logo

వన్యమృగాలకు.. రక్షణ దుర్గం

అడవుల్లో అనుకూల పరిస్థితులు లేనప్పుడు దగ్గరిలోని గ్రామాల వైపు పరుగులు పెట్టడం వన్యమృగాల జీవనానికి అనివార్యం. ఈ పరిస్థితి మానవుడికి సంకటాన్ని కలిగిస్తోంది.

Published : 05 Oct 2022 01:10 IST

పంట, ప్రాణ నష్టానికి భారీ పరిహారం

ప్రాజెక్టులతో జంతువులకు సంకటం

అడవి కంటే తోటలే నయం

ఈనాడు, బెంగళూరు : అడవుల్లో అనుకూల పరిస్థితులు లేనప్పుడు దగ్గరిలోని గ్రామాల వైపు పరుగులు పెట్టడం వన్యమృగాల జీవనానికి అనివార్యం. ఈ పరిస్థితి మానవుడికి సంకటాన్ని కలిగిస్తోంది. ఈ సంఘర్షణ కొన్నిసార్లు ప్రాణ నష్టాన్ని తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో ఈ సంఘర్షణ ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవటం, లక్షలాది ఎకరాల పంట నష్టపోవటం సంభవిస్తోంది. తాజాగా ముగిసిన వర్షాకాల విధానసభ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు ఈ సంఘర్షణపై ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంట చేతికందక ముందే వన్యమృగాల పాలవటం, ఆ నష్టం ప్రకృతి విపత్తు కోవలోనికి రాకపోవటం వల్ల రైతులు సంకట స్థితిలో ఉన్నారన్నది ఈ సభ్యుల వాదన.

అభివృద్ధి పనులూ అడ్డుకట్టే
రాష్ట్ర ప్రభుత్వం మేకెదాటు ప్రాజెక్టుపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి వస్తే మానవ- మృగాల సంఘర్షణ మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావేరి నదీ పరీవాహకంలోని సంగం, హలగురు, ముగూరు, మలెమహదేవ కొండ, బీఆర్‌టీ పులుల సంరక్షణ, బన్నేరుఘట్ట ఉద్యానం ఈ ప్రాజెక్టు ఫలితంగా 57 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అంతరించే ప్రమాదం ఉంది. జీవవైవిధ్యతకు నెలవైన ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించటం అంత సులువైన పని కాదని వన్యజీవి పరిరక్షణ సంస్థ సంచాలకుడు డేనియల్‌ దాస్‌ వివరించారు. ఈ ప్రాంతాల్లో ఏనుగులు, పులులు, చిరుతులు, వైవిధ్య పక్షులు నివసిస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండే అటవీ ప్రాంతాన్ని మరుసృష్టి చేయటం కష్టతరమని అభిప్రాయపడుతున్నారు.

వైజ్ఞానిక పరిహారం
వ్యవసాయ పెట్టుబడులు, పంట ధరలకు అనుగుణంగా పరిహారాన్ని సవరించాం. సాంకేతికత ఆధారంగా వన్యమృగాల నుంచి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నాం. వన్యమృగాలను సురక్షితంగా తరలించే రైతులకు ప్రోత్సాహధనం, వీటిని రక్షించే సిబ్బంది అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తున్నాం. జంతువులను రెచ్చగొట్టే విధానాలు అనుసరించకుండా, వాటిని సురక్షించే అడవులకు తరలించే ఏర్పాటుకు సహకరించాలని ప్రజలకు ప్రత్యేక సూచనలు చేస్తున్నాం.
-విజయకుమార్‌ జోగి, పీసీసీ, అటవీశాఖ

రక్షణ వలయానికి అడ్డు
తాజా గణాంకాల ప్రకారం.. 2021-22లో 22 ఏనుగులు, రెండు పులులు, ఎనిమిది అడవి పందులు, మూడు చిరుతలు, మూడు మొసళ్లు, ఓ తోడేలు మరణించాయి. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల్లో చామరాజనగర జిల్లా హణూరు ఎమ్మెల్యే ఆర్‌.నరేంద్ర లేవనెత్తిన ఓ అంశం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. శివమొగ్గలో పంటలను ధ్వంసం చేసే ఏనుగులను చామరాజనగర జిల్లాలోని అడవుల్లో విడిచిపెడుతుంటారు. అక్కడి నుంచి పరిసర గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు పంట పొలాల్లోనే స్థిరంగా నివసించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు కారణం చామరాజనగర జిల్లాలో ఏనుగుల పరిరక్షణ వలయంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటమే. వన్యమృగాలు, మానవ సంఘర్షణ కేసులు అత్యధికంగా నమోదయ్యే కొడగు, చామరాజనగర, హాసన, ఉత్తర కర్ణాటకలో వన్యమృగాల పరిరక్షణకు సంబంధించిన విధానాలు సక్రమంగా అమలు చేయలేకపోవటం వల్ల అవి అడవుల కంటే జనావాసాలనే సౌకర్యంగా మలచుకుంటున్నాయని ఆ ఎమ్మెల్యే సభకు వివరించారు. ఏటేటా మృగాల దాడిలో ప్రాణనష్టం, పంట నష్టం ప్రమాణం పెరగటం కూడా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించేలా మారిందని కొడగు జిల్లాకు చెందిన సభ్యులు వాపోయారు.

పరిహారం.. పరిష్కారం
ఏటా పెరుగుతున్న మానవ- మృగాల సంఘర్షణ కేసుల నేపథ్యంలో పరిహార మొత్తాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం.. ఇకపై వన్యమృగాల దాడులలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.7.5లక్షలు (గతంలో రూ.5లక్షలు), 60 శాతం గాయపడితే రూ.లక్ష, పంట నష్టానికి రూ.50 వేలు చెల్లిస్తారు. పరిహారం.. అసలు సమస్యకు పరిష్కారం సాధ్యం కాదని వన్యమృగ పరిరక్షణ వాది రమేశ్‌ బెళగెరె అభిప్రాయపడ్డారు. ఏనుగులను అడ్డుకునేందుకు ఇనుప దిమ్మెలతో అడ్డుకట్ట, విద్యత్తు కంచెలను వేయటం వల్ల వాటి మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటేటా ఏనుగులు, పులుల సంరక్షణకు సంబంధించిన పరిస్థితులపై నివేదిక ఇస్తున్నామన్నారు. అటవీశాఖ నేతృత్వంలో మృగాల ఆవాసానికి అనువైన ప్రాంతాలకు తరలించే విధానాలు గడచిన ఐదేళ్లుగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.

వన్య ప్రాణులకూ ప్రాణభయం ఎక్కువే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని