logo

పరేశ్‌ మెస్తా కలకలం

భాజపా గెల్చిన ప్రతి నియోజకవర్గంలోనూ పరేశ్‌ మెస్తా వంటి అమాయకుల రక్తం చిందిన దాఖలాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేయడం రాజకీయ కలకలం రేపింది.

Published : 05 Oct 2022 01:10 IST

సిద్ధు ట్వీట్‌తో మాటల యుద్ధం

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : భాజపా గెల్చిన ప్రతి నియోజకవర్గంలోనూ పరేశ్‌ మెస్తా వంటి అమాయకుల రక్తం చిందిన దాఖలాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ చేయడం రాజకీయ కలకలం రేపింది. ‘మీరు అనుభవిస్తున్న అధికారపు కుర్చీకి మెస్తా వంటి వ్యక్తుల రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి’ అని బాజపా కర్ణాటక ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. మెస్తా కేసులో సీబీఐ అధికారులు బీ- రిపోర్టు దాఖలు చేయడం పట్ల సిద్ధు ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. హొన్నావరకు చెందిన మెస్తా హత్యకు గురయ్యారని పోలీసులు కేసు నమోదు చేసుకోగా.. అది హత్య కాదు హఠాన్మరణం అని సీబీఐ నివేదిక ఇవ్వడం దురదృష్టకరమని సిద్ధు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెస్తా మరణిస్తే దానికి కాషాయ రంగును పులిమి భాజపా నాయకులు తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ ఆరోపించారు. అప్పటి ఘర్షణల్లో ఐజీపీ కారుపైకి రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ రోజు తమను విమర్శించిన భాజపా నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

భాజపా ఎదురుదాడి..
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పరేశ్‌ మెస్తా హత్య కేసులో సీబీఐ న్యాయస్థానానికి దాఖలు చేసిన నివేదికను తాము ఇంకా చూడలేదని భాజపా నేత, ఎమ్మెల్సీ రవికుమార్‌ పేర్కొన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆ పార్టీ నాయకులు నాశనం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో భాజపా క్షమాపణలు అడిగే ప్రశ్నే లేదని అన్నారు. భాజపా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 24 మంది హిందూ సంఘాల కార్యకర్తలు, పరేశ్‌ మెహతా, ధార్వాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగీశ్‌ గౌడ తదితరుల హత్యలు జరిగాయని గుర్తు చేశారు. జిల్లాధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతి, డీవైఎస్పీ గణపతి ఆత్మహత్య కేసు, అరకావతి కుంభకోణంలో క్లీన్‌ చిట్ ఇప్పించుకున్న ఆరోపణలు సిద్ధరామయ్యపై ఉన్నాయని ఆరోపించారు. యడియూరప్ప, అశోక్‌, శోభాకరంద్లాజె తదితరులు టిప్పు ఖడ్గాన్ని పట్టుకుని ఉన్న చిత్రాలను కాంగ్రెస్‌ పార్టీ నేతలు విడుదల చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. భాజపాను మైనార్టీలకు వ్యతిరేకులుగా సృష్టించడం తగదన్నారు. సిద్ధరామయ్య టిప్పు టోపీ పెట్టించుకుంటారని, కాషాయ కండువా వేస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని