logo

ఓటకు చేటు

రాజధాని నగర ఓటరు కుదుపునకు లోనయ్యాడు. పక్షం రోజులుగా ఓటరు జాబితాలో అక్రమాలపై పాలక- విపక్ష నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం కేంద్ర ఎన్నికల సంఘం జోక్యానికి తావిచ్చాక పరిణామాలు జోరుగా మారిపోతున్నాయి.

Published : 27 Nov 2022 01:38 IST

అడ్డగోలు జాబితాతో పెనుముప్పు
కదిలిన పాలికె అక్రమాల దొంతర

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగర ఓటరు కుదుపునకు లోనయ్యాడు. పక్షం రోజులుగా ఓటరు జాబితాలో అక్రమాలపై పాలక- విపక్ష నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం కేంద్ర ఎన్నికల సంఘం జోక్యానికి తావిచ్చాక పరిణామాలు జోరుగా మారిపోతున్నాయి. అక్రమాలపై విచారణ ఫలితంగా ఇద్దరు ఐఏఎస్‌ స్థాయి అధికారులపై సర్కారు వేటువేయడంతో జాబితాలో ఏ స్థాయి అక్రమాలు ప్రవేశించాయో అనే ప్రశ్నలు వచ్చిపడుతున్నాయి. ఎన్నికల జాబితా తయారీ విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణపై బెంగళూరు నగర జిల్లాధికారి కె.శ్రీనివాస్‌, పాలికె ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.రంగప్పను సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించక తప్పలేదు. జాబితాలో చెరిపివేతలకు కారణమైన ‘చిలుమె’ అనే సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సంస్థ ప్రముఖులే ఓటరు సమాచారాన్ని దొంగిలించారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం అర్ధరాత్రి వారిద్దరిపై వేటు వేయాలని ఆదేశించింది. మహదేవపుర విధానసభ నియోజకవర్గం అదనపు ఎన్నికల అధికారిగా కె.శ్రీనివాస్‌, శివాజినగర, చిక్కపేట నియోజకవర్గాల అదనపు ఎన్నికల అధికారిగా ఎస్‌.రంగప్ప బాధ్యతలు నిర్వహించడం ప్రస్తావనార్హం. వారిద్దరిపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఆ ఇద్దరూ అనుమతి లేకుండా బెంగళూరు వదలి వెళ్లకుండా నిబంధన విధించారు. శివాజీనగర, చిక్కపేట, మహదేవపుర విధానసభ నియోజకవర్గాల్లో చిలుమె సంస్థ ప్రతినిధులకు బీఎల్‌ఓ గుర్తింపు కార్డులు అందజేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ప్రైవేట్‌ వ్యక్తులకు ఆ గుర్తింపు కార్డులు ఇవ్వకూడదనే నిబంధన ఉంది. దాన్ని ఉల్లంఘించి కార్డులిచ్చారు. శరవేగంగా జాబితాలను పరిశీలించి, సరిదిద్దాలని కేంద్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు శివాజీనగర విధానసభ విభాగానికి ఐఏఎస్‌ అధికారి మేరి ఫ్రాన్సిస్‌, చిక్కపేటకు డాక్టర్‌ ఆర్‌.విశాల్‌, మహదేవపుర విభాగానికి అజయ్‌ నాగభూషణ్‌ను నియమించారు. సోమవారం నుంచి ఈ ముగ్గురూ విధుల్లో నిమగ్నం కానున్నారు.

కె.శ్రీనివాస్‌ ఎస్‌.రంగప్ప

మీట నొక్కితే.. కోతే

బెంగళూరు (యలహంక) : బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఓటరు జాబితా సమీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన ‘చిలుమె’ సంస్థ నిర్వాహకులు ఏసీ గదిలో కూర్చొని తాము అనుకున్న పని కానిచ్చారని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కంప్యూటర్‌లో ఓటరు జాబితాను పరిశీలిస్తూ కేవలం శివాజినగర, చిక్కపేట, మహదేవపుర నియోజకవర్గాలోనే 1.69 లక్షల ఓటర్ల పేర్లను మీట నొక్కి.. నిమిషాల్లో తొలగించారని గుర్తించారు. కొందరు ‘ఫోన్‌ చేయడంతో’ ఈ పని చేశారని పోలీసు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

రెవెన్యూ అధికారుల అరెస్టు

ఓటరు జాబితా అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు పాలికెలో పనిచేసే నలుగురు రెవెన్యూ అధికారు (ఆర్‌ఓ)లను హలసూరుగేట్‌ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఆర్‌ఓలు భీమాశంకర్‌ (చిక్కపేట), సుహేల్‌ అహ్మద్‌ (శివాజీనగర), మహేశ్‌ (ఆర్‌ఆర్‌నగర), చంద్రశేఖర్‌ (మహాదేవపుర)ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఆయా నియోజకవర్గాల్లో చిలుమె సంస్థ ప్రతినిధులకు చట్ట వ్యతిరేకంగా బూత్‌స్థాయి అధికారి (బీఎల్‌ఓ) గుర్తింపు కార్డులు ఇవ్వడంలో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసు విచారణలో గుర్తించడంతో పాలికె చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌గిరినాథ్‌ ఆ నలుగురిపై వేటువేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని