logo

పండగ సంబరాలు ఊరంతా తోరణాలు!

కరోనా కష్టాలు కరిగిపోవడంతో.. రెండేళ్ల తర్వాత నగర ప్రజలు దసరా పండుగను ఘనంగా ఆచరించేందుకు సిద్ధమయ్యారు.

Published : 05 Oct 2022 01:10 IST

పూల విపణిలో ఎప్పటిలానే రద్దీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కరోనా కష్టాలు కరిగిపోవడంతో.. రెండేళ్ల తర్వాత నగర ప్రజలు దసరా పండుగను ఘనంగా ఆచరించేందుకు సిద్ధమయ్యారు. పరిశ్రమలు, కంపెనీల్లో మంగళవారం ఉదయమే పూజలు నిర్వహించి, ఉద్యోగులకు బోనస్‌లు ఇచ్చారు. గుమ్మడికాయ కొట్టి తమ సంస్థలకు సెలవు ప్రకటించారు. మల్లేశ్వరం, యశ్వంతపుర, సిటీ మార్కెట్లలో మధ్యాహ్నం వరకు పూలు, పండ్లు, తోరణాలు, అరటిఆకులు, బొరుగుల కొనుగోళ్లు కొనసాగాయి. మధ్యాహ్నం తర్వాత రహదారులు ఖాళీగా కనిపించాయి. ఇళ్ల వద్ద తమ వాహనాలను శుభ్రం చేసుకున్న వాహనదారులు, వాటికి పూజలు చేసుకున్నారు. నగరానికి చుట్టుపక్కల ఉంటున్న వారిలో ఎక్కువ మంది మంగళవారం ఉదయమే తమ వాహనాల్లో తరలి వెళ్లారు. దూర ప్రాంతాల ప్రజలు సోమవారం సాయంత్రమే వెళ్లారు. లెక్కకు మించిన పర్యాటకులతో విధానసౌధ, కబ్బన్‌ ఉద్యానం, లాల్‌బాగ్‌ కిటికిటలాడాయి.

వాహనాలకు పూజ..
బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఆయుధ పూజను పురస్కరించుకుని కనకపురలోని డీకేఎస్‌ ఛారిటబుల్‌ ట్రస్టు కార్యాలయంలో వాహనాలకు పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ పూజచేశారు. కావేరి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలు పాల్గొన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జనతాదళ్‌ రాష్ట్రాధ్యక్షుడు సి.ఎం.ఇబ్రహీం తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జాతీయ పార్టీని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలతో కలిసి కుమారస్వామి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. జంబూ సవారీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బొమ్మై హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం నుంచి రాచనగరికి మంగళవారం సాయంత్రం బయలుదేరారు.

వాహనాలకు పూజ చేస్తున్న డి.కె.శివకుమార్‌
 


కుటుంబ సభ్యులతో కలిసి వాహన పూజలో యడియూరప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని