logo

మహా వివాదంపై..హస్తినలో చర్చలు!

ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయమే ఉన్న వేళ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై దిల్లీ బాటపట్టారు.

Published : 29 Nov 2022 01:08 IST

ముఖ్యమంత్రి దిల్లీ పయనం

కర్ణాటక ఆర్టీసీ బస్సులకు మసి పూస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తల తీరుకు
నిరసనగా చామరాజనగరలో సోమవారం కన్నడ సంఘాల కార్యకర్తల నిరసన

ఈనాడు, బెంగళూరు : ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయమే ఉన్న వేళ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై దిల్లీ బాటపట్టారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ, గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై స్పష్టత కోసం ఈ పర్యటన అనివార్యంగా మారింది. డిసెంబరు 19 నుంచి బెళగావిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఆలోగా పార్టీ, పాలన వ్యవహారాలపై దిల్లీ పెద్దలతో చర్చించాలనేది ఆయన ఆలోచన. సోమవారం మైసూరు పర్యటనకు సిద్ధమైన ముఖ్యమంత్రి మంగళవారం దిల్లీకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

బసవరాజ బొమ్మై

రాజకీయ చర్చలు..

దిల్లీ పర్యటనలో భాగంగా తాను భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైన సమయాన్ని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో భేటీ, జన సంకల్ప యాత్రల ద్వారా సేకరించిన జిల్లాల సమీక్షను జేపీ నడ్డాతో చర్చించే వీలుంది. ఏడాది కాలంగా మరుగునపడిన మంత్రివర్గ విస్తరణ ప్రక్రియకు ఈ భేటీ ద్వారా అనుమతి పొందేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం కూడా లేని వేళ ‘విస్తరణ’ వ్యవహారం విపక్షాలకు, సొంత పార్టీ వారికి రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం లేకపోలేదు. భర్తీ చేయాల్సిన ఆరు స్థానాల కోసం మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల సమావేశాల్లో భాగంగా ప్రతిపాదిత జాబితాను సిద్ధం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ సమతౌల్యం, యువ, సీనియర్‌ నేతలకు సమాన ప్రాధాన్యం కల్పించాలని పార్టీ యోచిస్తోంది. గుజరాత్‌ మాదిరి మంత్రివర్గ స్వరూపం మార్చే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. పనితీరు ద్వారా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలన్న అభిప్రాయాలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. కేసుల నుంచి ఉపశమనం పొందిన కేఎస్‌ ఈశ్వరప్ప, రమేశ్‌ జార్ఖిహొళిల పునరాగమనంపై అధిష్ఠాన నిర్ణయమే కీలకమని ప్రకటించిన ముఖ్యమంత్రి- వారి అంశంపై ఈ పర్యటనలో స్పష్టత పొందుతారు. మహారాష్ట్ర సరిహద్దు వివాదంలోనూ ప్రభుత్వం తరఫున చేసే ప్రకటనలు, అభిప్రాయాలపై జేపీ నడ్డా అనుమతి తప్పనిసరి కానుంది.

న్యాయవాదులతోనూ..

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వ్యవహారం రోజు రోజుకీ సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్షాలు ఈ వివాదాన్ని రాజకీయం చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న ఈ వివాదంపై బుధవారం విచారణ మొదలు కానుంది. సరిహద్దుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి పలుమార్లు ప్రకటించారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్ర తరఫున సుప్రీంకోర్టులో న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, ఉదయ్‌ హొల్లాలతో చర్చిస్తారు. ఆదివారం బెంగళూరులో కర్ణాటక సరిహద్దు అభివృద్ధి మండలి సభ్యులు, దిల్లీ న్యాయవాదులతో దృశ్యమాధ్యమ సమావేశంలో చర్చించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వాదనలపై అభిప్రాయాలను సేకరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శివరాజ్‌ పాటిల్‌ను కర్ణాటక సరిహద్దు- నదుల పరిరక్షణ కమిషన్‌ అధ్యక్షులుగా నియమించారు. కమిషన్‌ అభిప్రాయాలతో రాష్ట్ర వాదనలను సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టం, కొల్హాపుర, జత్‌ గ్రామ పంచాయతీల తీర్మానాలతో కోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను ముఖ్యమంత్రి సిద్ధం చేశారు.

బెళగావికి ‘మహా’ మంత్రులు

సరిహద్దు వివాదంపై చర్చించేందుకు డిసెంబరు 3న మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభూరాజ్‌ దేశాయ్‌ బెళగావికి రానున్నారు. వీరిద్దరినీ మహారాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు వ్యవహారాల సమన్వయ సమితి సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే. బెళగావిలోని మధ్యవర్తి- మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలతో వీరిద్దరూ సమావేశం అవుతారు. ఈ సమితి సభ్యుల ప్రతిపాదన మేరకు తాము బెళగావిని సందర్శిస్తున్నట్లు చంద్రకాంత్‌ పాటిల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని 850 మరాఠా ప్రభావిత గ్రామాల వాస్తవాంశాలు, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు.


ముగిసిన అధ్యాయం

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాద వ్యవహారం ముగిసిన అధ్యాయం. ఇది పరిగణనలోనికి తీసుకోవడం అనవసరం. వివాదమంటూ మహారాష్ట్ర మళ్లీ కోర్టుకు వెళ్లటం సరైన చర్య కాదు. సమస్య తీవ్రతనున విశ్లేషించాక సుప్రీంకోర్టు మాత్రమే సరైన తీర్పు ఇవ్వగలదు. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు