logo

నవ్య విద్యతో నైపుణ్య భారతం!

అత్యుత్తమ మార్కులతో స్నాతకోత్తర విద్య (పీజీ) పూర్తి చేసినా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంలేని విద్యార్ధికి ఉజ్వల భవిష్యత్తును నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)తో అందించే అవకాశం దక్కినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్లేషించారు.

Published : 27 Nov 2022 01:38 IST

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

ఏట్రియా విశ్వవిద్యాలయంలో రిబ్బను కత్తిరిస్తున్న బొమ్మై

ఈనాడు, బెంగళూరు : అత్యుత్తమ మార్కులతో స్నాతకోత్తర విద్య (పీజీ) పూర్తి చేసినా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంలేని విద్యార్ధికి ఉజ్వల భవిష్యత్తును నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)తో అందించే అవకాశం దక్కినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విశ్లేషించారు. ఆమె శనివారం బెంగళూరులో ఏట్రియా విశ్వవిద్యాలయం నిర్వహించిన హరిత భవిష్యత్తు సమ్మేళనం (గ్రీన్‌ ఫ్యూచర్‌ సమ్మిట్‌), వననమ్‌ నవ్యాలోచనల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. నిరంతర అధ్యయనం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం, ఉపాధి అవకాశాల సృష్టికి కేంద్ర, రాష్ట్రాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 21వ శతాబ్దం సాంకేతిక నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తుందని వివరించారు. దేశానికి ఐఐఐటీ, ఐఐఎస్‌సీ స్థాయిలో బోధన ప్రమాణాలు అందించే విశ్వవిద్యాలయాల అవసరం ఉందన్నారు. భావితరానికి హరిత ఇంధనం తయారీ కోసం మెటీరియల్స్‌లో అధ్యయనాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. భారతదేశం జి-20 దేశాలకు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో బెంగళూరులో ఆర్ధిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్‌లతో సమావేశం నిర్వహిస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. చిరు ధాన్యాల్లో అంకురాలతో ఉపాధి, డిజిటల్‌ చెల్లింపులతో గ్రామీణ ప్రాంతాల స్వావలంబన, టెలీ సంజీవని ద్వారా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాట్లాడుతూ రాష్ట్రం సంప్రదాయేతర ఇంధన తయారీ కోసం రూ.2లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. హైడ్రోజన్‌ ఇంధనంపై దృష్టి సారించామన్నారు. రానున్న ఐదేళ్లలో విద్యుత్తు వాహనాల తయారీ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో విద్య, పారిశ్రామిక రంగాల్లో వినూత్న కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏట్రియా సమూహ సంస్థల అధ్యక్షులు సుందర్‌ రాజు, కోర్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ః నగరంలోనే ఉన్న వివేకానంద న్యాయ కళాశాలలో నిర్వహించిన అంకుర సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొని అంకుర ప్రగతి అంశాలను విశ్లేషించారు. కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రసంగించిన ఆమె.. బెంగళూరు నగరంలో అంకుర సాధనలను ప్రస్తావించారు. ఆమెకు కళాశాల నిర్వాహకులు స్మరణిక అందించి సత్కరించారు.

బెంగళూరు వివేకానంద న్యాయ కళాశాల స్టార్టప్‌ సదస్సులో కేంద్ర మంత్రి
నిర్మలాసీతారామన్‌కు స్మరణిక అందిస్తున్న నిర్వాహక ప్రతినిధులు

గ్రీన్‌ సమ్మిట్‌ కరదీపికను ఆవిష్కరిస్తున్న నిర్మలా సీతారామన్‌, ముఖ్యమంత్రి బొమ్మై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని