logo

బెళగావిని కబళించేందుకు కుట్ర

బెళగావిని కబళించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మహారాష్ట్రకు సహకరించేలా కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.

Published : 27 Nov 2022 01:38 IST

కదలివచ్చిన దళపతుల రథానికి బ్రహ్మరథం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బెళగావిని కబళించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మహారాష్ట్రకు సహకరించేలా కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. ఒకే దేశం- ఒకే చట్టం అని ప్రకటించే భాజపాకు బెళగావి ఈ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టింపు లేదన్నారు. అధికార పార్టీ నిర్లక్ష్యంతోనే సరిహద్దుల్లో వివాదం ఎక్కువైందన్నారు. జనతాదళ్‌ ‘పంచరత్న’ యాత్రలో భాగంగా ఆయన గౌరీబిదనూరుకు శనివారం చేరుకున్నారు. పట్టణంలో కొంత సేపు పాదయాత్ర చేశారు. ప్రచార రథంపై నుంచి ఎమ్మెల్యే ఎం.కృష్ణారెడ్డి, పార్టీ అభ్యర్థి నరసింహమూర్తి, నిఖిల్‌ గౌడలతో కలిసి స్థానిక వ్యాపార కూడలిలో ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి కమలనాథుల్లో లేదని దుయ్యబట్టారు. నీరు, భూమి, భాష విషయంలో భాజపా ప్రతిసారీ వివాదాలు సృష్టించి, స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళతో కర్ణాటకకు ఎప్పుడూ సరిహద్దు వివాదాలు లేవని, మహారాష్ట్ర మాత్రం ప్రతిసారీ కయ్యానికి కాలుదువ్వుతోందని ఆక్రోశించారు. ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నామన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని విన్నవించారు. బెళగావిలో పదేళ్లలో 27 చక్కెర పరిశ్రమలు ప్రారంభించారని, వాణిజ్య నగరిగా గుర్తింపు దక్కించుకుని- ఆదాయాన్ని గడిస్తున్న నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని ఆరోపించారు. ఉత్తర పినాకిని నదీ జలాల వివాదాన్ని తీవ్రం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటకలో 51 నదులు, ఉపనదులు ఉన్నాయని, ఆ జలాలు వృథా కాకుండా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమకు పూర్తి మెజారిటీతో అధికారాన్ని కట్టబెడితే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గౌరీబిదనూరులో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని, వ్యాపారం చేసుకుంటున్నారని, దాన్ని చెడగొట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో దళ్‌ అభ్యర్థి నరసింహమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని