logo

నెహ్రూ చిత్రం విస్మరణపై రగడ

స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రచార మాధ్యమాలకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనల్లో మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రం లేకపోవడం కొత్త వివాదానికి కారణమైంది. ఉద్దేశపూర్వకంగానే తాము నెహ్రూ ఫొటోలను

Published : 15 Aug 2022 02:48 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా ప్రచార మాధ్యమాలకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనల్లో మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రం లేకపోవడం కొత్త వివాదానికి కారణమైంది. ఉద్దేశపూర్వకంగానే తాము నెహ్రూ ఫొటోలను ఆ ప్రకటనలో చేర్చలేదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్‌.రవికుమార్‌ స్పష్టం చేశారు. కంఠీరవ మైదానంలో విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ దేశ విభజనకు నెహ్రూ కారకులని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని రద్దు చేయాలని మహాత్ముడు చేసిన సూచనలను ఆయన విస్మరించారని తెలిపారు. దేశ విభజన జరిగిన రోజును తాము కరాళ దినమని భావిస్తున్నామని చెప్పారు. టిప్పు సుల్తాన్‌ స్వాతంత్య్ర పోరాటయోధుడు కానందునే ఆయన చిత్రాన్ని కూడా ప్రకటనలో చేర్చలేదని సమర్థించుకున్నారు. టిప్పు అనేక దేవాలయాలను ధ్వంసం చేసి, లక్షలాది మందిని బలవంతంగా మతం మార్పించారని ఆరోపించారు. టిప్పు చిత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ తమ బ్యానర్లలో ముద్రించి, మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ముఖ్యమంత్రి బొమ్మై కీలుబొమ్మలా మారారంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అధికారం కోసం సోనియా గాంధీ చేతిలో బొమ్మగా ఆయనే ఉన్నారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ చెబితేనే డి.కె.శివకుమార్‌ను కౌగిలించుకున్నారని ఎద్దేవా చేశారు. కంఠీరవ స్టేడియంలో నేడు (సోమవారం) 50 వేల మంది ప్రజలు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. ఈద్గా మైదానంలోనూ ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

స్వాతంత్య్ర పోరాట యోధుల చిత్రాలను వేశాం

అమృత మహోత్సవాలకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కేవలం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను మాత్రమే ప్రచురించామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.జి.మహేశ్‌ తెలిపారు. నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుని కన్నా రాజకీయ నాయకునిగా మాత్రమే ఎక్కువ గుర్తింపు ఉందన్నారు. నెహ్రూ చేసిన పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రకటన ఎగువ భాగంలో లైన్‌ డయాగ్రామ్‌లో ఆయన చిత్రాన్ని ప్రచురించామని చెప్పారు. సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్‌, కేపీసీసీ అధికార ప్రతినిధి రమేశ్‌ బాబు, తదితరులు అమృత మహోత్సవాలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపు అర్థరహితమని విమర్శించారు. ఇందిరా, నెహ్రూ అంటేనే భారతదేశం అని భావించే స్థితి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నేతలు బయటకు రావాలని హితవు పలికారు. పలు సంవత్సరాల కేవలం వారి చిత్రాలతోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ప్రపంచానికి శ్రేష్ఠం అనిపించే రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేడ్కర్‌ను, తమ పార్టీకి మంచి గుర్తింపు తీసుకు వచ్చిన పి.వి.నరసింహారావును నిర్లక్ష్యం చేసిన నాయకులు, ఇప్పుడు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని