logo

హంపీ చరితం.. చూడర సిత్రం..!

ఓ వెయ్యి పదాల భావం..ఒక్క చిత్రంలో చూపవచ్చు.. చిత్రానికున్న ఘనత అలాంటిది.. అందుకే చిత్రం చెప్పే భావాలు, అర్థాలెన్నో.. ఆధునిక కాలంలో ఛాయాచిత్రగ్రాహకుల అద్భుత సృజన, కళానైపుణ్యం మేలిమి ఆవిష్కారాలకు కారణమవుతోంది. నేడు అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక హంపీ క్షేత్రంపై ప్రత్యేక కథనం.

Published : 19 Aug 2022 04:44 IST

చిత్రకారుల అద్భుత నైపుణ్యం  
నేడు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఓ ఛాయాచిత్రకారుడు తీసిన వర్షంలో స్మారకాల చిత్రం

ఓ వెయ్యి పదాల భావం..ఒక్క చిత్రంలో చూపవచ్చు.. చిత్రానికున్న ఘనత అలాంటిది.. అందుకే చిత్రం చెప్పే భావాలు, అర్థాలెన్నో.. ఆధునిక కాలంలో ఛాయాచిత్రగ్రాహకుల అద్భుత సృజన, కళానైపుణ్యం మేలిమి ఆవిష్కారాలకు కారణమవుతోంది. నేడు అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక హంపీ క్షేత్రంపై ప్రత్యేక కథనం.

హంపీ పరిసర ప్రాంతంలో పక్షులు, ప్రాణుల చిత్రం

హొసపేటె, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యాటక క్షేత్రం హంపీ నేడు ఛాయా చిత్రకారులకు విశ్వవిద్యాలయంగా మారుతోంది. హంపీ పరిసర ప్రాంతాలు, స్మారకాలు, ఇక్కడి సంప్రదాయం, సంస్కృతి, జనజీవనం ఇలా పలు కోణాలను తమ కెమెరాల్లో బంధించేందుకు రోజూ చాలా మంది ఛాయాచిత్రకారులు హంపీ వస్తున్నారు. ఫొటోగ్రఫీ చేయాలని దేశ, విదేశాల నుంచి చాలా మంది వృత్తి, ప్రవృత్తి ఛాయా చిత్రకారులు హంపీ బాట పడుతున్నారు. స్థానిక ఫొటోగ్రాఫర్లు తీసిన హంపీ ఛాయాచిత్రాలు సప్తసముద్రాలు దాటి ప్రదర్శనకు నోచుకున్న సంఘటనలు ఉన్నాయి. చేతిలో ఎలాంటి కెమెరా ఉన్నా ఫర్వాలేదు. ఫొటో తీసే నైపుణ్యం, కళా, నేర్పు ఉంటే చాలునంటున్నారు హొసపేటె ప్రముఖ ఛాయాచిత్రకారుడు శివశంకర్‌ బణగార్‌. రాష్ట్రంలో ఎక్కడ ఉత్సవాలు, మేళాలు జరిగినా అక్కడ హంపీ ఛాయాచిత్రాల ప్రదర్శన ఉండాల్సిందే. హంపీ స్మారకాలు, సూర్యాస్తమయం, సూర్యోదయం, జనజీవనం, ప్రకృతి ఇలా చాలా కోణాల్లో ఫొటోలను తీసిన స్థానిక ఫొటోగ్రాఫర్లు ఎన్నో అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శనల్లో పురస్కారాలను దక్కించుకున్నారు. పదేళ్ల నుంచి ఇదే ప్రవృత్తిగా మార్చుకున్న ఫొటోగ్రాఫర్‌ శివశంకర్‌ బణగార్‌ ఒక అంతర్జాతీయ, ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆయనతోపాటు ఫొటోగ్రాఫర్లయిన పంపయ్య స్వామి మళిమఠం, రాచయ్య స్థావరీ మఠ, మారుతి పూజార్‌, విక్రాంత్‌, ఈశ్వర్‌ సింగ్‌, అమీన్‌ అఖ్తర్‌, శంకర్‌ పత్తార్‌ రోజూ హంపీ వెళ్లి ఫొటోగ్రఫీ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. వీరే కాకుండా దేశ, విదేశాల ఛాయాచిత్రకారులు కూడా హంపీలో ఫొటోగ్రఫీ చేయడానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి హంపీపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ‘మంచి ఫొటోగ్రఫీ చేయాలంటే హంపీకన్నా ఉత్తమమైన ప్రాంతం మరొకటి లేదు. హంపీలో చాలా ప్రాంతాలు, స్మారకాల వద్ద పేరుకుపోయిన అపరిశుభ్రతతో జంకే పరిస్థితి ఉంది. ఫొటోగ్రఫీ సమయంలో స్థానికుల్లో శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం కూడా స్వచ్ఛతపై దృష్టి పెడితే చాలా ప్రాంతాల ఫొటోలు తీసి ప్రచారం చేయటానికి సాధ్యపడుతుందని ఛాయాచిత్రగ్రాహకులు పేర్కొంటున్నారు.

విజయవిఠల ఆలయంలో ఫొటో తీస్తున్న ఓ ఛాయాచిత్రకారుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని