logo

పశ్చిమాన ఎగసిన.. జనచేతన

రాష్ట్రంలో మూడో రోజున భారత ఐక్యతా యాత్రలో జనచైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు గాంధీ జయంతిని సందేశాత్మకంగా ఆచరించారు. 1932లో మహాత్మాగాంధీ సందర్శించిన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా బదనవాళు ఖాదీ కేంద్రంలో జయంతి కార్యక్రమాన్ని ఆచరించారు.

Published : 03 Oct 2022 04:23 IST

మూడు దశాబ్దాల వైరానికి చరమగీతం
ఐక్యతా యాత్రకు పెరుగుతున్న స్పందన

ఈనాడు, బెంగళూరు: రాష్ట్రంలో మూడో రోజున భారత ఐక్యతా యాత్రలో జనచైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు గాంధీ జయంతిని సందేశాత్మకంగా ఆచరించారు. 1932లో మహాత్మాగాంధీ సందర్శించిన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా బదనవాళు ఖాదీ కేంద్రంలో జయంతి కార్యక్రమాన్ని ఆచరించారు. గాంధీ విగ్రహానికి శ్రద్ధాంజలి, భజనలు, సామూహిక భోజన కార్యక్రమాలతో ఆ గ్రామంలో సందడి నెలకొంది. రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సుర్జేవాలా, విపక్ష నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్‌, పరిషత్తులో విపక్ష నేత హరిప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 7:30 గంటల నుంచి 3 గంటల వరకు ఈ కేంద్రంలో పాల్గొన్న కాంగ్రెస్‌ శ్రేణులు సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్రను కొనసాగించాయి. కదకోళ పరిసరాల్లోని కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజల తర్వాత మొదలైన యాత్ర రాత్రి 7 గంటలకు బండిపాళ్య వద్ద సేదదీరింది.

జోరువానలోనూ అనర్గళ ప్రసంగం

బదనవాళలో శాంతి సందేశం

దాదాపు 3 దశాబ్దాల క్రితం ఓ హింసాత్మక సంఘటనతో నెలకొన్న సామాజిక వైరానికి గాంధీ జయంతి నాడు రాహుల్‌గాంధీ బృందం చరమగీతం పాడింది. 1993లో బదనవాళలో దేవస్థాన ప్రారంభోత్సవం సందర్భంగా చెలరేగిన గొడవల్లో ముగ్గురు దళితుల హత్య ఆ గ్రామంలో విద్వేషాన్ని రగిలించింది. నేటికీ ఈ రెండు సముదాయాల మధ్య సమన్వయం లేక వైషమ్యం రాజ్యమేలింది. ఐక్యతా యాత్ర సార్థకత చేకూర్చే క్రమంలో ఆదివారం ఈ రెండు సముదాయాల కుటుంబాలతో సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసి సామరస్యాన్ని నింపారు. మూడు దశాబ్దాలుగా మూసివేసిన రహదారిని కూడా బాగుచేసిన కాంగ్రెస్‌ శ్రేణులు ఈ గ్రామంలో మునుపటి వాతావరణాన్ని సృష్టించారు. ఈ యాత్రలో ఇదో చరిత్రాత్మక సంఘటనగా కాంగ్రెస్‌ అభివర్ణించింది.

ఖాదీ కార్మికుల సమస్యలపై

స్వదేశీ ఉద్యమంలో తనవంతుగా సేవలందించిన బదనవాళు ఖాదీ కేంద్రాన్ని గుజరాత్‌ సబర్మతి ఆశ్రమంగా తీర్చిదిద్దాలని కర్ణాటక పర్యాటక శాఖ తీర్మానించిన విషయం తెలిసిందే. ప్రముఖ సామాజిక వేత్త మేధా పాట్కర్‌, బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌లు ఈ కేంద్రానికి చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కేంద్రంలో కనీస వేతన నిబంధనలు అమలు కావడం లేదని గుర్తించారు. ఈ కేంద్రంలో పని చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలపై రాహుల్‌గాంధీ ఆరా తీశారు. రోజుకు రూ.125ల కనీస వేతనం, పాత యంత్రాలతో పని చేయడం కష్టతరంగా ఉందని వీరంతా రాహుల్‌గాంధీకి వివరించారు. ఈ కేంద్రానికి ప్రభుత్వం మరిన్ని నిధులు అందించాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

బహిరంగసభలో ఐక్యతను చాటుతున్న కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌తోనే ఐక్యత

కాంగ్రెస్‌కు మాత్రమే దేశాన్ని సమైక్యపరిచే శక్తి ఉందని కేపీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య ప్రకటించారు. యాత్ర విరామంలో వీరు మాట్లాడుతూ ఎన్నికల కోసం ఈ యాత్ర చేపట్టడం లేదన్నారు. ప్రజల సమస్యలను ఆలకించేందుకు నిర్వహించే ఈ యాత్రలో స్వచ్ఛందంగా ప్రజలు అడుగులు వేశారన్నారు. పార్టీ సిద్ధాంతం ఎన్నటికీ మారదు. ఈ రోజున మూడు దశాబ్దాల వైరాన్ని తొలగించి చరిత్ర సృష్టించినట్లు వీరు ప్రకటించారు. అధికారంలో ఉన్న భాజపా మాత్రం రాజకీయాల కోసం సమాజంలో విద్వేషాలను పోషిస్తున్నట్లు ఆరోపించారు. ఈ యాత్రలో ‘పే సీఎం’ టీషర్ట్‌ ధరించిన యువకుడిపై పోలీసులు చేసిన దాడి సర్కారు నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ఆ యువకుడిపై ఓ పోలీసు పిడిగుద్దులతో హింసించిన తీరు ప్రజలంతా గమనించారు. మేము కూడా పే సీఎం షర్టులు ధరిస్తాం. మమ్మల్ని అడ్డుకోవాలని సవాలు విసిరారు. ఈ యాత్ర కొనసాగుతుండగానే తనకు ఈడీ సమన్లు పంపటం కూడా రాజకీయ ప్రేరేపిత చర్యగా డీకే శివకుమార్‌ ఆరోపించారు. ఆ యాత్ర గురించి సమాచారం ఉన్న సీబీఐ, ఈడీలు తనను వేధించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఏసీబీ విచారణ చేస్తున్న కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

6న సోనియా రాక?

ఏఐసీసీ నేత సోనియాగాంధీ రాష్ట్రంలో కొనసాగే ఐక్యతా యాత్రలో పాల్గొంటారని డీకే శివకుమార్‌ వెల్లడించారు. సోనియాగాంధీ రాక ఈ యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపినట్లు చెప్పారు. ఏ రోజున వస్తారని ఇంకా తనకు సమాచారం లేదన్నారు. త్వరలో ఏఐసీసీ ఈ వివరాలు వెల్లడిస్తుందన్నారు. ఐక్యతా యాత్రకు 4,5 తేదీల్లో విరామం ఉండగా, 6నుంచి పునఃప్రారంభమయ్యే యాత్రలో సోనియాగాంధీ పాల్గొనే అవకాశాలున్నట్లు కేపీసీసీ వర్గాలు వెల్లడించాయి.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని