logo

కమలనాథుల శంఖారావం

కేంద్ర, రాష్ట్రాల్లో మరోసారి అధికార సాధనే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచారు. 2023 విధానసభ, 2024 లోక్‌సభ ఎన్నికలపై అధికార పక్షం భాజపా అత్యంత ప్రణాళికా బద్ధంగా వ్యూహాలు రచిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో

Published : 19 Aug 2022 04:44 IST

ప్రతినిధుల సమావేశంలో ఎన్నికల కార్యాచరణపై చర్చ


భాజపా కీలక నేతల సమావేశంలో అరుణ్‌సింగ్‌, నళిన్‌కుమార్‌ కటీల్‌

ఈనాడు, బెంగళూరు : కేంద్ర, రాష్ట్రాల్లో మరోసారి అధికార సాధనే లక్ష్యంగా కమలనాథులు దూకుడు పెంచారు. 2023 విధానసభ, 2024 లోక్‌సభ ఎన్నికలపై అధికార పక్షం భాజపా అత్యంత ప్రణాళికా బద్ధంగా వ్యూహాలు రచిస్తోంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీకి మరింత బలమైన పునాదులు వేసే దిశగా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు పార్టీ కీలక పదవిని కట్టబెట్టి తన కార్యాచరణను ప్రారంభించింది. గురువారం పార్టీ రాష్ట్ర బాధ్యుడు అరుణ్‌ సింగ్‌, పార్టీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ నేతృత్వంలో బెంగళూరులో నిర్వహించిన ప్రతినిధుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల వారీగా శ్రేణులను సమన్వయపరిచేలా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, నళిన్‌ కుమార్‌ కటీల్‌లతో కూడిన మూడు బృందాలు రానున్న ఎన్నికల ప్రణాళికలపై పర్యవేక్షణ చేస్తాయి.

కీలక పదవి దక్కించుకున్న యడియూరప్పకు అరుణ్‌సింగ్‌ సత్కారం

సరికొత్త వ్యూహం
ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను బలవంతంగా తప్పించి ఆపై ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణ పార్టీ లోపలా, బయట వినిపించింది. అసలే పార్టీకి కీలకమైన ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్‌లకు యడియూరప్ప తిరుగులేని రాజకీయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించిన నాడే లింగాయత్‌ మఠాధిపతులంతా కలిసి తమ మద్దతు అప్పకు ఉందనే సందేశాన్నిచ్చారు. ఆయన అనుచర గణంలో ఒకరిగా గుర్తింపు పొందిన బొమ్మై ముఖ్యమంత్రి పదవిని అలంకరించినా లింగాయత్‌లు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలేదన్న సమాచారం అధిష్ఠానానికి అందింది. ఇటీవల కర్ణాటకను సందర్శించిన కేంద్ర మంత్రి అమిత్‌ షాతో అప్ప భేటీ అయ్యారు. రాజకీయ వర్గాల్లో ఇదే విషయం తీవ్ర చర్చకు దారి తీసిన క్రమంలోనే తాజా నియామక ప్రక్రియగా అంచనా వేస్తున్నారు. యడియూరప్ప- బీఎల్‌ సంతోశ్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీఎల్‌ సంతోశ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను, యడియూరప్ప పార్టీని శాసించే స్థాయిలో ఉన్నారు. వారిద్దరినీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల సమితిలో నియమించి సమన్వయాన్ని పెంపొందించేలా చేశారు.

తాజా సమీక్ష
ఎంత లేదన్నా ప్రస్తుత బొమ్మై పాలన వివాదాలకు కేంద్రంగా మారింది. తొలినాళ్లలో హిజాబ్‌ అంశంపై మొదలైన వివాదాలు నేటికీ శివమొగ్గలో చెలరేగిన హింసాత్మక సంఘటన వరకు అన్నీ వివాదాలే. మధ్యలో.. ‘40 శాతం కమీషన్‌’ వ్యవహారంతో మంత్రి ఈశ్వరప్ప రాజీనామా, భాజపా యువ మోర్చా సభ్యుడు ప్రవీణ్‌ హత్య సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశ్నించేలా చేస్తున్నాయి. వీటికి తోడుగా ఇటీవల మంత్రి మాధుస్వామి ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ చేసిన ‘మేనేజ్‌ సర్కారు’ వ్యాఖ్య బొమ్మై నాయకత్వ పటిమకు పరీక్ష పెట్టేదే. ఈ క్రమంలోనే గురువారం పార్టీ రాష్ట్ర బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ పర్యటన, పథాధికారులతో మంతనాలు కొనసాగించారు. రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రభావంపై లోతుగా చర్చించారు. ఈ సమావేశంలో జరిపిన చర్చల నివేదికను అరుణ్‌సింగ్‌ అధిష్ఠానానికి చేరవేస్తారు. నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో నాయకత్వంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ, ప్రభుత్వంలో వర్తమాన పరిణామాల ప్రభావంపై అభిప్రాయ సేకరణ కూడా మొదలు కానుంది. ఎన్నికల వేళ ఈ అభిప్రాయాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.

నేతల పర్యటన
సెప్టెంబరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు పర్యటిస్తారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షడు కనీసం 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే రెండుసార్లు జనోత్సవ కార్యక్రమం రద్దు కావటం పార్టీకి చేటు తెచ్చే అంశం. ఈ ఉత్సవాల రద్దుపై దుష్ప్రచారం రాకుండా చూసేందుకు సెప్టెంబరు నుంచి అక్టోబర్‌ వరకు ఏడు చోట్ల జనోత్సవాలు నిర్వహించాలని గురువారం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పంచ సంకల్పాలు, బొమ్మై పంచ యోజన పథకాలపై ప్రచారం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని