logo

వస్త్ర పరిశ్రమకు చక్కని వేదికలు

రాష్ట్రంలోని జాతీయ రహదారుల వ్యవస్థల సద్వినియోగం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా సదుపాయాలున్న జిల్లాల్లో జౌళి పరిశ్రమల విస్తరణకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్రానికి విన్నవించారు.

Published : 30 Nov 2022 00:42 IST

కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మంగళవారం
దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలోని జాతీయ రహదారుల వ్యవస్థల సద్వినియోగం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా సదుపాయాలున్న జిల్లాల్లో జౌళి పరిశ్రమల విస్తరణకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్రానికి విన్నవించారు. దిల్లీ పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం కేంద్ర జౌళి, ఆహార పౌరసరఫరా, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో ప్రత్యేక సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మిత్రా పథకంలో భాగంగా జాతీయ రహదారులు, విద్యా సంస్థలున్న కలబురగి, తుమకూరు, విజయపురల్లో మెగా జౌళి పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రహదారులు, నౌకాశ్రయాలున్న నగరాలకు అనుసంధానం ఉండటం కూడా జౌళి రంగ విస్తరణకు అనుకూలంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇక్కడి గ్రామీణ పట్టభద్రులు, నైపుణ్య వనరులతో పరిశ్రమల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ ఆహార సరఫరా పథకం ద్వారా బహిరంగ విపణిలో పదివేల టన్నుల బియ్యాన్ని రాష్ట్రానికి అందేలా చేసింది. ఈ బియ్యం ప్రమాణాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి విన్నవించారు. 2023 మార్చి వరకు రెండు లక్షల మెట్రిక్‌ టన్నులు, తక్షణమే 50 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర వాణిజ్య , జౌళి పరిశ్రమల శాఖ మంత్రి
పీయూష్‌ గోయల్‌కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న బొమ్మై

రక్షణ భూమి కోసం..

బెళగావి జిల్లా తుకమట్టి గ్రామంలో రక్షణశాఖకు చెందిన 732.24 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉండటంతో అభివృద్ధి పనుల నిమిత్తం ఆ ప్రాంతాన్ని జిల్లా యంత్రాంగానికి బదిలీ చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బొమ్మై విన్నవించారు. దిల్లీలో రక్షణ మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి ఈ భూముల్లో రాష్ట్రం చేపట్టే ప్రాజెక్టులపై వివరణ ఇచ్చారు. ఇప్పటికే బెళగావిలో ఏర్పాటు చేసిన సంగొళ్లి రాయణ్ణ సైనిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి సమర్పించారు.

సీఎం అందించిన వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న
పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌

అటవీ ప్రాజెక్టులపై..

ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో గుడేకోట కరడి ధామ, భీమాగడ్‌ అభయారణ్య ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఈ అడవుల పరిసరాలను సూక్ష్మ వలయాలు (బఫర్‌ జోన్‌)గా ప్రకటించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర జలవనరుల మంత్రి గోవింద కారజోళ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ్‌ ప్రసాద్‌, జలవనరులు, నగరాభివృద్ధి శాఖ ఏసీఎస్‌ రాకేశ్‌ సింగ్‌ హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని