logo

ఐక్యతా యాత్రకు గట్టి పోటీ

కాంగ్రెస్‌ చేపడుతున్న భారత్‌ ఐక్యతా యాత్ర రాష్ట్రంలోని కీలక పార్టీలను పునరాలోచనలో పడేస్తోంది.

Published : 05 Oct 2022 01:10 IST

కన్నడనాట రాహుల్‌ పాదయాత్రపై అన్ని పార్టీల దృష్టి

ఈనాడు, బెంగళూరు : కాంగ్రెస్‌ చేపడుతున్న భారత్‌ ఐక్యతా యాత్ర రాష్ట్రంలోని కీలక పార్టీలను పునరాలోచనలో పడేస్తోంది. ఎంత విమర్శించినా ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ యాత్రకు దక్కుతున్న ప్రజా స్పందన తోసిపుచ్చలేని అంశం. అధికార పక్షం భాజపా, ఏకైక ప్రాంతీయ పార్టీ జనతాదళ్‌ ఈ యాత్రను అంత సులువుగా తీసుకునేందుకు ఏమాత్రం సాహసించటం లేదు. సిద్ధరామోత్సవం, మేకెదాటు పాదయాత్ర, ఆగస్టు 15న ఫ్రీడమ్‌ మార్చ్‌లతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపు విజయవంతమైనట్లే. ఈ యాత్రలకు గుమిగూడే వారంతా ఓటర్లుగా మారలేరన్న అభిప్రాయాలెలా ఉన్నా.. దక్కుతున్న ప్రజా స్పందనకు పోటీ కార్యక్రమాలు నిర్వహించటం ప్రత్యర్థులకు అనివార్యంగా మారింది.

*  సిద్ధరామోత్సవ కార్యక్రమం అధికార భాజపా ఆలోచనలను మార్చింది. అప్పటికే రెండేసి మార్లు జనోత్సవాన్ని వాయిదా వేసిన భాజపా ఎట్టకేలకు దొడ్డబళ్లాపురలో ఆ కార్యక్రమాన్ని ముగించుకుంది. మూడేళ్ల సర్కారు ప్రగతిని కొనియాడేందుకు అధిష్ఠానం నుంచి కీలక నేతలు రాకపోవటంపై భాజపా రాష్ట్ర శాఖ అసంతృప్తికి గురైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా హోం మంత్రి అమిత్‌ షా కోసం ఎదురుచూసిన బొమ్మై సర్కారుకు నిరాస ఎదురైంది. మరోవైపు యడియూరప్ప నేతృత్వంలో శివమొగ్గలో కార్యకర్తల సమావేశం, ముఖ్యమంత్రి, నళిన్‌ కుమార్‌ కటీల్‌లతో రాష్ట్ర పర్యటనలకు అధిష్ఠానం నుంచి అనుమతి దక్కకపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్‌ గాంధీ యాత్రతో కాంగ్రెస్‌ దూకుడుకు కళ్లెం వేయటం అధికార పక్షానికి ఎంతైనా అవసరం. కేవలం ఐదారు నెలల్లో విధానసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలు అనివార్యంగా చేపట్టాలని తీర్మానించింది. ఇందులో భాగంగా అక్టోబరు 30న కలబురగిలో ఓబీసీ ర్యాలీని ఏర్పాటు చేయాలని కమలనాథులు తీర్మానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు రాష్ట్ర కార్యవర్గం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 54 శాతం ఓటర్లున్న ఓబీసీలలో 205 ఉపజాతుల నేతలను ఈ సమావేశానికి హాజరుపరచి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మోర్చా తీర్మానించింది. అంతకు ముందు శుక్రవారం ప్యాలెస్‌ మైదానంలో భాజపా కార్యవర్గ సమావేశానికి అమిత్‌ షాను ఆహ్వానించటం, 9 నుంచి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో రాష్ట్ర పర్యటన, కెంపేగౌడ 108 అడుగుల భారీ విగ్రహ ప్రతిష్ఠాపనకు జేపీ నడ్డాలను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించింది.

పంచరత్న రథయాత్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రారంభించే భారత రాష్ట్ర సమితి- బీఆర్‌ఎస్‌కు పూర్తి సహకారం ఇస్తూ జాతీయ ప్రస్థానానికి సిద్ధమవుతున్న జేడీఎస్‌ త్వరలో ‘పంచరత్న రథయాత్ర’కు సిద్ధం కానుంది. పార్టీకి పట్టున్న క్షేత్రాలు క్రమంగా ఇతర పార్టీల పరం కావటంతో దళపతులు డీలాపడుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు 120 క్షేత్రాల్లో పంచరత్న రథయాత్రను నిర్వహించాలని ఆ పార్టీ నేత కుమారస్వామి నిర్ణయించారు. పాతమైసూరు ప్రాంతంలోని ఎనిమిది క్షేత్రాల ఆశావహులతో సమావేశమైన కుమారస్వామి ఈ యాత్ర కోసం సిద్ధం కావాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ జోడో యాత్రకు ముందుగానే తాను జనతా జలధారె యాత్రకు శ్రీకారం చుట్టానని కుమారస్వామి గుర్తు చేశారు. యాత్రల్లో హంగామా కంటే ఆ యాత్రల ఉద్దేశాన్ని ప్రజలకు అందించటం ముఖ్యం. ఈ సందేశాన్ని పంచరత్న రథయాత్రతో చేస్తామని జేడీఎస్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని