logo

ప్రత్యర్థుల గుండెల్లో దడ

‘పంచరత్న’ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్‌, భాజపా నాయకులు తనపై నోరు పారేసుకోవడం ఎక్కువైందని జనతాదళ్‌ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు.

Published : 29 Nov 2022 01:08 IST

కుమార బృందానికి పంపర పనస హారం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : ‘పంచరత్న’ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కాంగ్రెస్‌, భాజపా నాయకులు తనపై నోరు పారేసుకోవడం ఎక్కువైందని జనతాదళ్‌ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ధ్వజమెత్తారు. తాను అధికారంలో ఉన్నప్పుడు మండ్య జిల్లా అభివృద్ధికి రూ.9 వేల కోట్లు కేటాయించానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మండ్య జిల్లాలో రైతులు ఎక్కువ సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారని గణాంకాలు వివరించారు. పంచరత్న రథయాత్రలో భాగంగా దేవనహళ్లిలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తన యాత్రకు ప్రజలు సునామీ తరహాలో పోటెత్తి రావడాన్ని కాంగ్రెస్‌, భాజపాలు జీర్ణించుకులేక పోతున్నాయని వ్యాఖ్యానించారు. మండ్యలో మైషుగర్‌ పరిశ్రమను తిరిగి ప్రారంభించేందుకు రూ.100 కోట్లు కేటాయించినా, తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా ఆ నిధులు వినియోగించుకోవడంలో చతికిలపడిందని మంత్రి అశ్వత్థ నారాయణ తెలుసుకోవాలని సూచించారు. దేవనహళ్లి సమీపానికి వచ్చిన రథయాత్రకు స్థానికులు ద్రాక్ష, మొక్క జొన్న, పంపర పనస, పట్టు, బెంగళూరు మిరపకాయలు తదితరాలతో చేసిన హారాలను క్రేన్‌ సహాయంతో తీసుకు వచ్చి కుమారకు స్వాగతం పలికారు. సోమవారానికి యాత్ర ప్రారంభమై 11వ రోజుకు చేరుకుంది. దేవనహళ్లి సమీపంలోని హారోహళ్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కుమార మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ఆదివారం రాత్రి నంది గ్రామంలో విశ్రాంతి తీసుకున్న కుమారస్వామి, సోమవారం ఉదయమే భోగనందీశ్వర ఆలయంలో పూజ చేయించుకుని యాత్రను కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు