logo
Published : 17 Aug 2022 02:47 IST

భగ్గుమన్న శివమొగ్గ

ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం
నిందితుల కట్టడికి పోలీసు కాల్పులు

శివమొగ్గలో పరిస్థితి అదుపు చేసేందుకు బరిలోకి  దిగిన సాయుధ బలగాలు

శివమొగ్గ, న్యూస్‌టుడే : పడమటి కనుమల పాదప్రాంతం సామాజిక అశాంతితో భగ్గుమంది. శివమొగ్గ అమీర్‌ కూడలిలో హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సావర్కర్‌ చిత్రాలున్న బ్యానర్లు తొలగించిన వ్యవహారం ఉద్రిక్తతను ప్రోదిచేసింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ప్రేమ్‌సింగ్‌ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్‌ జబీ అలియాస్‌ చర్బి (30)పై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. నిందితుడు తలదాచుకున్న తీర్థహళ్లి రహదారి ఫలక్‌ సముదాయ భవనాన్ని పోలీసులు మంగళవారం వేకువ జామున చుట్టుముట్టారు. పట్టుకునేందుకు వెళ్లిన ఎస్సై మంజునాథ్‌పై నిందితుడు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని అధికారులు వివరించారు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా వెళుతున్న అతని కాలుపైకి మంజునాథ్‌ కాల్పులు జరిపారు. కుడికాలిలోకి తూటా దూసుకు వెళ్లడంతో కిందపడిపోయిన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని మెగ్గాన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కత్తిపోట్ల ఘటనకు సంబంధించి నదీమ్‌, అబ్దుల్‌ రెహమాన్‌, మరొక వ్యక్తిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ లక్ష్మీ ప్రసాద్‌ వెల్లడించారు.
భద్రావతిలో దాడి
శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన సునీల్‌ అనే యువకునిపై ముబారక్‌ అలియాస్‌ డిచ్చి అనే వ్యక్తి దాడి చేశాడు. నెహ్రూనగరకు చెందిన బాధితుడు విధులకు హాజరయ్యేందుకు వెళుతుండగా ముబారక్‌ అడ్డగించి, దాడి చేసి పరారయ్యాడు. దాడిలో సునీల్‌ ముక్కు దూలం విరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. భద్రావతి పాత ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడ్ని మాజీ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప మంగళవారం మధ్యాహ్నం పరామర్శించి ధైర్యం చెప్పారు. లోతైన దర్యాప్తు, నిందితులకు కఠిన శిక్షలతోనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
పరామర్శించిన మంత్రులు
దుండగుల చేతిలో కత్తిపోట్లకు గురైన ప్రేమ్‌సింగ్‌ను హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, జిల్లా వ్యవహారాల బాధ్యుడు కె.సి.నారాయణగౌడ శివమొగ్గలోని మెగ్గాన్‌ ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు. జిల్లా ఎస్పీ లక్ష్మీ ప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్‌కు చెందిన బాధితుడు కస్తూరిబా రోడ్డులోని దుస్తుల దుకాణంలో పని చేసేవాడని తెలిపారు. సావర్కర్‌ చిత్రం ఉన్న బ్యానర్లను దుండగులు తొలగించిన వెంటనే అమీర్‌ కూడలిలో గొడవ జరిగిందని చెప్పారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని తెలిపారు. అక్కడి నుంచి పరారవుతూ నిందితులు దారి మధ్యలో ప్రేమ్‌సింగ్‌పై దాడి చేశారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితుడు పూర్తిగా కోలుకున్నాడని, అతనికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
ః గురువారం అర్ధరాత్రి వరకు శివమొగ్గ, భద్రావతి పరిధిలో 144వ సెక్షన్‌ను అమలులోకి తీసుకువచ్చారు. అవసరానికి అనుగుణంగా అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరతామని జిల్లాధికారి సెల్వమణి తెలిపారు. జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. జిల్లాలో అన్ని మద్యం దుకాణాలను మంగళవారం మూయించారు. మద్యం విక్రయాలు జరగకుండా ఎక్సైజ్‌ శాఖ ఉప కమిషనర్‌ కెప్టెన్‌ అజిత్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని