logo

అంతులేని ఓటుకుండ కథ

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఓటరు జాబితా సమీక్ష కార్యక్రమంలో చోటుచేసుకున్న అక్రమాలు తవ్వేకొద్ది.

Published : 28 Nov 2022 02:52 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఓటరు జాబితా సమీక్ష కార్యక్రమంలో చోటుచేసుకున్న అక్రమాలు తవ్వేకొద్ది.. అనేకానేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇంకెన్ని అడ్డగోలు కార్యక్రమాలు దాగున్నాయో అనే ఆందోళన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇద్దరు ఐఏఎస్‌ స్థాయి అధికారులు, నలుగురు రెవెన్యూ అధికారులతో పాటు 11 మందిపై సర్కారు ఇప్పటికే చర్యలు తీసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే ఓ మరకగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పాలికె ఎన్నికలకు గడువు దగ్గర పడుతోందని అందరూ ఆశిస్తున్న వేళ అసలు ఓటరు జాబితాకే మరకలంటడం పెద్ద చర్చకు ఊతమిచ్చింది. అధికారులు సమీక్షించాల్సిన వ్యవహారాలను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించడం.. ‘చిలుమె’ అనే ఆ సంస్థ ఏకంగా ఓటర్ల జాబితాను ఇష్టానుసారం మార్చివేయడం విస్మయాంశమే. ఓటరు జాబితా సమీక్ష పేరుతో ‘చిలుమె’ ఏకంగా వ్యవస్థకే చిలుము పట్టించింది. ఈ అక్రమాలకు అధికారులూ సహకరించారనేది తాజా ఆరోపణ. ప్రాథమిక విచారణ చేపట్టగా శివాజీనగర, చిక్కపేట, మహదేవపుర, ఆర్‌ఆర్‌నగర నియోజకవర్గాల్లో తప్పుల దొంతర కళ్లముందు కదలాడింది. కేంద్ర ఎన్నికల సంఘం విచారించి ప్రాథమిక వివరాలు నివేదించడంతో ఐఏఎస్‌ అధికారులు శ్రీనివాస్‌, ఎస్‌.రంగప్పలను రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాల విధుల నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నలుగురు పాలికె రెవెన్యూ అధికారులు అరెస్టై కటకటాల వెనక్కి చేరారు. తదుపరి ముప్పు ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయాందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు. మిగతా 24 విధానసభ నియోజకవర్గాల్లోని జాబితా నుంచి వేలాది మంది పేర్లను తొలగించారని, వాటిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 వేల నుంచి 35 వేల ఓటర్ల పేర్లను తొలగించారని గుర్తించారు. ఇలా 28 నియోజకవర్గాల్లో 6.52 లక్షల ఓట్లను గల్లంతు చేశారు. అదే సమయంలో కొత్తగా 3.50 లక్షల మందిని చేర్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అన్ని నియోజకవర్గాల ఓటరు జాబితాను పునః పరిశీలనకు ఆదేశించింది. చిలుమె సంస్థ ప్రతినిధులకు బూత్‌స్థాయి అధికారి (బీఎల్‌ఓ) గుర్తింపు కార్డులు మంజూరు చేయాలనే పైఅధికారుల సూచనలతోనే ఆ పని చేసినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియే అక్రమాలను పెంచి పోషించింది. బీఎల్‌ఓ కార్డులు తగిలించుకున్న చిలుమె కార్యకర్తలు పెద్దఎత్తున ఎన్నికల సమాచారాన్ని గాడి తప్పించారనేది ఆరోపణ. నిజానికి ఉచితంగా సేవ చేస్తామంటూ చిలుమె సంస్థ ముందుకు వచ్చింది. ఆ ఉచితం వెనుక భారీ కుట్రను అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియలో కొందరు అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఆ సంస్థ పలువురు నాయకుల వద్ద తీసుకున్న నగదు- ఆ నేతల సూచనతో తొలగించిన ఓటర్ల సంఖ్యపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని