logo

కరుణించగా రావమ్మా..కనకదుర్గ..!

బళ్లారి నగరంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దేవస్థానాల్లో వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బళ్లారి కనక దుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. మల్నాడు దుర్గమ్మ, బళ్లారి నగరం, కౌల్‌బజార్‌లో కన్యక పరమేశ్వర దేవస్థానాల్లో

Published : 27 Sep 2022 01:07 IST

శరన్నవరాత్రుల సంబరం మొదలు

సింధనూరు గాంధీనగర్‌ పంచాయతన క్షేత్రం మంటపంలో కొలువుదీరిన జగన్మాత

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి నగరంలో సోమవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దేవస్థానాల్లో వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బళ్లారి కనక దుర్గమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. మల్నాడు దుర్గమ్మ, బళ్లారి నగరం, కౌల్‌బజార్‌లో కన్యక పరమేశ్వర దేవస్థానాల్లో అమ్మవార్లు, ఏళు మక్కళ దేవస్థానంలో అమ్మవారు, సణ్ణ దుర్గమ్మ దేవస్థానం, బెంకి మారెమ్మ, తదితర దేవస్థానాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

బళ్లారి గ్రామీణ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలత్రిపుర సుందరిగా కొలువుదీరారు. అమ్మవారి ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజించారు. నగర ఆరాధ్య దేవత కనకదుర్గమ్మకు రజతకవచం, పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. అద్దినగుండం రోడ్డులోని చిన్నదుర్గమ్మను బాలత్రిపురసుందరి, ఏళుమక్కళతాయి, బాలాజీ క్యాంపు లక్ష్మీ బాలాజీ పద్మావతికి పుష్పాలతోనూ, భవాని మాత, శారదమాతను విశేషంగా అలంకరించారు. చెళ్లగుర్కి ఎర్రితాతకు విభూతితో అలంకరించి పూజించారు. బెంకి మారెమ్మను హరిద్రాకుంకుమతో అలంకరించారు. వాసవీమాత, శాంభవీ, మారెమ్మ, తాయమ్మ, నగరేశ్వరీ, రాజరాజేశ్వరీ, కొల్హాపురి మహాలక్ష్మి, తదితర దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయా ఆలయాల్లో భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు.

సిరుగుప్ప . స్వకుళసాలి సమాజం వారు అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తున్న దృశ్యం

కారటగి: కారటగి దేవి క్యాంపు రత్నగిరిపై శ్రీదేవి బీరేశ్వర స్వామి ఆలయాల్లో సోమవారం దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి మొదటి రోజు శ్రీదేవి అమ్మవారు దేవమ్మ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పంచామృతాభిషేకం, శైలపుత్రి పూజ, గణపతి హోమం తదితర ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. సోమవారం కావడంతో బీరేశ్వర స్వామికి సైతం ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి వరకు ఆలయం వద్ద ప్రతి రోజూ మధ్యాహ్నం అన్న సంతర్పణ ఉంటుందని ఆలయ సమిలి ప్రతినిధి కొల్లా శేషగిరిరావు తెలిపారు.

శ్రీరామనగర్‌లో: శ్రీరామనగర్‌ ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గాదేవి ఆలయంలో సోమవారం కలశ స్థాపనతో దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పార్థివ లింగార్చన, బిల్వార్చన, మహాసౌర విధానంలో సూర్య నమస్కారాలు, వేద పారాయణం, కుంకుమార్చన తదితర పూజలు జరిగాయి. రోజూ సాయంత్రం ప్రసాద వితరణ ఉంటుందరి ఆలయ సమితి సభ్యులు తెలిపారు.

సింధనూరు: సింధనూరు తాలూకాలోని గాంధీనగర్‌, శాంతినగర్‌, గొరేబాళక్యాంపు, బూదిహాళక్యాంపు, భీమరాజ్‌క్యాంపుల్లో సోమవారం దసరా సందర్భంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గాంధీనగర్‌లో ఉదయం అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో క్యాంపంతా ఘనంగా ఊరేగించి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మండపంలో కొలువుదీర్చారు. గర్భగుడిలోని అమ్మవారికి అభిషేక పూజల అనంతరం హోమాలు నిర్వహించారు. ఆపై కోటి కుంకుమార్చన క్రతువు ఆరంభించారు. గొరేబాళక్యాంపులో శ్రీఅంబాదేవి ఆలయం వద్ద ప్రత్యేక మండపం నిర్మించి ఏటా మాదిరిగా యువకులు ఉత్సాహంగా వేడుకలు ప్రారంభించారు. మూరుమూల హెడిగిబాళక్యాంపులో దుర్గాదేవి ఆలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభించి గర్భగుడిలోని అమ్మవారిని అందంగా అలంకరించారు. తొలిరోజున దుర్గాదేవి అలంకారం చేశారు. పట్టణ రామకిశోర్‌కాలనీలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో శ్రీవాసిష్ఠ వేదవిద్యా గురుకులం ఆధ్వర్యంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు విద్వాన్‌ తోలేటి రామచంద్ర సోమయాజి భవానీమాతను మహాకాళీ స్వరూపంగా అలంకరింపజేసి ప్రత్యేక మంటపంలో పూజలు చేశారు. అధికసంఖ్యలో మహిళలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ లలితా సహస్రనామ పఠనం చేశారు.

చెళ్లకెర: గాయత్రీదేవి

సిరుగుప్ప: సిరుగుప్ప తాలూకా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. సోమవారం ఉదయాన్నే అమ్మవారి ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా వివిధ రూపాల్లో అలంకరించి, పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీనగర్‌క్యాంపులో అమ్మవారిని దుర్గాదేవి అలంకరణ చేయగా, ఆదోని రహదారిలోని శ్రీఅంబాభవాని అమ్మవారిని శైలపుత్రి మహాదేవిగా అలంకరించారు. రారావి యల్లమ్మదేవి, కరూరు ఆలయాల్లో అమ్మవార్లను అలంకరించి పూజలు నిర్వహించారు.

గంగావతి: ఆనెగుంది మేగోట దుర్గమ్మ నవరాత్రులకు రాజవంశస్థులు సోమవారం శ్రీకారం చుట్టారు. మహంత బ్రహ్మానంద స్వామీజీ ఆధ్వర్యంలో గోపూజ, కలశస్థాపన, కుంకుమార్చన జరిగాయి. ఆనెగుంది రాజవంశస్థులు లలితారాణి శ్రీరంగదేవరాయలు, మోహినీదేవి నరసింహదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు చండీహోమంలో పాల్గొని పూర్ణాహుతి నెరవేర్చారు.

బళ్లారి: కన్యక పరమేశ్వరి మాత

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts