logo

వివాదానికి సరిహద్దులేవి?

బెళగావిలో విధానసభ సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ప్రకటన చేసే ప్రతిసారీ ‘మహా’ సరిహద్దు వివాదానికి రెక్కలు వస్తాయి.

Published : 28 Nov 2022 02:52 IST

శీతాకాల సభాపర్వం వేళ ఆందోళనలు

కొల్హాపుర్‌ ప్రాంతంలో బొమ్మై చిత్రపటంతో నిరసన

ఈనాడు, బెంగళూరు : బెళగావిలో విధానసభ సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ప్రకటన చేసే ప్రతిసారీ ‘మహా’ సరిహద్దు వివాదానికి రెక్కలు వస్తాయి. గతవారం మంత్రివర్గ సమావేశంలో బెళగావిలో డిసెంబరు 19 నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే మహారాష్ట్ర, కర్ణాటక సర్కారుల మధ్య దాదాపు తీవ్ర ఘర్షణ వాతావరణానికి తెరలేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్ష ఆరోపణలకు దిగటంలో సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంటోంది. తాజాగా ఇదే తంతు మరోమారు తెరపైకి వచ్చింది.

* 1960ల నాటి రాష్ట్రాల పునర్విభజన చట్టం, 2004ల నాటి సుప్రీంకోర్టులో మహారాష్ట్ర వ్యాజ్యం.. ఇన్నేళ్లయినా సమసిపోని రాజకీయ విద్వేషానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రతి రాష్ట్రానికి ఒక సరిహద్దు- ఆ సరిహద్దు గ్రామాల్లో ఇరు రాష్ట్రాల ప్రజలు నివసించటం సమైఖ్య భారతంలో సర్వసాధరణ విషయం. రాజ్యంగంలోని ఆర్టికల్‌- 3లో రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా రూపొందించిన మార్గదర్శకాలతో సరిహద్దులు నిర్ణయించారు. అవి భౌగోళికంగా వేరుగా ఉన్నా ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఈ హద్దులు అడ్డుకావు. ఇదే అంశం నేడు రాజకీయాలకు ఒక వేదిక మారటం విషాదకరం. కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య ఈ వివాదం చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తుంటోంది.

* 2021 డిసెంబరులో బెళగావి సువర్ణసౌధ సమావేశాల సందర్భంగా సరిహద్దు వివాదం కాస్త అదుపుతప్పింది. మహారాష్ట్ర ఏకీకరణ సమితి అధ్యక్షుడిపై భౌతిక దాడి, బెళగావిలో సంగొళ్లి రాయణ్ణ, బెంగళూరులో శివాజీ విగ్రహాల ధ్వంస రచన ఇరు ప్రభుత్వాలను కంగారు పెట్టింది. అప్పట్లో ఎన్‌సీపీ- శివసేన ప్రభుత్వం మహారాష్ట్రలో, భాజపా ప్రభుత్వం కర్ణాటకలో ఉండేవి. ఇరు పార్టీల మధ్య రాజకీయ అంతరం ఉండటంతో వివాదం సహజసిద్ధంగానే చెలరేగింది. విధానసభలో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. బెళగావిని మహారాష్ట్రకు ఇవ్వబోమని ఏకంగా తీర్మానమే ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీలోనూ మహారాష్ట్ర ఏకీకరణపై అధికార పక్ష నేతలు స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. ఏడాది గడచిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. భాజపాతో కలిసిన శివసేన అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరిహద్దు వివాదంపై వ్యతిరేకతను చాటటం గమనార్హం. ఇరు రాష్ట్రాల్లో భాజపా పాలన ఉన్నా వివాదం షరా మామూలుగానే కొనసాగింది.


నోరు మెదపని కేంద్రం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడణవిజ్‌లు గతవారం జత్‌ తాలూకాను వదులుకోబోమని ప్రకటించటం, సుప్రీంకోర్టులో తమ వ్యాజ్యానికి జీవం పోయటంతో కర్ణాటక సర్కారు కూడా ఘాటుగా స్పందించింది. బెళగావితో పాటు జత్‌ తాలూకాలోని 80 కన్నడ భాషా గ్రామాలకు ప్రత్యేక సదుపాయాలు ప్రకటించి ఈ వివాదానికి మరింత పదును పెంచింది. అదే సమయంలో మరాఠా భాషా పరిరక్షకులు కర్ణాటక బస్సులపై రాతలు, ముఖ్యమంత్రి బొమ్మై దిష్టి బొమ్మ దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. సుప్రీం కోర్టులో న్యాయపోరాటం, చట్టబద్ధంగా రాష్ట్రానికి చెందాల్సిన గ్రామాలను రక్షించుకోవటం తమ బాధ్యత అంటూ బొమ్మై ప్రకటించారు. కేంద్ర హోం మంత్రి ఆదేశంతో గత నెలలో మహారాష్ట్ర, కర్ణాటక గవర్నర్‌లు ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా ఈ అంశంపై ఆరోపణలు, విమర్శలకు దిగితే కేంద్రం నోరు మెదపకపోవటం ఆశ్చర్యం కలిగించే అంశం.

కర్ణాటక బస్సులకు సరిహద్దులో ‘మహా’ సెగ


కర్ణాటక రక్షణ వేదిక ధర్నా

బెళగావి, న్యూస్‌టుడే : మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలను నియంత్రించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని కర్ణాటక రక్షణ వేదికె ఆరోపించింది. కర్ణాటక బస్సులను ధ్వంసం చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి, శివసేన కార్యకర్తల తీరును ఖండిస్తూ బెళగావిలో వేదికె కార్యకర్తలు ఆదివారం ధర్నాకు దిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం చేశారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ ఉన్న ఒక వాహనం వైపర్‌ను విరగగొట్టి, అద్దాలకు మసి పూసి నినాదాలు చేశారు. పరిస్థితుల అదుపు తప్పకుండా పోలీసులు వారిని నియంత్రించి, అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని