logo

అన్నదాతకు చేదోడు : బొమ్మై

తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని అన్నదాతల పొలాలు, ఆస్తులను బ్యాంకులు జప్తు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. దీనికి అనుగుణంగా త్వరలో చట్టంలో సవరణ తీసుకు వస్తామని వెల్లడించారు.

Published : 25 Sep 2022 03:12 IST

వేదికపై శివమూర్తిస్వామీజీ, బసవరాజ బొమ్మై, యడియూరప్ప

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని అన్నదాతల పొలాలు, ఆస్తులను బ్యాంకులు జప్తు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. దీనికి అనుగుణంగా త్వరలో చట్టంలో సవరణ తీసుకు వస్తామని వెల్లడించారు. చిత్రదుర్గలోని సిరిగెరె తరళుబాళు మఠంలో శివకుమార శివాచార్య మహాస్వామి 30వ వర్ధంతి నేపథ్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు బిడ్డల కోసం రూపొందించిన విద్యా నిధి పథకాన్ని 14 లక్షల మంది విద్యార్థులు అందుకున్నారని చెప్పారు. అతివృష్టి, అనావృష్టి, పంట నష్టంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. ఈ ఏడాది చక్కని వర్షాలతో అన్ని చెరువులూ నిండాయని, వచ్చే మూడేళ్ల పాటు భూగర్భ జలాలు వృద్ధి చెంది, చక్కని ఫలసాయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పలికితే తక్షణమే రూ.14 వేల కోట్లు కర్ణాటకకు విడుదల అవుతాయని తెలిపారు. సమాజం గురువు వైపు చూస్తుండగా, ప్రభుత్వం సమాజం వైపు చూస్తుందని చెప్పారు. గురువుల మార్గదర్శనం అన్ని సందర్భాల్లో అవసరమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ఫ మఠాధిపతి శివమూర్తి శివాచార్య స్వామి, మంత్రి మాధుస్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని