logo

ఉగ్ర పోరు కోసం.. ఏకే-47

అనూహ్యంగా గడచిన శనివారం మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలడంతో గాయపడిన అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ (24) నిషేధిత లష్కరే తోయిబా సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు విఫలయత్నం చేశాడని జాతీయ తనిఖీ దళం తన దర్యాప్తులో తేలింది.

Updated : 27 Nov 2022 06:14 IST

మంగళూరు, న్యూస్‌టుడే : అనూహ్యంగా గడచిన శనివారం మంగళూరులో కుక్కర్‌ బాంబు పేలడంతో గాయపడిన అనుమానిత తీవ్రవాది మహ్మద్‌ షారిఖ్‌ (24) నిషేధిత లష్కరే తోయిబా సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు విఫలయత్నం చేశాడని జాతీయ తనిఖీ దళం తన దర్యాప్తులో తేలింది. సంఘ పరివార్‌, తీర ప్రాంత జిల్లాలలో కొందరు రాజకీయ నేతలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసేందుకు ఏకే-47ను తెప్పించుకునేందుకు ప్రయత్నించాడని అధికారులు వివరించారు. విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధరించకుండా నిర్బంధం, ‘ధర్మ దంగల్‌’ పేరిట ముస్లిం వ్యాపారుల బహిష్కరణ తదితరాలతో క్రోధాన్ని పెంచుకున్న అతను మంగళూరులో విధ్వంసాలకు కుట్రను రూపొందించుకున్నాడని ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో గుర్తించారు. షారిఖ్‌ చరవాణిలో 189 వ్యక్తుల పేర్లు, నంబర్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువ కాల్స్‌ స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, మంగళూరు, మైసూరు యువకులు ఉన్నారు. మైసూరులో బాడుగకు ఉంటున్న ఇంట్లో నిందితుడు వంట చేసుకునేవాడు కాదు. ఆన్‌లైన్‌లో ఆర్డరు చేసి తెప్పించుకునేవాడు. విద్వేషాలను రెచ్చగొట్టేలా గోడలపై రాతలు రాసిన కేసులో షారిఖ్‌ను మంగళూరు పోలీసులు గత ఏడాది జులైలో అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లా న్యాయస్థానం అతనికి జామీను ఇవ్వకపోవడంతో, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ వ్యక్తికి 2021 సెప్టెంబరు 8న షరతులతో కూడిన జామీను మంజూరైంది. అప్పటి నుంచి కోర్టు ముందు విచారణకు హాజరు కాకుండా, బెంగళూరు, మైసూరు, తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ జామీను షరతులను ఉల్లంఘించాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతూ తన సహచరులతో కలిసి శివమొగ్గ జిల్లాలో తుంగా నది తీరంలో తాను తయారు చేసిన బాంబును గతంలో పేల్చిచూశాడు. అతని సహచరులు దొరికిపోయిన తర్వాత షారిఖ్‌ కోసం పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. కుక్కర్‌లో బాంబును తరలిస్తున్న సమయంలో అది పేలడంతో గాయపడి దొరికిపోయాడు. జాతీయ తనిఖీదళం ఈ నిందితునిపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. అనుమానిత తీవ్రవాదులు మహ్మద్‌ మతీన్‌, సౌదీ అరేబియాలో ఉన్నాడని భావిస్తున్న అరాఫత్‌ అలితో కలిసి షారిఖ్‌ బాంబుల తయారీ, ఇతర తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసుకున్నారు. పదికి పైగా ఎన్‌ఐఏ బృందాలు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభించాయి.

సొంత వాహనం లేదు: షారిఖ్‌ ఎక్కడకు వెళ్లినా, క్యాబ్‌, ఆటో, బస్సు, రైళ్లలో వెళ్లేవాడు. ఓఎల్‌ఎక్స్‌ వంటి వెబ్‌సైట్ల నుంచి పాత మిక్సీలు, గ్రైండర్లు కొనుగోలు చేసేవాడు. వాటిలో బాంబులు ఉంచి పేల్చేందుకు అనువుగా సిద్ధం చేసుకునేవాడని అనుమానిస్తున్నారు. మైసూరులో రెండు దుకాణాల నుంచి 100కుపైగా అగ్గిపెట్టెలు కొనుగోలు చేశాడు. ఎందుకని ప్రశ్నించగా.. తాను ఇంజినీరునని, ప్రాజెక్టు పనికి అవసరమని చెప్పాడు. షారిఖ్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న వారిని గుర్తించే ప్రయత్నాలను దర్యాప్తు దళం ముమ్మరం చేశారు. మంగళూరులో ఒక ధర్మానికి వ్యతిరేకంగా నిందితుడు గోడలపై ఏడాదిన్నర కిందట పలు నినాదాలు, రాతలు రాశాడు. ఆ సమయంలోనే అతను బాంబుల తయారు చేసేవాడని అనుమానం ఉన్నప్పటికీ, ఆ కోణంలో దర్యాప్తు జరగకపోవడంతో హైకోర్టులో అతనికి తేలికగా జామీను మంజూరైంది.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని