logo

అక్రమాల చిలుమె వదిలిస్తాం

గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల సమాచారం చోరీ కావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. చిలుమె సంస్థ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు.

Published : 27 Nov 2022 01:38 IST

అంబేడ్కర్‌ విగ్రహంపై గులాబీ రేకులు చల్లుతున్న బొమ్మై

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : గోప్యంగా ఉండాల్సిన ఓటర్ల సమాచారం చోరీ కావడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. చిలుమె సంస్థ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధానసౌధ ఆవరణలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి, ఎమ్మెల్సీ ఛలవాది నారాయణ స్వామి తదితరులతో కలిసి శనివారం నివాళి అర్పించి విలేకరులతో మాట్లాడారు. సంస్థలు, అధికారులు తప్పు చేస్తే శిక్ష విధించే దిశలోనే ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశిస్తుందని చెప్పారు. ఓటరు సమాచారం చౌర్యానికి సంబంధించిన కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. తొలగించిన పేర్ల వివరాలను ఎన్నికల కమిషన్‌ పరిశీలించి, తప్పును సరి చేస్తుందని వివరించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో మరణించిన, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన, రెండు చోట్ల ఓటరు కార్డులు ఉన్న వారి పేర్లను ఎన్నికల కమిషన్‌ తొలగిస్తుందని చెప్పారు. బెళగావిలో శీతాకాల సమావేశాలను నిర్వహించే సమయంలో కిత్తూరు రాణి చెన్నమ్మ, సంగొళ్లి రాయణ్ణ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని వెల్లడించారు. వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్‌ ఇచ్చిన నివేదిక అందిన వెంటనే నిపుణులతో పరిశీలించి సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతిజ్ఞా విధి చదువుతున్న ముఖ్యమంత్రి బొమ్మై, స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి తదితరులు

* అన్ని గ్రామ పంచాయతీలలోని గ్రంథాలయాల్లో రాజ్యాంగ ప్రతిని ఉంచాలని అధికారులకు సూచనలు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఒంటబట్టించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తమ ధర్మగ్రంథంగా భావించాలని సూచించారు. అధికార వికేంద్రీకరణను మరింత విస్తరణ కావలసిన అవసరం ఉందన్నారు. ఏకరూప పౌరస్మృతి జారీ చేయాలన్నది భాజపా ఎన్నికల ప్రణాళికలో కీలక అంశమని గుర్తు చేశారు. దీన్ని జారీ చేసేందుకు పలు రాష్ట్రాల్లో సమితులు ఏర్పాటయ్యాయని తెలిపారు. అదే దిశలో కర్ణాటకలోనూ ఏకరూప పౌరస్మృతి జారీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

* రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విధానసౌధ సభామందిరంలో ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రతిజ్ఞా విధిని బోధించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని