logo

రా..రమ్మంటున్న రాచనగరి!

చారిత్రక మైసూరు జంబూ సవారీకి సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది పర్యాటకులు కదలివచ్చే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది.

Published : 05 Oct 2022 01:10 IST

బెంగళూరులోని జీవనకళల కేంద్రంలో అమ్మవారికి హారతులిస్తున్న వేళ..

మైసూరు, న్యూస్‌టుడే : చారిత్రక మైసూరు జంబూ సవారీకి సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది పర్యాటకులు కదలివచ్చే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లను మైసూరు జిల్లా వ్యవహారాల బాధ్య మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌ మంగళవారం పరిశీలించారు. స్తబ్ద చిత్రాలు, వాటిని తరలించే శకటాలను తనిఖీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2.36 నుంచి 2.50 మధ్యలో ప్యాలెస్‌ నుంచి అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులు, గుర్రాలు, పోలీసు సిబ్బంది కవాతు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 నుంచి 5.20 మధ్యలో నాడదేవత చాముండేశ్వరి దేవికి ముఖ్యమంత్రి బొమ్మై పుష్పార్చన చేస్తారు. రాత్రి ఏడు గంటల సమయానికి బన్నిమండపానికి ఏనుగులు చేరుకుంటాయి. అనంతరం పది గంటల వరకు కాగడాల ప్రదర్శన ఉంటుంది. అక్కడితో నవరాత్రి ఉత్సవాలకు తెరపడుతుంది. భద్రతకు సంబంధించిన పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ చంద్రగుప్త డీసీపీలతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ప్యాలెస్‌, జంబూ సవారీ కొనసాగే మార్గాల్లో వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. జంబూసవారీలో ముఖ్యమంత్రితో పాటు మహారాజు యదువీర్‌ కృష్ణదత్త, మంత్రులు సోమశేఖర్‌, సునీల్‌ కుమార్‌, మేయరు శివకుమార్‌, ఎమ్మెల్యే ఎస్‌.ఎ.రామదాసు తదితరులు పాల్గొంటారు. కాగడాల ప్రదర్శనలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ప్రహ్లాద్‌ జోషి రాజీవ్‌ చంద్రశేఖర్‌, శోభా కరంద్లాజె తదితరులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. పోలీసు బ్యాండుతో పాటు 100కు పైగా కళాకారుల బృందాలు జంబూ సవారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

అందరికీ మేలు..
మైసూరు, న్యూస్‌టుడే : కన్నడ ప్రజలకు చాముండేశ్వరి సకల మంగళాన్ని కలిగిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పేర్కొన్నారు. బుధవారం జంబూసవారీలో పాల్గొనేందుకు మంగళవారం రాచనగరికి వచ్చిన ఆయన మండకళ్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత దసరా ఉత్సవాలను ఘనంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా పాలన యంత్రాంగం తీసుకున్న చర్యలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు సిబ్బంది విశ్రాంతి తీసుకోకుండా ఆయా కార్యక్రమాల నిర్వహణ బాధ్యత తీసుకున్నారని చెప్పారు. నగర పౌరులు, హోటళ్ల సిబ్బంది, వ్యాపారుల సహకారంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దసరాను ఘనంగా నిర్వహించామన్నారు. కొవిడ్‌ కారణంగా నేటి సాయంత్రం నిర్వహించే కాగడాల ప్రదర్శనలో తాను పాల్గొనడం లేదని గవర్నర్‌ గహ్లోత్‌ ప్రకటించారని చెప్పారు.


మైసూరు ప్యాలెస్‌ ముంగిట జంబూసవారీకి సకల సన్నాహాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని