logo

చందన నగరి సమగ్రాభివృద్ధికి పెద్దపీట

బెంగళూరు నగర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని త్వరలో అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. ఆదివారం ఇక్కడ విధానసౌధ ముందు బీఎంటీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 75 విద్యుత్తు

Published : 15 Aug 2022 02:48 IST
ముఖ్యమంత్రి బొమ్మై
విధానసౌధ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఎంటీసీ 75 విద్యుత్తు బస్సుల సంచారాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మంత్రి అరగ జ్ఞానేంద్ర, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, తదితరులు
బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: బెంగళూరు నగర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని త్వరలో అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వెల్లడించారు. ఆదివారం ఇక్కడ విధానసౌధ ముందు బీఎంటీసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 75 విద్యుత్తు బస్సుల సంచారానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర నలుదిక్కులూ సమానంగా అభివృద్ధి కావల్సిన అవసరం ఉందన్నారు. కేవలం సంచార రద్దీ నియంత్రిస్తే సరిపోదన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. బీఎంటీసీకి సహాయ ధనం కింద రూ.420 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. మిగిలిన సంస్థలకు మూడేళ్లలో రూ.3వేల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్థిక సహాయాన్ని కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మాజీ ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసమూర్తి రవాణా సంస్థల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై నివేదిక అందజేశారని.. దాన్ని అధ్యయనం చేసి అమలులోకి తెస్తామన్నారు. రవాణా, విద్యుత్తు రంగాల్లో ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే ఆర్థికంగా ముందుకు సాగుతామన్నారు. ఈ నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని రెండు రంగాలను పునః సమీక్షిస్తామన్నారు. విద్యుత్తు రంగానికి రూ.14వేల సహాయ ధనాన్ని అందజేశామన్నారు. ఆర్థిక వనరులు పెంచుకునేందుకు రవాణా సంస్థలు శ్రమించాలని సూచించారు. బెంగళూరులో 1.25 కోట్ల మంది ప్రజలు ఉన్నారని, జనసంఖ్య కన్నా ఎక్కువగా వాహనాలు ఉన్నాయన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో వాహనాల సంఖ్య పెరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు నగరంలో ఐదు వేల కొత్త వాహనాలు రహదారిపైకి వస్తున్నాయన్నారు. బీఎంటీసీ ఉత్తమ రవాణా సౌకర్యం కల్పిస్తే సొంత వాహనాల వినియోగం తక్కువ అవుతుందని అభిప్రాయపడ్డారు. బీఎంటీసీ అధ్యక్షుడు ఎన్‌.ఎస్‌.నందీశ్‌రెడ్డి మాట్లాడుతూ 45 ఏళ్ల వయస్సు కలిగిన సిబ్బందికి ఆరోగ్య చికిత్స అందించేందుకు జయదేవ ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. బీఎంటీసీ రజత మహోత్సవం సందర్భంగా ప్రమాదరహితంగా సేవలు అందించిన డ్రైవర్లను గుర్తించి బంగారు పతకాలను అందజేసి గౌరవిస్తామన్నారు. కార్యక్రమంలో హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, ఎమ్మెల్సీ నాగరాజ యాదవ్‌, రవాణాశాఖ కార్యదర్శి ప్రసాద్‌, బీఎంటీసీ ఎండీ సత్యవతి పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని