logo

కటకటా.. ఇదీ బడిబాట

లుపు లేని అభ్యాసం.. (‘లెర్నింగ్‌ వితౌట్‌ బర్డన్‌) పేరిట యశ్‌పాల్‌ సమితి 1993లో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖకు అందించిన నివేదిక ప్రాథమిక విద్యాస్థాయి పాఠ్యపుస్తకాల మోత తగ్గించాలని సూచించింది.

Published : 29 Sep 2022 02:20 IST

తరగతి పెరిగే కొద్దీ సంచి బరువు మెత

ఈనాడు, బెంగళూరు : అలుపు లేని అభ్యాసం.. (‘లెర్నింగ్‌ వితౌట్‌ బర్డన్‌) పేరిట యశ్‌పాల్‌ సమితి 1993లో కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖకు అందించిన నివేదిక ప్రాథమిక విద్యాస్థాయి పాఠ్యపుస్తకాల మోత తగ్గించాలని సూచించింది. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా.. దేశ భవిష్యత్తును మోసే బాలలు చిన్నతనంలోనే మానసిక, శారీరక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారని హెచ్చరించింది. ఈ నివేదిక సమర్పించి సరిగ్గా 30 ఏళ్లు దాటింది. నేటికీ ఈ సమస్య పరిష్కారం కానేలేదు. కర్ణాటక హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన కొన్ని సూచనలతో.. ఈ సమస్య తీవ్రతను మరోమారు తెరపైకి తెచ్చింది. తుమకూరుకు చెందిన న్యాయవాది రమేశ్‌ నాయక్‌ వేసిన పిటీషన్‌ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆర్ధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ‘స్కూల్‌ బ్యాగ్‌ విధానం-2020’పై వివరణ ఇవ్వాలని సర్కారును ఆదేశించడంతో విద్యారంగంలో కీలక చర్చకు తెరతీసినట్లయ్యింది.

ఆదేశాలకే పరిమితం
బాలలు మోసే పాఠ్యపుస్తకాల సంచుల బరువు అంశం కేవలం రాష్ట్రానికి పరిమితం కాలేదు. 2006లో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ‘బాలల పుస్తకాల సంచి బిల్లు’ ప్రస్తుతం అడ్రస్‌ లేకుండా పోయింది. 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ స్పందిస్తూ పాఠశాలల సంచుల బరువు ఆయా తరగతులకు అనుగుణంగా ఉండాలని సూచించింది. వీటికి అనుగుణంగా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తరగతుల వారీగా సంచుల బరువును మానసిక వైద్యులు, వైద్య, న్యాయ రంగాలకు చెందిన నిపుణుల సూచన మేరకు నిర్దేశించింది. 2020లో స్కూల్‌ బ్యాగ్‌ విధానం కూడా తెస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు ఇవిగో
* విద్యార్థి వాస్తవిక బరువు కంటే 10 శాతం లోపు సంచి బరువు ఉండాలి.
* 1, 2 తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వరాదు.
* ముందు రోజే టైమ్‌టేబుల్‌ ప్రకటించి అందుకు అనుగుణంగానే పుస్తకాలను బడులకు తీసుకురావాలి.
* తరగతి రాతను తరగతి గదిలోనే పూర్తి చేయించి ఫైలింగ్‌ చేయించాలి.
* ప్రతి తరగతిలో విద్యార్థుల పుస్తకాల కోసం ప్రత్యేక వ్యవస్థలుండాలి.
* తాగునీటి సీసాలను మోయకుండా బడిలోనే శుభ్రమైన నీటిని అందించే ఏర్పాటు తప్పనిసరి.
* ప్రతి నోట్‌బుక్‌ గరిష్ఠంగా వంద పేజీలకు మించి ఉండరాదు.
* ప్రతి నెలా మూడో శనివారం ‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ ఆచరణ తప్పనిసరి. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాల లేకుండా తరగతుల నిర్వహణ. ఇందులో విద్యా పర్యటనలు, సామాన్య జ్ఞానంపై అవగాహన, కళల్లో శిక్షణ, క్రీడలు, అబాకస్‌, నృత్య, చర్చల వంటి కార్యక్రమాలను నిర్వహించాలి.

గంటల ప్రయాణం..
తాజా హైకోర్టు తాఖీదుల వెనుక తుమకూరు న్యాయవాది అందించిన ఓ అధ్యయన నివేదిక ఆందోళన కల్గించేలా ఉంది. వారంలో ఐదు రోజుల పాటు తుమకూరు, చిక్కబళ్లాపుర, గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరుకు వస్తున్న వేలాది విద్యార్థులు (5 నుంచి 10వ తరగతి వరకు) కనీసం 10 కిలోల బరువైన పుస్తకాల సంచులను మోస్తున్నారు. వీరు ప్రయాణించే బస్సుల్లో కనీసం కూర్చునేందుకు సీట్లు కూడా దొరకవు. గంటల కొద్దీ నిలబడే ఉంటున్నారు. బరువైన సంచులతో ఇలా ప్రయాణించటంతో విద్యార్థులు శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని న్యాయవాది అందించిన నివేదికలో ప్రస్తావించారు.

సమస్యల వలయం..
అసోచామ్‌, సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ అండ్‌ లా, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇండియా విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా చేపట్టిన అధ్యయనాల ప్రకారం బెంగళూరు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 48 శాతం మంది వెన్నెముక సమస్యతో, 52 శాతం మంది వెన్నెముక, తల ఓ వైపు వాలిపోతున్న, కండరాల సమస్యతో బాధపడుతున్నారు. 43 శాతం మంది ఈ రెండు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 250 ప్రభుత్వ, 430 ప్రైవేటు పాఠశాలలకు చెందిన ఐదు వేల మంది విద్యార్థులను అసోచామ్‌ రాష్ట్ర ఆరోగ్య విభాగం సమీక్షించింది. ఎక్కువగా 7- 13 ఏళ్లలోపు పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వీరిలో 45 శాతం మంది విద్యార్థులు వారి శారీరక బరువుకంటే అధిక బరువును మోస్తున్నారు. రాష్ట్రంలోనూ చిక్కబళ్లాపుర జిల్లా పంచాయతీ దేశంలో తొలిసారిగా ‘నో బ్యాగ్‌ డే’ను ఆచరించినా.. ఆ తర్వాత ఈ విధానాన్ని కొనసాగించలేకపోయింది.

అధ్యయన సమితి ఏర్పాటు
గతంలో పుస్తకాల సంచి బరువును సమీక్షించి మార్గదర్శకాలను అమలు చేయాలని ఓ సమితిని ఏర్పాటు చేశారు. హైకోర్టు నోటీసులు ఇటీవలనే అందుకున్నాం. ఇకపై పాఠశాలల్లో ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలు అమలయ్యేలా చూస్తాం. చాలా పాఠశాలల్లో పుస్తకాలను ఉంచే వ్యవస్థ లేక ఈ విధానాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. సంచుల బరువుపై రాష్ట్ర పాఠశాలల విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అంతగా లేవు. -బీసీ నాగేశ్‌, విద్యాశాఖ మంత్రి

శక్తికొద్దీ.. లాగితే గానీ కదలని సంచి

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని