logo

సిద్ధుకు చేదు అనుభవం

విపక్ష నేత సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయనను మడికేరిలో భాజపా యువ మోర్చా కార్యకర్తలు గురువారం ఘెరావ్‌ చేశారు. కొడగు జిల్లా శివార్లలోని తితిమతిలో సిద్ధుకు నల్లజెండాలు చూపిస్తూ

Published : 19 Aug 2022 04:44 IST

భాజపా శ్రేణుల నిరసనలు వ్యక్తమైనా.. మడికేరికి చేరుకున్న సిద్ధుకు కాంగ్రెస్‌ కార్యకర్తల ఘనస్వాగతం

మడికేరి, న్యూస్‌టుడే : విపక్ష నేత సిద్ధరామయ్య కొడగు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆయనను మడికేరిలో భాజపా యువ మోర్చా కార్యకర్తలు గురువారం ఘెరావ్‌ చేశారు. కొడగు జిల్లా శివార్లలోని తితిమతిలో సిద్ధుకు నల్లజెండాలు చూపిస్తూ ‘గోబ్యాక్‌ సిద్ధు’ అంటూ నినాదాలు చేశారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు సిద్ధు వస్తున్నారని తెలుసుకున్న మోర్చా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గతంలో వద్దని చెప్పినా వినకుండా ఆయన టిప్పు సుల్తాన్‌ జయంతిని నిర్వహించి, విద్వేషాలను రెచ్చగొట్టారని మోర్చా జిల్లాధ్యక్షుడు దర్శన్‌ జోయప్ప ధ్వజమెత్తారు. కొడగు ప్రజలు గోమాంసాన్ని తింటారని తన ఉపన్యాసాల్లో గతంలో సిద్ధు చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడేం అవసరం?
మైసూరు: కొడగులో వర్షాలు నిలిచి పోయాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసితుల కేంద్రాల్లోనూ ఎవరూ లేరు. ఇప్పుడు సిద్ధరాయయ్య కొడగు జిల్లా పర్యటనకు ఎందుకు వెళ్లారంటూ సహకార శాఖ మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌ ప్రశ్నించారు. పరిస్థితులన్నీ చక్కబడిన పక్షం రోజులకు పర్యటనకు వెళ్లి రాజకీయాలు చేద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మైసూరులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం, తనపై విమర్శలు వస్తున్నప్పుడు మొహం చాటేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.

సీటీ గరం
బెంగళూరు (మల్లేశ్వరం): ముస్లింలు ఉండే ప్రాంతంలో సావర్కర్‌ చిత్రాలు ఉన్న బ్యానర్లు కట్టకూడదని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని చెప్పారు. అలా సమర్థించుకుంటూ వెళితే నేడు సావర్కర్‌ను, రేపు అంబేడ్కర్‌, గాంధీజీని కూడా విమర్శిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సావర్కర్‌ స్వాతంత్య్ర సమరయోధుడా? కాదా? అని ప్రమాణపత్రాలు ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదన్నారు. క్లబ్‌ హౌస్‌లో పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని