logo

రాష్ట్రపతి రాకకు మైసూరు ఎదురుచూపు

విఖ్యాత మైసూరు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాముండిబెట్టపై చాముండేశ్వరికి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అక్టోబరు 5న నిర్వహించే జంబూసవారీలో

Published : 25 Sep 2022 03:12 IST

రాచనగరిలో స్నానం చేయించుకుంటున్న అభిమన్యు

మైసూరు, న్యూస్‌టుడే : విఖ్యాత మైసూరు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చాముండిబెట్టపై చాముండేశ్వరికి పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అక్టోబరు 5న నిర్వహించే జంబూసవారీలో పాల్గొనే గజదళానికి శిక్షణ కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహిస్తున్నామని అటవీశాఖ అధికారి కరికాళన్‌ తెలిపారు. జంబూ సవారి సమయంలో ఏనుగులు బెదిరిపోకుండా ఉండేందుకు మూడో విడతల ఫిరంగులు పేల్చుతూ, డప్పులు కొడుతూ ఇచ్చే శిక్షణ శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. అభిమన్యు, అర్జున, భీమ, మహేంద్ర, గోపాలస్వామి, ధనుంజయ, కావేరి, చైత్ర, పార్థసారథి, విజయ, సుగ్రీవ, శ్రీరామ తదితర 12 ఏనుగులు, 34 గుర్రాలు ఈ తాలీములో పాల్గొన్నాయి. ఏడు ఫిరంగి బండ్ల నుంచి 21 రౌండ్లు కాల్పులు జరిపారు. అక్టోబరు ఐదున ప్యాలెస్‌ పక్కన ఉన్న కోటె మారమ్మ ఆలయం ఆవరణలో మరోసారి 21 రౌండ్ల కాల్పులు జరిపి జంబూసవారీని ప్రారంభిస్తారు. జంబూసవారీలో పాల్గొనే అన్ని ఏనుగులూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నాయని ఆయన వివరించారు. శ్రీరంగపట్టణలో నిర్వహించే దసరా వేడుకలకు ఐదు ఏనుగులను పంపించాలని మండ్య జిల్లా పాలన యంత్రాంగం కోరింది. మహేంద్ర నేతృత్వంలో ఐదు ఏనుగులను అక్కడకు పంపిస్తామని చెప్పారు. శరన్నవరాత్రి పూజలకు ధనుంజయ, భీమ ఏనుగులను పంపించాలని రాజమాత ప్రమోదాదేవి కోరారు. రాత్రి వరకు కొనసాగే జంబూ సవారీని దృష్టిలో ఉంచుకుని రాత్రుళ్లు విద్యుత్తు దీపాలంకరణల మధ్య చెక్క అంబారీలతో గోపాలస్వామి, ఇతర ఏనుగులను నడిపించి శిక్షణ ఇస్తున్నారు. దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో నగర పరిధిలో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని నగర కొత్వాలు డాక్టర్‌ చంద్రగుప్త తెలిపారు.

మైసూరు వీధిలో శుక్రవారం రాత్రి గజదళం ఊరేగింపు

సాంస్కృతిక ఉత్సవాలు

అంబావిలాస ప్యాలెస్‌ ఆవరణలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు మూడు వరకు వైవిధ్యమయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేసింది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు ఉత్సవాలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రారంభిస్తారు. యధునాథ్‌, గురురాజ్‌ బృందంతో నాదస్వరం, కిరాళు మహేశ, ఆయన బృందంతో వీరభద్ర కుణిత, సప్తస్వర కళాబృందంతో అమృతభారతికి కన్నడద హారతి, బెంగళూరు క్రియేషన్స్‌ బృందంతో నృత్య రూపకం, విదూషి హెచ్‌.ఆర్‌.లీలావతి బృందంతో లలిత సంగీత కార్యక్రమాలను మొదటి రోజు నిర్వహిస్తారు.

విఖ్యాత దసరా ఉత్సవాలకు అనుగుణంగా చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని శనివారం శుభ్రం చేశారు. అమ్మవారి ఆభరణాల మెరగును పరిశీలించారు. సోమవారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం మహాలయ అమావాస్యను పురస్కరించుకుని శనివారమే ఆలయ శుద్ధి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని