logo

Karnataka: మేకలు.. గొర్రెలు.. కోళ్లు.. వీటి ధరలు వింటే గుండెల‘ధర’పోతాయ్‌!

మేకలు, గొర్రెలు, కోళ్లు ధరలు వింటే హడలిపోవాల్సిందే. డార్ఫర్‌ గొర్రె ధర రూ.6 లక్షలు, జమునాపారి మేక ధర రూ.5లక్షలు, డుంబ గొర్రె ధర రూ.2 లక్షలు, డాంగ్‌ తావ్‌ కోడిధర రూ.30వేలు, నల్లకోడి ధర రూ.వెయ్యి పలుకుతున్నాయి.

Updated : 05 Nov 2022 11:37 IST

రూ.6లక్షల డార్ఫర్‌ గొర్రెలు

రూ.5లక్షలు ధర పలికె జమునాపారి మేక

రూ.2లక్షలు ధర పలికే డుంబ గొర్రెలు

నలుపు రంగు కలిగిన కడక్‌నాథ్‌ కోడి

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: మేకలు, గొర్రెలు, కోళ్లు ధరలు వింటే హడలిపోవాల్సిందే. డార్ఫర్‌ గొర్రె ధర రూ.6 లక్షలు, జమునాపారి మేక ధర రూ.5లక్షలు, డుంబ గొర్రె ధర రూ.2 లక్షలు, డాంగ్‌ తావ్‌ కోడిధర రూ.30వేలు, నల్లకోడి ధర రూ.వెయ్యి పలుకుతున్నాయి. ఇక వాటి కిలో మాంసం ధర రూ.3వేల పైమాటే. అధిక ధరలు పలుకుతున్న గొర్రెలు, మేకలు, కోళ్లను తిలకించాలంటే ఓసారి నగరంలోని జీకేవీకే ఆవరణలో జరుగుతున్న కృషి మేళా-2022 సందర్శించాల్సిందే. చర్మవ్యాధి వ్యాపించడంతో ఈసారి ప్రదర్శనలో పశువులకు నిర్వాహకులు అవకాశం కల్పించలేదు. గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు, బాతులకు అవకాశం కల్పించారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన డార్ఫర్‌ గొర్రె రూ.ఆరులక్షల ధర పలుకుతోంది. 1930లో డార్ఫర్‌ హన్స్‌, నల్లతల పర్షియన్‌ గొర్రె సంకర జాతితో డార్ఫర్‌ను సృష్టించారు. దాన్ని యలహంక సమీపంలోని మారేనహళ్లి ఫారంలో పెంచుతున్నారు. తల నల్లగా మిగతా భాగం తెల్లగా ఎక్కువ బొచ్చుతో ఉంటుందని, విదేశీదైన స్వదేశీ వాతావరణానికి అనుగుణంగా జీవిస్తుందని ఫారం నిర్వాహకుడు సతీశ్‌ తెలిపారు. మూడు,నాలుగు నెలల్లో 40 నుంచి 60 కిలోల బరువు కలిగి ఉంటుందని తెలియజేశారు. మాంసం కన్నా సంతానాభివృద్ధికి ఆ గొర్రెను ఎక్కువగా ఉపయోగిస్తామని చెప్పారు. జమునాపారి మేక అన్ని వాతావరణాలకు తట్టుకుంటుంది. మూడు నెలలకు 35 నుంచి 45 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఆడమేక రోజు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.

* సన్నటి తల, పెద్దకాళ్లతో కూడిన ఆరుకిలోల బరువు కలిగిన డాంగ్‌తావ్‌ (డ్రాగన్‌ బర్డ్‌) కోడి ధర రూ.30వేలు, జత రూ.65వేలు పలుకుతోంది. వియత్నాంకు చెందిన డాంగ తావ్‌ కోళ్లను చేతన్‌ హ్యచరీస్‌ నిర్వాహకుడు చేతన్‌ తెలిపారు. వ్యాపారాన్ని రైతులు దృష్టిలో పెట్టుకుని గిరిరాజ, కావేరి, ఆసీల్‌ క్రాస్‌, కాలింగ్‌బ్రౌన్‌, తదితర రకాల కోళ్లను సాగుతున్నారు. ఇప్పుడు విధానం మారింది. అలంకారం కోసం కాకుండా వ్యాపారం దృష్టిలో పెంచాలని తెలియజేశారు.

*  నలుపు రంగు కలిగిన కడక్‌ నాథ్‌ కోడి వ్యాధుల నియంత్రణకు రామబాణంగా మారింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల్లో ఆదివాసీలు ఆ కోళ్లను పెంచుతునారు. అవి కనుమరుగు కాకుండా వివిధ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. మాంసం, రక్తం నల్లగా ఉంటుంది. ఆ మాంసాన్ని భుజిస్తే పక్షవాతం, మధుమేహం, అస్తమా, తదితర వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని ఆ కోళ్ల పెంపకందారుడు విజయకుమార్‌ తెలిపారు. ఆ కోడి గుడ్లకు మంచి డిమాండ్‌ ఉన్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని