logo
Published : 17 Aug 2022 02:47 IST

సర్కారులో లుకలుకలు

ఏదో.. నెట్టుకొస్తున్నామన్న మాధుస్వామి

 ఆ వ్యాఖ్యలపై మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం

మాధుస్వామి మాటలతో ముఖ్యమంత్రి బొమ్మైకి ఇరకాటం

ఈనాడు, బెంగళూరు : ఏదో ఒక రూపంలో బసవరాజ బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతవారం ఓ మాజీ ఎమ్మెల్యే బొమ్మై నాయకత్వాన్ని మార్చే సమయం వచ్చిందని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ఆ సందర్భంగా భాజపా రాష్ట్ర బాధ్యుడు అరుణ్‌సింగ్‌ స్పందించి.. బొమ్మై నాయకత్వంలోనే ఎన్నికలు ఎదుర్కొంటామని చెప్పి ఆ వదంతులకు ముగింపే పలికే ప్రయత్నం చేశారు. దిల్లీ నేతల హామీతో ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సర్కారుపై మరో పిడుగుపడ్డట్లైంది. మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బదులివ్వాల్సిన అవసరం లేదని నిన్నమొన్నటి దాకా బొమ్మై సర్కారుకు మద్దతు పలికిన మంత్రి మాధుస్వామి- తాజా వివాదానికి కేంద్రంగా మారటం గమనార్హం.
అలా నెట్టుకొస్తున్నాం
సామాజిక వేత్తగా పరిచయం చేసుకున్న చెన్నపట్టణకు చెందిన భాస్కర్‌ అనే వ్యక్తితో మాట్లాడుతున్నట్లు వైరల్‌గా మారిన ఓ ఆడియో నేడు బొమ్మై సర్కారును కుదిపేస్తోంది. మూడు రోజుల కిందట మంత్రి మాధుస్వామి ఫోన్లో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సర్కారు నడవటం లేదు. ఏదో మేనేజ్‌ చేస్తున్నాం. పైగా.. సహకార బ్యాంకులు రైతుల రుణాల రెన్యువల్‌ పేరిట అదనపు ఫీజులు వసూలు చేస్తున్నా ఆ మంత్రి చర్యలు తీసుకోలేదు’అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. తాను కూడా ఈ అదనపు ఫీజులు చెల్లించిన బాధితుడినని మాధుస్వామి చెప్పిన ఆడియో నేడు సర్కారులో చీలికకు దారి తీసింది. ఈ ఆడియోపై మాధుస్వామి మంగళవారం స్పందించారు. ఆ ఆడియోలో మాట్లాడింది నేనేనని అంగీకరించారు. అది పాత వీడియో.. ఏ సందర్భంగా అలా మాట్లాడానో నాకు గుర్తు లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనను రెచ్చగొట్టించి అలా మాట్లాడేలా చేశారని పెదవి విరిచారు. రహస్యంగా రికార్డు చేయటం నేరమన్న ఆయన.. ఈ ఆడియో ప్రసారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తానన్నారు.
అర్థం వేరులే..
మంత్రి మాధుస్వామి సర్కారుపై చేసిన వ్యాఖ్యల అర్థం వేరని ముఖ్యమంత్రి బొమ్మై మంగళవారం సమర్థించుకున్నారు. ప్రత్యేక శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం సర్కారు సజావుగా సాగుతున్నట్లు ముఖ్యమంత్రి సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన మంత్రితో తాను మాట్లాడినట్లు చెప్పారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్న బ్యాంకులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రుల మండిపాటు
మాధుస్వామి చేసిన వ్యాఖ్యలపై మంత్రివర్గ సభ్యుల్లో కొందరు తీవ్రంగా స్పందించారు. తన శాఖపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎస్‌.టి.సోమశేఖర్‌ మాట్లాడుతూ సర్కారులో కీలక శాఖ నిర్వహిస్తున్న మాధుస్వామి స్వయంగా ఇలా వ్యాఖ్యానించటం తగదన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రతి గురువారం ఆయన స్వయంగా ప్రకటనలు చేస్తుంటారన్నారు. ప్రభుత్వం పని చేయకపోతే మంత్రివర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించాలంటూ ప్రశ్నించారు. బహుశా మాధుస్వామి నిర్వహించే చిన్ననీటి పారుదల శాఖ సవ్యంగా లేదేమోనంటూ ఎద్దేవా చేశారు. మరో మంత్రి మునిరత్న మాట్లాడుతూ సర్కారు సరిగా లేదంటే అందులో భాగస్వామి అయిన మాధుస్వామి రాజీనామా చేయాలంటూ సవాలు విసిరారు. మరో మంత్రి గోపాలయ్య స్పందిస్తూ.. మాధుస్వామి వంటి సీనియర్‌ మంత్రి ఇలా వ్యాఖ్యానించరాదన్నారు. ముఖ్యమంత్రి కరోనా ఉన్నా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని గుర్తుచేశారు. ఆయన నేతృత్వంలో ఎంతో సజావుగా ఉన్న సర్కారును విమర్శించటం సరికాదన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని