logo

మైమరచిన రాచనగరి విహారి

విఖ్యాత దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగే జంబూ సవారీ, కాగడాల ప్రదర్శనతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

Updated : 04 Oct 2022 05:26 IST

దసరా సెలవులు.. పోటెత్తిన పర్యాటకులతో మైసూరు వీధులు కిటకిట

మైసూరు, న్యూస్‌టుడే : విఖ్యాత దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగే జంబూ సవారీ, కాగడాల ప్రదర్శనతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. జంబూసవారీలో ప్రదర్శించే 43 స్తబ్ద చిత్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అశ్వదళం, గజదళాల అభ్యాసం సోమవారమూ కొనసాగింది. ఈ వారాంతం వరకు నగరానికి పర్యాటకులు వచ్చి వెళతారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. పర్యాటకుల కోసం ప్యాలెస్‌ ఆవరణలో ఫలపుష్ప ప్రదర్శన, భారత్‌ స్కౌట్్స అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఆహార ఉత్సవం, దసరా వస్తు ప్రదర్శనలు కొనసాగించనున్నారు. చాముండి బెట్ట, మైసూరు జంతు ప్రదర్శనశాల, బృందావన్‌ గార్డెన్స్‌, రైల్వే మ్యూజియం, శ్రీరంగపట్టణ కారంజి లేక్‌, పక్షిధామ, మేలుకోట, నంజనగూడు, బిళిరంగనబెట్టి, గోపాలస్వామి బెట్ట, మలెమహదేశ్వర, కొడగు తదితర ప్రాంతాలకు సందర్శకులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ప్యాలెస్‌ ఆవరణ నుంచి బన్ని మండపం వరకు బుధవారం జంబూసవారి కొనసాగే మార్గంలో వాహనాల రాకపోకలపై ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిషేధం విధిస్తామని పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ చంద్రగుప్త తెలిపారు. పర్యాటకులు, వాహనదారుల సంఖ్య ఎక్కువ కావడంతో శనివారం నుంచి ఈ ప్రాంతాల్లో సంచరించడం కష్టంగా మారింది. దొడ్డగడియార, ఆల్బర్ట్‌ విక్టర్‌ రోడ్డు, సయ్యాజిరావు రోడ్డు, ధన్వంతరి రోడ్డు, ఇర్విన్‌ రోడ్డు, చామరాజ డబుల్‌ రోడ్డు, ఎంజీ రోడ్డు, శివరాం పేట, అరస్‌ రోడ్లలో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. శ్వానప్రియులను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన జాగిలాల ప్రదర్శనకు రెండు వందలకు పైగా వివిధ జాతుల శ్వానాలతో వాటి యజమానులు వచ్చారు. యువ దసరా ఉత్సవాలకు సోమవారం తెరపడింది. అంబా ప్యాలెస్‌లో రాజవంశస్తుడు యదువీర్‌ సోమవారం ప్రైవేటు దర్బారు నిర్వహించారు. మంగళవారం ఆయుధ పూజ చేస్తారు. అంబారీ బస్సులు, టాంగా ఎక్కి వీధుల్లో సంచరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. మైసూరులోని అన్ని హోటళ్లు, రిసార్టులు, క్లబ్‌లు 100 శాతం నిండిపోయాయని మైసూరు హోటళ్ల సంఘం అధ్యక్షుడు సి.నారాయణ గౌడ తెలిపారు. గురువారం వరకు ఎక్కడా గదులు ఖాళీ లేవని ఆయన చెప్పారు.

జయచామరాజేంద్ర ఒడెయరు కూడలి కళకళ

అన్నిచోట్లా కిటకిటా

మైసూరు అనంతరం శ్రీరంగపట్టణం, ఉడుపి, మంగళూరు, పుత్తూరు, కొడగు తదితర ప్రాంతాల్లో దసరా వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పిల్లి వేష (పులివేషం) ధారణతో స్థానిక కళాకారులు పోటీ పడుతున్నారు. బాలల నుంచి పెద్దల వరకు ఒంటికి రంగు వేసుకుని వీధుల్లో, దుకాణాల వద్ద నృత్యాలు చేయడం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పుత్తూరు ఎమ్మెల్యే సంజీవ మఠందూరు పులివేషధారులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. కొడగులో దసరా సమితి, దశమండపాల సమితి నేతృత్వంలో ఘనంగా దసరాను ఆచరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కొడగు ఆహార మేళాలను ఎమ్మెల్యే కె.జి.బోపయ్య ప్రారంభించారు. ఈ వారాంతం వరకు కొడగులో వేడుకలు కొనసాగనున్నాయి. కుశాలనగర కుందన నాట్యకళా బృందం, డ్యాన్స్‌ కర్ణాటక రియాలిటీ షో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన జాతరల్లో రద్దీ కొనసాగుతోంది. గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా దసరాలో ఆయా రంగాల్లో ప్రతిభ చూపించిన మహిళలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఉడుపిలో ఉచ్చిల దసరా వేడుకలను నిర్వహిస్తుండగా, 101 మంది కళాకారులు ఏకకాలంలో వీణా వాదనతో ఆకట్టుకున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమానికి పది వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. బాగలకోటలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఆదివారం కవాతు నిర్వహించారు. ఏటా ఒకసారి మాత్రమే కవాతు నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు గత ఏడాది నుంచి రెండుసార్లు కవాతు నిర్వహిస్తున్నారు. దసరాకు ముందు వచ్చే ఆదివారం కేవలం బాలురు మాత్రమే గణవేషధారులుగా కవాతులో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత.

కంసాళె కళాకారులతో మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌


శారాదామాత పూజ చేస్తున్న యదువీర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని