logo

Honey Trap: నేత వలలో స్వామీజీ విలవిల?

కంచుగల్‌ బండెమఠం మఠాధిపతి బసవలింగ స్వామి (45) బలవన్మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతున్న వేళ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు కేంద్ర వలయం ఐజీపీ మొవ్వా చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు.

Updated : 28 Oct 2022 08:57 IST

బసవలింగస్వామి (పాతచిత్రం)

రామనగర, న్యూస్‌టుడే : కంచుగల్‌ బండెమఠం మఠాధిపతి బసవలింగ స్వామి (45) బలవన్మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివిధ కోణాల్లో దర్యాప్తు సాగుతున్న వేళ ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని బెంగళూరు కేంద్ర వలయం ఐజీపీ మొవ్వా చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. కుదూరు ఠాణా నుంచి మాగడి ఠాణాకు కేసును బదిలీ చేశామని ఆయన గురువారం వెల్లడించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. కొందరిని మాగడి ఠాణాలో, మరికొందరిని వారి ఇళ్ల వద్దే విచారిస్తున్నట్లు వివరించారు. మఠాధిపతి సెల్‌ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా ఆయనతో మాట్లాడిన ‘యువతి’ కోసం గాలింపు తీవ్రం చేశామని విలేకరులకు చెప్పారు. మఠంలోని తన గదిలో ఆత్మహత్య చేసుకున్న చోటే స్వామీజీ రాసిన మూడు పేజీల లేఖ దొరికింది. దానితో పాటే దర్యాప్తు అవసరాలకు అనుకూలమైన కొన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. ఆత్మహత్యకు మునుపు ఎవరెవరితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు? ఏం మాట్లాడారో.. గుర్తిస్తే ఈ కేసులోని చిక్కుముడులు వీడిపోతాయని పోలీసులు భావిస్తున్నారు. మానసిక ఒత్తిళ్లతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు

ప్రఖ్యాత సిద్ధంగంగ మఠానికి బండెమఠం మూలం. మఠానికి రూ.50 కోట్ల విలువైన విద్యాసంస్థలు ఉన్నాయి. బసవలింగ స్వామి పేరిట 80 ఎకరాల భూమి ఉంది. చెన్నమల్లయ్య, పుట్టగౌరమ్మలకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో బసవలింగ స్వామి ఒకరు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బండెమఠంలో, అనంతరం సిద్ధగంగ మఠంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. వేదం, ఉపనిషత్‌, విద్వత్తుకు సంబంధించి అభ్యాసం చేశారు. పాతికేళ్ల కిందటే ఈ మఠంలో చిన్న స్వామిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రజతోత్సవాలను కూడా నిర్వహించారు. మఠంపై ఆధిపత్యం సాధించేందుకు ఒక నాయకుడు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. తన మాట వినే వ్యక్తినే మఠాధిపతిగా నియమించేందుకు అనువుగా ఒక యువతితో స్వామీజీని హనీట్రాప్‌ చేయించారని అనుమానిస్తున్నారు. డెత్‌నోట్లో మొత్తం ఆరు పుటలు ఉండగా, వాటిలో మూడు పుటల్ని దాచి ఉంచారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. తనను లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారని, ప్రతిష్ఠకు భంగం కలగడంతో వ్యధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని బలవన్మరణానికి ముందుగా ఆయన లేఖలో రాశారు. మఠాధిపతి వీడియో చాటింగ్‌కు సంబంధించి ఒక వీడియో మాత్రం వెలుగులోకి వచ్చింది. మరో మూడు వీడియోలు ఉన్నాయని డెత్‌నోట్ ఆధారంగా గుర్తించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైతే ఓసామాజిక వర్గానికి తలవంపులు అని మఠం ప్రతినిధులు భావిస్తున్నారు. ఆ వీడియోలను ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకునేందుకు మఠం ప్రతినిధులు చర్యలు చేపట్టారు. మఠాధిపతికి ఆప్తవలయంలో ఉన్న వ్యక్తులు, కారు డ్రైవరు, వ్యక్తిగత కార్యదర్శుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై రామనగర ఎస్పీ సంతోష్‌ బాబుకు మఠం ప్రతినిధులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని