logo

పీఎఫ్‌ఐ మాటెత్తితే వేటు

పీఎఫ్‌ఐపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో ఆ సంస్థకు మద్దతుగా ఎవరైనా ప్రకటనలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. నిషేధం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ముందస్తుగా తీసుకున్న చర్యలను ప్రశంసించారు.

Published : 30 Sep 2022 02:49 IST

అరగ జ్ఞానేంద్ర

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : పీఎఫ్‌ఐపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో ఆ సంస్థకు మద్దతుగా ఎవరైనా ప్రకటనలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. నిషేధం అనంతరం రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ముందస్తుగా తీసుకున్న చర్యలను ప్రశంసించారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరు, తీర ప్రాంత జిల్లాలు, కొడగు, చిక్కమగళూరు, కలబురగి, విజయపుర తదితర ప్రాంతాల్లో కేఎస్‌ఆర్పీ దళాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక అధికారాలతో పీఎఫ్‌ఐ ఆస్తుల జప్తును హోం శాఖ నిర్వహిస్తుందని చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే సంస్థల విషయంలో కఠినంగా ఉంటామని తేల్చిచెప్పారు. దేశ భక్తులను తయారు చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలపై ప్రతిసారీ విమర్శలు చేయడం విపక్ష నేత సిద్ధరామయ్యకు అలవాటుగా మారిందని విమర్శించారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎస్‌డీపీఐని బ్యాన్‌ చేయలేదని కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎస్‌డీపీఐ రాజకీయ పార్టీ అని, వారిపై ఇప్పటి వరకు దేశ ద్రోహానికి సంబంధించిన ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. ఏ పార్టీ, సంస్థపైన అయినా దేశద్రోహం, విధ్వంసాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేయబోమని తేల్చిచెప్పారు.

విడగొట్టేది వారే..
హావేరి: భారత్‌ను ఎవరు అనుసంధానం చేస్తున్నారో, భారతదేశాన్ని ఎవరు విడగొట్టారో ప్రజలందరికీ తెలుసని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. హావేరిలో గురువారం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. భారత్‌ జోడో యాత్రకు సాహితీవేత్తలు మద్దతు ఇచ్చారు కదా అన్న ప్రశ్నకు ‘అన్ని పార్టీలకు మద్దతుగా నిలిచే సాహితీవేత్తలు ఉన్నారు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు. హావేరిలో నవంబరులో అఖిల భారత సాహిత్య సమ్మేళనాలను నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే అధికారులు సన్నాహాలు చేపట్టారని చెప్పారు. పీఎఫ్‌ఐపై నిషేధాన్ని విధించిన రీతిలో ఎటువంటి ఆరోపణలు రుజువు కాకుండా రాజకీయ పార్టీగా ఉన్న ఎస్‌డీపీఐపై నిషేధం సాధ్యం కాదు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం మినహా సిద్ధరామయ్య, హరిప్రసాద్‌లకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. విధానసౌధలో ఒకమాట, వెలుపల మరో మాట మాట్లాడడం వారికి అలవాటైన ధోరణి అని విమర్శించారు.

ఉన్నతాధికారులతో సమీక్ష
బెంగళూరు (యశ్వంతపుర): పీఎఫ్‌ఐ, ఇతర సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్‌, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రజనీశ్‌గోయల్‌ తదితరులతో హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర గురువారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిషేధం అమలును ఎలా చేపట్టిందీ సమీక్షించారు. కేజీహళ్లి, డీజీహళ్లి ఘర్షణలలో పీఎఫ్‌ఐ పాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

‘సిద్ధుకు మతిభ్రమణం’
శివమొగ్గ: దేశ ద్రోహానికి పాల్పడుతున్న పీఎఫ్‌ఐ, ఇతర సంస్థలపై నిషేధాన్ని విధించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన విపక్ష నేత సిద్ధరామయ్య ఇప్పుడు- ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ సంస్థలపై భాజపా నిషేధాన్ని విధించిందని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప విమర్శించారు. ఆయన వ్యాఖ్యల తీరు చూస్తే మతిభ్రమించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఈ మధ్య ఆయన సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను చులకన చేస్తూ మాట్లాడడం సిద్ధరామయ్యకు అలవాటైపోయిందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 150 సీట్లు భాజపాకు వస్తాయని సిద్ధుకు తెలియడంతోనే విమర్శలు ఎక్కువ చేశారని ఆరోపించారు.

ముస్లిం సంఘాల హర్షం
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : తీవ్రవాద సంస్థలకు మద్దతుగా నిలిస్తున్న ఆరోపణలపై పీఎఫ్‌ఐ, మరికొన్ని సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధాన్ని విధించడం పట్ల పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేశారు. బెంగళూరు ఆర్‌టీ నగరలోని తన నివాసం వద్ద జనతాదర్శన్‌ నిర్వహించిన ముఖ్యమంత్రి బొమ్మైను కొన్ని ముస్లిం సంఘాల ప్రతినిధులు కలుసుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. మతఘర్షణలకు తావివ్వకుండా, ద్వేషపూరిత ప్రసంగాలను చేసే వారిపై చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.


బొమ్మైతో కరచాలనం చేస్తున్న ముస్లిం సంఘాల ప్రతినిధులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని