logo

అడుగడుగునా..సోనియా జోష్‌!

కాంగ్రెస్‌ యాత్రలో 29వ రోజు.. రాష్ట్రంలో ఐదో రోజు.. 89 కిలోమీటర్లు కొనసాగిన భారత్‌ ఐక్యతా యాత్రకు గురువారం కొండంత బలం చేకూరింది.

Published : 07 Oct 2022 02:30 IST

ఉత్సాహాన్ని నింపిన అధినేత్రి

సిద్ధుతో కలిసి రాహుల్‌ దౌడ్‌..

ఈనాడు, బెంగళూరు : కాంగ్రెస్‌ యాత్రలో 29వ రోజు.. రాష్ట్రంలో ఐదో రోజు.. 89 కిలోమీటర్లు కొనసాగిన భారత్‌ ఐక్యతా యాత్రకు గురువారం కొండంత బలం చేకూరింది. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ రాకతో ఈ యాత్ర మరింత వేగం పుంజుకుంది. ఓ వైపు అనారోగ్యాన్ని లెక్కచేయని సోనియాగాంధీ యాత్రకు వస్తున్న మద్దతుతో శక్తిని కూడబెట్టుకోగా, ఆమె నడకలతో యాత్ర మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. వెరసి 29వ రోజు యాత్ర గురువారం రాత్రి 7గంటలకు బ్రహ్మదేవరహళ్లిలో సేదదీరింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు సోమవారమే కర్ణాటకకు చేరుకున్న సోనియగాంధీ మంగళ, బుధవారాల్లో కుటుంబ, పార్టీపరమైన చర్చలతో గడిపారు. విజయదశమి నాడు హెచ్‌డీ కోటె భీమనకొల్లిలోని ప్రసిద్ధి చెందిన భీమనకొల్లి మహదేశ్వర దేవాలయాన్ని సందర్శించిన సోనియాగాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రెండు నిమిషాల పాటు ధ్యానం చేశారు. అంతకు ముందు నాగరహొళె జాతీయ ఉద్యానాన్ని కుమారుడు రాహుల్‌గాంధీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా 15 కి.మీ.ల సఫారీ చేసిన సోనియాగాంధీ తన చరవాణిలో ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఇదే సందర్భంగా రాహుల్‌గాంధీ స్వయంగా తీసిన ఏనుగు చిత్రం సామాజిక మాధ్యమంలో ఉంచిన గంటల వ్యవధిలోనే వేలాది మంది వీక్షించారు. ఏనుగు, తన బిడ్డతో ఉన్న చిత్రానికి ‘ఎ మదర్స్‌ లవ్‌’ అన్న శీర్షిక సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. సోనియగాంధీ విడిది చేసిన రిసార్టులో పార్టీ నేతలు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, దిగ్విజయ్‌ సింగ్‌, కేసీ వేణుగోపాల్‌ తదితరులతో రాహుల్‌, సోనియగాంధీలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించారు.

మరింత ఉత్సాహం
ముందుగా ప్రకటించినట్లే సోనియాగాంధీ రాకతో మండ్య జిల్లాలోని ఐక్యతా యాత్రకు జనం పోటెత్తారు. ఎప్పటిలాగేనే యువత, వృద్ధులు, రైతులు, విద్యార్థులు ఈ యాత్రకు మద్దతుగా అడుగులు వేయగా, గురువారం దివ్యాంగులు తమ మనవి పత్రాలను రాహుల్‌ గాంధీకి అందజేశారు. గురువారం యాత్ర మొదలైన అరగంట తర్వాత సోనియాగాంధీ చేరారు. ఈమెతో మహిళా ఎమ్మెల్యేలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌, అంజలి లింబాళ్కర్‌, రూపకళలు సోనియాగాంధీతో కలిసి నడిచారు. రాహుల్‌గాంధీ సూచన మేరకు కొద్ది సమయం పాటే నడిచిన సోనియాగాంధీ తాను ముందుగా వెళ్లాలనుకున్న సమయం కంటే మూడు గంటల ఆలస్యంగా దిల్లీకి బయలుదేరారు. యాత్రకు లభిస్తున్న మద్దతును చూసి సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం నాటి యాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొనలేక పోయారు. వీరప్పమొయిలీ, దిగ్విజయ్‌సింగ్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, కేహెచ్‌ మునియప్ప, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు సోనియాగాంధీ నడిచినంత సేపు తోడుగా ఉన్నారు. యాత్ర మధ్యాహ్న విరామం సందర్భంగా మండ్య జిల్లా చెరకు, వరి, డైరీ ఉత్పత్తిదారుల కుటుంబాలతో రాహుల్‌ గాంధీ ప్రత్యేక చర్చలో పాల్గొని వారి సమస్యలను ఆలకించారు.

మండ్య సమీపంలో మహిళానాయకులతో కలిసి సోనియా నడక జోరు

భాజపాకు చెల్లుచీటీనే..
ఐక్యతా యాత్రకు ఊహించని మద్దతు లభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం డీలా పడిందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, ఎంపీ జైరాం రమేశ్‌లు అన్నారు. ఆ పార్టీ అధికారం నుంచి తొలగిపోయే రోజులు దగ్గరపడ్డాయయన్నారు. ఈ యాత్రను ఓర్వలేక పత్రికల్లో తప్పుడు ప్రచారాలు చేయటం, డీకే శివకుమార్‌కు సంబంధం లేని కేసుల్లో నోటీసులు పంపటం, యాత్రను చిత్రీకరిస్తున్న పాత్రికేయులపై దాడులతో ప్రభుత్వం తన అసహనాన్ని వ్యక్తం చేస్తోందన్నారు. ఇవేమీ యాత్రను అడ్డుకోలేవన్నారు. ఇదే సందర్భంగా విపక్ష నేత సిద్ధరామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వ సమయంలో ఏర్పాటు చేసిన నాగమోహన్‌దాస్‌ సమితి నివేదికను అమలు చేసి ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్‌ను సవరించాలని డిమాండ్‌ చేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటూ మూడేళ్ల ఆరు నెలలు ముగిసినా ఈ నివేదికపై చర్చించకుండా కొత్తగా సమితి ఏర్పాటు చేస్తామని ప్రకటించటం ఎన్నికల కోసం చేస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. పెరుగుతున్న జనసంఖ్య ఆధారంగా ఎస్‌సీ, ఎస్‌టీలకు 22.7శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తనయుడితో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్ర

‘ప్రభావం చూపని యాత్ర’
కర్ణాటకలో కొనసాగుతున్న ఐక్యతా యాత్ర రానున్న ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. సాధారణంగా పార్టీ నేతలు వారి పార్టీ కోసం కష్టపడి పని చేస్తారు. ఈ యాత్రలో సోనియాగాంధీ కేవలం అర్ధ కిలోమీటర్‌ మాత్రమే నడిచారు.. వెనుదిరిగారని ఎద్దేవా చేశారు. నా ఉద్దేశం ప్రకారం ఈ యాత్ర దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపదన్నారు. ఈ యాత్ర ముందుగానే భాజపా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించినా అసెంబ్లీ సమావేశాలు, దసరా కారణంగా వాయిదా వేశామని ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిచ్చారు. నాగరహొళె అభయారణ్యంలో గాయాలపాలైన గున్న ఏనుగుకు చికిత్స అందించాలని రాహుల్‌గాంధీ చేసిన సూచనకు తాను స్పందించానని ముఖ్యమంత్రి చెప్పారు. అటవీ అధికారులతో చర్చించి చికిత్స అందించాలని సూచించినట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ అధినేత్రికి ఓ అభిమాని పాదాభివందనం

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts