతీమణి సమాధులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని