logo

మేళతాళాలతో స్వాగత తోరణాలు

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ ఐక్యత యాత్ర నాలుగో రోజు మైసూరులో ఉత్సాహవంతంగా సాగింది. కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, బీకే హరిప్రసాద్‌ తదితరులు ఆయనతో కలిసి నడిచారు.

Published : 04 Oct 2022 02:18 IST

తన చిత్రాన్ని శరీరంపై వేయించుకున్న యువకుడితో రాహుల్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ ఐక్యత యాత్ర నాలుగో రోజు మైసూరులో ఉత్సాహవంతంగా సాగింది. కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, బీకే హరిప్రసాద్‌ తదితరులు ఆయనతో కలిసి నడిచారు. దారి పొడవునా కాంగ్రెస్‌ కార్యకర్తలు, విద్యార్థులు, జానపద కళాకారులు స్వాగతం పలికారు. భద్రత ఎక్కువ కావడంతో ఎవరూ ఆయన వద్దకు వెళ్లలేక పోతున్నారు. కొందరిని ఆయనే స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కేరళ నుంచి వచ్చి కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో.. రాహుల్‌ జోక్యం చేసుకున్నారు. బాలలు, మహిళలు, యువతులతో కలిసి కొంత దూరం నడిచారు. బాలలకు మిఠాయిలు ఇచ్చి సంతోషం పంచుకున్నారు.

చాముండేశ్వరి దేవస్థానంలో రాహుల్‌ పూజ

* యాత్రలో భాగంగా రాహుల్‌తో పాటు పార్టీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌సింగ్‌ సుర్జేవాల తదితరులు చాముండేశ్వరి దేవస్థానానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం.. మైసూరులోని మస్జీద్‌- ఈ ఇఝమ్‌ మసీదుకు వెళ్లారు. అక్కడ ముల్లాలు ప్రార్థనలు నిర్వహించి రాహుల్‌ను సత్కరించారు. పురాతన సెయింట్‌ ఫిలోమినా చర్చిలోనూ ప్రార్థనలు చేశారు. అక్కడి ఫాదర్లు ప్రార్థనలు చేసి అభిషేక జలాలను చల్లారు. క్రైస్తవ సన్యాసులను రాహుల్‌ కలిసి మాట్లాడారు. పాదయాత్ర సమయంలో ఓ యువతిని దగ్గర తీసుకుని క్షేమసమాచారం విచారించారు. భజన కళాకారులతో కలిసి తాళాలు వేశారు. వారితో కలిసి నృత్యం చేశారు. తన బొమ్మను శరీరంపై గీయించుకుని పాదయాత్రకు వచ్చిన యువకుడితో ఉత్సాహంగా కాసేపు మాట్లాడారు. మైసూరులోకి రాహుల్‌కు జానపద కళాకారులు స్వాగతం పలికారు. యాత్ర సాగే రహదారికి ఇరువైపులా విద్యార్థులు జేజేలు పలికారు. ఉదయం 6.30 గంటలకు మైసూరు ఆర్‌-గేట్‌ నుంచి ప్రారంభమైన యాత్ర మధ్యాహ్నం 12 గంటలకు బమ్మూర్‌ అగ్రహారకు చేరుకుంది. అక్కడ భోజనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీరంగపట్టణ కె.ఎస్‌.ఆర్టీసీ బస్టాండు నుంచి పాదయాత్ర ప్రారంభమై మండ్య జిల్లాలోకి అడుగుపెట్టింది.

సుత్తూరు మఠంలో శివరాత్రి దేశికేంద్ర స్వామి ఆశీస్సులు పొందిన వేళ..

మైసూరు మస్జీద్‌- ఈ అఝమ్‌ మసీదులో కాంగ్రెస్‌ నేతల బృందం


సెయింట్‌ ఫిలోమినా చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని