logo

అంతర్జాలంలో రెక్కల చప్పుడు

చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు మేల్కొలుపుతుంటే ఆ అహ్లాదాన్ని వర్ణించడం కష్టమే.

Published : 28 Nov 2022 02:52 IST

కొనుగోలు చేయాలనుకునే వారికోసం.. పక్షులు సిద్ధం

మారతహళ్లి, న్యూస్‌టుడే : చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే.. పక్షుల కిలకిలరావాలు మేల్కొలుపుతుంటే ఆ అహ్లాదాన్ని వర్ణించడం కష్టమే. యాంత్రికమైపోతున్న నగర జీవన విధానంలో ఆ ప్రాకృతిక అనుభూతిని ఆస్వాదించడం కష్టతరమే. ఉద్యాననగరిలో మాత్రం కొందరు పక్షి ప్రేమికులు ఆ అనుభూతిని పొందేందుకు పక్షులకు చేరువవుతున్నారు. వీటికోసం ప్రత్యేక ఫేస్‌బుక్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో పక్షులను పెంచుకునేందుకు అవసరమైన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. మనకు నచ్చిన పక్షులను పొందే అవకాశం ఇక్కడ లభిస్తోంది.

*  చూడ చక్కనైన చిలుకలు, పిచ్చుకలు, రంగు రంగుల విదేశీ పక్షులు.. వాటి కిలకిల రావాలను వింటూ... వాటితో గడపడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఉరకలు పరుగుల జీవితాల మధ్య పక్షులతో కొంత సమయం గడుపుతూ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేవారు అనేకం. ఇలాంటి పక్షి ప్రేమికులంతా ‘బర్డ్‌ లవర్‌ బెంగళూరు’ అనే ఫేస్‌బుక్‌ పేజ్‌ ద్వారా ఓ బృందంగా ఏర్పడ్డారు. 17 వేల మందికి పైగా ఉన్న పేజ్‌ ద్వారా పక్షులను ఆరోగ్యంగా పెంచేందుకు అవసరమైన సమాచారాన్ని పంచుకుంటారు. రెక్కల జీవుల సంరక్షణ ఆసక్తి ఉంటే వారికి కావాల్సిన పక్షులను ఈ గ్రూప్‌ ద్వారా వచ్చే సమాచారంతో సులభంగా పొందవచ్చు. అవసరమయ్యే పంజరాలూ ఇందులో వచ్చే పోస్టుల ఆధారంగా పొందడానికి ఏర్పాట్లున్నాయి. దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వారి అభిరుచికి తగ్గట్టుగా కొనుగోలు చేసుకునే సౌకర్యం కలుగుతోంది. పక్షులను ఆరోగ్యంగా పెంచేందుకు ధాన్యం ఎంతో అవసరం. ఏ రకమైన పక్షులు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతాయో తెలుసుకుని వాటి మేతను కొనుగోలు చేసుకునేలా బర్డ్‌ లవర్‌ బెంగళూరు గ్రూప్‌ ఉపయోగపడుతోంది. ఎనిమిదేళ్లగా నిర్వహిస్తున్న ఈ పేజ్‌ ద్వారా వారు పెంచుకునే పక్షుల వీడియోలనూ పంచుకుంటున్నారు. పెంపకానికి ఉపయోగించే వస్తువులను వ్యాపారం చేసే వారికీ ఈ ఫేస్‌బుక్‌ పేజ్‌ ఉపయుక్తంగా ఉంటోంది. ఇందులో వారి వ్యాపార వస్తువులను పోస్ట్‌ చేస్తూ జీవనోపాది పొందుతున్నారు.


ప్రాణిదయకు చక్కని స్పందన

మినియేచర్‌ విభాగంలో విజేతగా నిలిచి, ప్రమాణ పత్రాన్ని అందుకున్న జాగిలంతో విద్యార్థి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : పెంపుడు జంతువుల పట్ల కరుణ చూపించడాన్ని ప్రోత్సహించేందుకు యాక్షన్‌, కంప్యాషన్‌ అండ్‌ సర్వీస్‌ ఫర్‌ యానిమల్స్‌, సీఎంఆర్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా బాగలూరులో ‘ఆరోహణ్‌’ పేరిట ఆదివారం సంయుక్తంగా నిర్వహించిన పెట్ ర్యాంప్‌ వాక్‌, మారథాన్‌కు చక్కని స్పందన లభించింది. మారథాన్‌, పెట్ ర్యాంప్‌ వాక్‌లలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు 1400 మంది పాల్గొన్నారు. ప్రదర్శనలో పిల్లులు, జాగిలాలు, పక్షులతో పాటు ప్రాణిదయా సంఘం నిర్వహణలో ఉన్న తాబేలు, ఇతర ప్రాణులను కూడా తీసుకు వచ్చారు. భారతదేశంలో ఏటా 9.1 మిలియన్‌ పిల్లులు, 62 మిలియన్ల జాగిలాలు వీధుల పాలవుతున్నాయని సంస్థ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కె.సి.రామమూర్తి విచారం వ్యక్తం చేశారు. ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన పెంపుడు జంతువుల యజమానులకు ప్రమాణపత్రాలు అందించారు.

చలువ కళ్లద్దాలలో బుల్లి పిల్లి


కబ్బన్‌లో జాగిలాల జోష్‌

పుడిల్‌ జాతి జాగిలంతో యువతి

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : జాగిలాలను ఇష్టపడి పెంచుకుంటున్న వారి కోసం కబ్బన్‌ ఉద్యానవనంలో ఆదివారం నిర్వహించిన ప్రదర్శనకు చక్కని స్పందన లభించింది. దేశీయ, విదేశీ జాగిలాలతో వాటి యజమానులు హల్‌చల్‌ చేశారు. జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యా, అమెరికా తదితర దేశాలకు చెందిన జాతి జాగిలాలతో పాటు రాజపాళెం, ముధోళ్‌ తదితర స్థానిక జాతుల గ్రామసింహాలను కొందరు ప్రదర్శనకు తీసుకువచ్చారు. పెంపుడు జంతువులను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించే దిశలో నిర్వహించిన ప్రదర్శన విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని