logo

పీఎఫ్‌ఐ నిషేదం.. రాజకీయ దుమారం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై ఐదేళ్ల నిషేధాస్త్రం ప్రకటించిన ఉత్తరక్షణమే రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సంస్థ కార్యకలాపాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి.

Published : 29 Sep 2022 02:20 IST

సమర్థించుకున్న కమలనాథులు

ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్‌ గుర్రు

దాడుల వివరాలను ప్రశ్నించిన దళ్‌

బెంగళూరులోని పీఎఫ్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని దిగ్బంధించిన పోలీసులు

ఈనాడు, బెంగళూరు : పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై ఐదేళ్ల నిషేధాస్త్రం ప్రకటించిన ఉత్తరక్షణమే రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సంస్థ కార్యకలాపాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. సమాజంలో అలజడి సృష్టించే ఏ సంస్థనైనా నిషేధించాల్సిందేనని అభిప్రాయపడుతున్న వారంతా.. ఇదే సందర్భంగా ఇతర సంస్థలకూ ఇదే సూత్రాన్ని వర్తింప చేయాలని పట్టుబట్టాయి.
* పీఎఫ్‌ఐ సంస్థపై వేటు వేయాలని కేంద్రం నిర్ణయించినా ఇందుకు రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు కారణమయ్యాయి. మార్చిలో నిర్వహించిన బడ్జెట్‌ సమావేశాల్లోనూ హింసావాదాన్ని ప్రేరేపించే సంస్థల నిషేధంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దక్షిణ కన్నడ, కరావళి జిల్లాల్లో సంభవించిన పలు హింసాత్మక సంఘటనలను ఉటంకించిన అధికార పక్ష సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పీఎఫ్‌ఐ వంటి సంస్థలు విస్తరించాయని ఆరోపించారు. పీఎఫ్‌ఐ సభ్యులపై నమోదైన 175కుపైగా కేసులను సిద్ధరామయ్య పాలనలో మాఫీ చేయటంపై అధికార భాజపా తప్పుబట్టింది. కేంద్ర, రాష్ట్రాల్లో భాజపా సర్కారు ఉండగా ఈ సంస్థను నిషేధించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని విపక్ష నేత సిద్ధరామయ్య ప్రశ్నించారు. హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర- ఈ సంస్థలను నిషేధించాలని కేంద్రానికి మనవి చేసినట్లు సభకు వివరించారు

అంతా.. నాటకం
పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఏ చేపడుతున్న దాడుల వివరాలను బహిరంగ పరచాలని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పే సీఎం ప్రచారం నుంచి బయటపడేందుకే పీఎఫ్‌ఐ నిషేధ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఆరోపించారు. తాను సభలో లేవదీసిన బీఎంఎస్‌ సంస్థ అక్రమాలకు బదులివ్వలేని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు నేడు పీఎఫ్‌ఐ నాటకంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

హిజాబ్‌తో మొదలై..
2021 డిసెంబరులో ఉడుపి, మంగళూరు, మండ్య, బెళగావిల్లో మొదలైన హిజాబ్‌ చిచ్చు క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది. మార్చిలో ఈ వివాదం తీవ్రరూపం దాల్చి రాష్ట్రాన్ని ఉడికించింది. కళాశాలల్లో హిజాబ్‌ కారణంగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యపై హైకోర్టులో నమోదైన ఫిర్యాదులపై సుదీర్ఘ విచారణ కొనసాగింది. మార్చి 16న హైకోర్టు ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. ఈ ఉదంతంపై నేటికీ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి ముందు హిజాబ్‌ వివాదం లేకపోయినా ప్రస్తుతం నిషేధించిన పీఎఫ్‌ఐ సంస్థ స్పందించి విద్యార్థులు, తల్లిదండ్రులను ఈ వివాదానికి కేంద్రంగా మార్చినట్లు ఆరోపణలు వినిపించాయి. సుప్రీంకోర్టు గత శుక్రవారం వెల్లడించిన మధ్యంతర తీర్పులోనూ కొన్ని సంస్థల కారణంగానే ఈ వివాదం చెలరేగిందని అభిప్రాయపడటం గమనార్హం. జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన హిజాబ్‌ వివాద సృష్టికర్త పీఎఫ్‌ఐ అన్న అనుమానాలు నానాటికీ పెరిగిపోయాయి.

రెండు హత్యలతో..
ఫిబ్రవరి 21న శివమొగ్గలో బజరంగదళ్‌ కార్యకర్త హర్ష, జులై 26న భాజపా యువ మోర్చా సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు హత్యలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఈ హత్యల వెనుక ముస్లిం యువకులున్నట్లు పోలీసుల విచారణలు నిగ్గు తేల్చాయి. పుత్తూరులో ప్రవీణ్‌ హత్య ఉదంతాన్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సొంత పార్టీ కార్యకర్తలంతా నాయకత్వాన్ని ప్రశ్నించిన తీరు కేంద్రాన్ని కూడా దీర్ఘాలోచనలో పడేసింది. ఐదు బృందాల పోలీసులు, ఎన్‌ఐఏ దళం అధికారులు నేటికీ ఈ కేసు లోతుల్ని తోడుతున్నారు. ఈ విచారణలో ముస్లిం యువకులు, అందులోనూ పీఎఫ్‌ఐ సంస్థతో నేరుగా సంబంధాలున్న పదుల సంఖ్యలో నాయకులను అదుపులోనికి తీసుకుని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఓ వైపు పార్టీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోవటంతో కేంద్రానికి ఈ హత్య వెనుక ఉన్న సంస్థను నిషేధించాలన్న సందేశం మరింత గట్టిగా వినిపించింది.

వారిని వదిలేస్తే ఎలా?
ఇన్నాళ్లకు పీఎఫ్‌ఐను నిషేధించిన భాజపా తన నాణేనికి రెండో ముఖం ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని ఎప్పుడు విధిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ప్రశ్నించారు. సమాజంలో శాంతిని భంగం కలిగించే ప్రతి సంస్థనూ నిషేధించాలని పీసీసీ మాధ్యమ విభాగం డిమాండ్‌ చేసింది. పీఎఫ్‌ఐతో సహా సమాజంలో ద్వేషాన్ని రగిలించే సంస్థలను నిషేధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తూనే ఉందన్నారు. పీఎఫ్‌ఐ సంస్థను నిషేధించటంపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సానుకూలంగా స్పందించారు.

ఉగ్రపక్షుల వేట..
పీఎఫ్‌ఐ సంస్థను నిషేధించాలని కాంగ్రెస్‌ పార్టీ చేసిన సవాలును స్వీకరించి ప్రస్తుతం ఆ మాటను నెరవేర్చినట్లు భాజపా ట్వీట్‌ చేసింది. విపక్షనేత సిద్ధరామయ్య- ఆగస్టు 16న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నడుపుతుండగా సరైన దాఖలాలుంటే పీఎఫ్‌ఐను రద్దు చేయాలని సవాలు చేశారన్నారు. ఆయన పెంచి పోషించిన యుద్ధ పక్షులను మేము వేటాడినట్లు భాజపా ట్వీట్‌ చేసింది. ఈ నిషేధంపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ట్వీట్‌ చేస్తూ రాజస్థాన్‌లో చెలరేగిన అల్లర్ల వెనుక పీఎఫ్‌ఐ కుట్ర ఉన్నట్లు తేలింది. సిద్ధరామయ్య పాలనలోనూ 23 మంది హిందూ కార్యకర్తలను హత్య చేశారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ సామరస్యానికి అనివార్యమని అభిప్రాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంతి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ఈ సంస్థపై నిషేధం చాలా ఆలస్యంగా అమలు చేశారన్నారు. ఈ సంస్థ చర్యలు దేశ ప్రగతికి అడ్డంకిగా మారాయి. సుదీర్ఘ పోరాటంతో ఈ విజయం దక్కిందన్నారు. దేశ విద్రోహులకు ఇదో హెచ్చరిక గంటగా వీరు అభివర్ణించారు.

విధ్వంసకారిణి
దేశంలో విధ్వంస చర్యలకు తావులేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా నిర్ణయం తేల్చి చెప్పిందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. పీఎఫ్‌ఐ సభ్యుల్లో చాలా మంది బయటి దేశాల్లో శిక్షణ పొంది అక్కడి నుంచే దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నో కేసుల్లో ఈ సంస్థ సభ్యులకు ప్రత్యక్ష సంబంధాలున్నాయన్నారు. రాష్ట్రంలో సృష్టించిన అలజడి దేశమంతా చూసిందని వాపోయారు. ఇలాంటి సంస్థలను నిషేధించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్‌ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సీపీఐ, సీపీఐఎం, కాంగ్రెస్‌లు కూడా ఈ సంస్థను నిషేధించాలని పట్టుబట్టాయని గుర్తుచేశారు. ఇకపై ఈ సంస్థతో సంప్రదింపులు, సబంధాలు పెంచుకోవటం చట్టరీత్యా నేరమన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని