logo

విపణికి పండగ కళ!

దసరా, ఆయుధ పూజల నేపథ్యంలో ఇటు బెంగళూరు.. అటు మైసూరులో మార్కెట్లు కిటకిటలాడాయి. ఇసుకేస్తే నేలరాలనంతగా జనం కదలిరావడంతో సోమవారం రాకపోకలు పలు దఫాలుగా స్తంభించిపోయాయి. బెంగళూరులో పెద్ద సంఖ్యలో పూజాసామగ్రి కొనుగోలు చేశారు.

Published : 04 Oct 2022 02:18 IST

బెంగళూరు : కేఆర్‌ మార్కెట్‌ వీధి.. కిటకిటలు

శివాజీనగర, న్యూస్‌టుడే : దసరా, ఆయుధ పూజల నేపథ్యంలో ఇటు బెంగళూరు.. అటు మైసూరులో మార్కెట్లు కిటకిటలాడాయి. ఇసుకేస్తే నేలరాలనంతగా జనం కదలిరావడంతో సోమవారం రాకపోకలు పలు దఫాలుగా స్తంభించిపోయాయి. బెంగళూరులో పెద్ద సంఖ్యలో పూజాసామగ్రి కొనుగోలు చేశారు. చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, రామనగర, మాగడి, ఆనేకల్‌ ప్రాంతాల నుంచి పాతిక లోడుల గుమ్మడికాయలు రాగా, ఆది, సోమవారాల్లో నాలుగు వందల లారీల్లో అవే కాయలను తరలించుకొచ్చేంతగా డిమాండు ఏర్పడింది. రెండు నెలలుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పంట ఆశించిన స్థాయిలో రాలేదని చిక్కబళ్లాపురకు చెందిన యువ రైతు మహేశ్‌ తెలిపారు. బూడిద గుమ్మడి కాయ కిలోకు వ్యాపారులు, దళారులు రైతుకు రూ.20 చెల్లిస్తుండగా, మార్కెట్లో రూ.40కి విక్రయిస్తున్నారు. ఊబకాయం, మధుమేహ నియంత్రణకు ఈ కాయరసం చక్కగా పని చేస్తుండంతో గత కొన్నేళ్లుగా ఈ పంట సాగుపై ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలతో దిగుబడి తగ్గడంతోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. పూలు, పండ్లు, పత్రాల విక్రయాల జోరు చెప్పనలవి కాదు. పిండి వంటలకు ఉపకరించే పదార్థాలూ విపరీతంగా అమ్ముడుపోయాయి.

ధార్వాడ : దుర్గాష్టమి పూజల్లో పాల్గొన్న విశేష భక్తగణం


భక్తిప్రపత్తులతో పూజలు

భార్య చెన్నమ్మతో కలిసి పూజ చేస్తున్న బొమ్మై

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : దొడ్డబళ్లాపుర సమీపంలోని బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడలోని తన కుమారుడు భరత్‌ నిర్వహిస్తున్న మ్యాగ్నటిక్‌ ఫొటో కంపెనీ పరిశ్రమలో ముఖ్యమంత్రి బొమ్మై తన భార్య చెన్నమ్మతో కలిసి సోమవారం ఆయుధ పూజ చేశారు. పూజలో కుటుంబ సభ్యులతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ పాల్గొన్నారు. గత ఏడాది కూడా ముఖ్యమంత్రి పరిశ్రమలో పూజలో పాల్గొని తానే స్వయంగా అక్కడి సిబ్బందికి బోనస్‌ అందజేశారు.


మైసూరు : దేవరాజ్‌ విపణిలో కిక్కిరిసిన దుకాణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని