logo

రాచనగరిలో రమ్య విహారం!

విఖ్యాత మైసూరు దసరా వేడుకలు ఊపందుకున్నాయి.

Updated : 01 Oct 2022 09:43 IST

కన్నుల పండుగగా దసరా వేడుకలు

విద్యుత్తు దీపాల వెలుగులో ప్యాలెస్‌ మైదానం

మైసూరు, న్యూస్‌టుడే : విఖ్యాత మైసూరు దసరా వేడుకలు ఊపందుకున్నాయి. సాయంత్రం కురుస్తున్న చిరుజల్లులను లక్ష్యం చేయకుండా పర్యాటకులు రాచనగరి వీధుల్లో సంచరిస్తున్నారు. మైసూరు మహారాజ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న యువ దసరా వేడుకల్లో భాగంగా నవదుర్గల దర్శనం, విఘ్న నివారకుని ఆరాధన, శివ స్మరణలతో వివిధ కళా బృందాలు ప్రేక్షకులను అలరించాయి. మైసూరు బాలల దసరాను మంత్రి బీసీ నాగేశ్‌, గ్రామీణ దసరాను మంత్రి సోమశేఖర్‌, మాజీ మంత్రి జి.టి.దేవేగౌడ గురువారం సాయంత్రం ప్రారంభించారు. దసరా యోగ సమితి ప్యాలెస్‌ ముందు శుక్రవారం యోగథాన్‌ను నిర్వహించింది. లోక్‌సభ సభ్యుడు ప్రతాప సింహ యోగాసనాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్యాలెస్‌ నుంచి టౌన్‌హాల్‌ వరకు గుర్రపుబగ్గీ (టాంగా)లపై వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. పర్యాటక శాఖ, పురాతత్వ శాఖ సంయుక్తంగా దంపతుల కోసమే కొన్ని టాంగాలను నడుపుతుంది. కోట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రైతు దసరాను మంత్రి బి.సి.పాటిల్‌ ప్రారంభించారు. ఎద్దుల బండి ఎక్కి మంత్రి కొంతదూరం ప్రయాణించారు. జీకే మైదానంలో వ్యవసాయ పరికరాల మేళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మానస గంగోత్రి ఆవరణలో రాణి బహద్దూర్‌ ఆడిటోరియంలో యువ కవి గోష్ఠి నిర్వహించారు. ఈ గోష్ఠిని ఎమ్మెల్యే జి.టి.దేవేగౌడ ప్రారంభించారు. సుమారుగా 30కుపైగా కవులు ఈ గోష్ఠుల్లో పాల్గొంటారు. యువ దసరా, క్రీడా దసరా వేడుకలను మైసూరుకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లాధికారి డాక్టర్‌ బగాది గౌతమ్‌ తెలిపారు.

ప్యాలెస్‌లో సందర్శకులు
ప్యాలెస్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫల-పుష్ప ప్రదర్శనను సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రైవేటు దర్బార్‌ సమయం మినహా మిగిలిన అన్ని సమయాల్లో ప్యాలెస్‌ వీక్షణకు సందర్శకులు వస్తున్నారు. చాముండిబెట్ట, బృందావన్‌ గార్డెన్‌, జూ వద్ద రద్దీ కొనసాగుతోంది. ప్యాలెస్‌కు మొత్తం 97,000 విద్యుత్తు దీపాలు ఉండడం, రాత్రుళ్లు దీపపు వెలుగుల్లో దాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ప్యాలెస్‌ను 1912లో నిర్మించగా, దాని నిర్మాణానికి అప్పుడు రూ.41.47 లక్షల ఖర్చు వచ్చింది. సుమారు 245 అడుగుల పొడవు, 156 అడుగుల వెడల్పుతో ఉన్న ప్యాలెస్‌పై గోపురం భూమట్టం నుంచి 145 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీనికి బంగారు పూత ఉన్న రేకును తాపడం చేసి ఉంటుంది. వారంతం కావడంతో శనివారం, ఆదివారం సందర్శకులు, పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది.

బంగారు సింహాసనంపై శ్రీకంఠదత్త ఒడెయరు పూలబొమ్మ

ఎర్రకోట నమూనా ముందు వరుసగా ఏనుగులు, ఒంటెలు, గొర్రెల బొమ్మలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని