logo

మీట దూరంలో మహావైద్యం!

రాష్ట్రంలో 1.30 లక్షల మంది వైద్యులు, ఏటా ఏడు వేల ఎంబీబీఎస్‌ విద్యార్ధులు.. సేవలకు ఉపక్రమిస్తున్నా ప్రత్యేక వైద్య నిపుణులు (స్పెషలిస్ట్‌)ల కొరత వెంటాడుతూనే ఉంది.

Published : 02 Dec 2022 01:31 IST

గూగుల్‌ క్లౌడ్‌ సహకారంతో సేవలు

రోగిని సునిశితంగా పరిశీలించే క్లౌడ్‌ ఫిజీషియన్లు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్రంలో 1.30 లక్షల మంది వైద్యులు, ఏటా ఏడు వేల ఎంబీబీఎస్‌ విద్యార్ధులు.. సేవలకు ఉపక్రమిస్తున్నా ప్రత్యేక వైద్య నిపుణులు (స్పెషలిస్ట్‌)ల కొరత వెంటాడుతూనే ఉంది. దేశవ్యాప్త రోగులు, ప్రత్యేక వైద్యుల నిష్పత్తి రాష్ట్రంలో కాస్త మెరుగ్గా ఉన్నా ఐసీయూ వైద్యుల (ఇంటెన్సివిస్ట్‌) సంఖ్య తక్కువే. కర్ణాటక రెసిడెన్స్‌ వైద్యుల సమాఖ్య (కార్డ్‌) నివేదికల ప్రకారం 11 వేల ఐసీయూ రోగులకు ఒక ఇంటెన్సివిస్ట్‌ అందుబాటులో ఉన్నారు. శస్త్ర చికిత్స, పిల్లలు,, గర్భకోశ వైద్య విభాగాల్లో ఈ కొరత ఏటేటా పెరుగుతోంది. సమస్య కరోనా సమయంలో మరింత ఎక్కువగా ఎదురైనట్లు 2020-21, 2021-22 ఏడాది రాష్ట్ర మరణాల రేటు చూస్తూనే అర్థమవుతోంది. ఐసీయూ సేవల కోసం రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇటీవల 750 మంది స్పెషలిస్ట్‌లను ఇతర రాష్ట్రాల నుంచి నియమించుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి వ్యవస్థాగత సమస్యలను అధిగమిస్తూ రాష్ట్రమంతటా మెరుగైన సేవలు అందించేందుకు మైసూరులో ప్రారంభించిన ‘టెలీ- ఐసీయూ’ సేవలు రాష్ట్ర వైద్య వ్యవస్థకు భరోసా పెంచుతున్నాయి.

మైసూరులో షురూ..

మార్చిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు గతవారం మైసూరు కేఆర్‌ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జిల్లాలోని ఒక ఆస్పత్రిలో ఏర్పాటు చేసే టెలీ- ఐసీయూ హబ్‌ ద్వారా ప్రతి జిల్లా ఆస్పత్రిలో ‘10 బెడ్‌ ఐసీయూ’ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. తొలి దశలో నంజనగూడు, హెచ్‌డీ కోటె, సంతెమారనహళ్లి, మలవళ్లి, విరాజ్‌పేట్‌లో ఈ సేవలు ప్రారంభించారు. సేవలను మార్చి నెలలో కలబురగి వైద్య విజ్ఞాన సంస్థ(జిమ్స్‌)లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 41 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘టెలి- ఐసీయూ’లు అందుబాటులోనికి వచ్చాయి. రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్యాశాఖ, నగరానికి చెందిన ఈ-గవర్నమెంట్స్‌ ఫౌండేషన్‌లు సంయుక్తంగా ఈ సేవలను నిర్వహిస్తాయి. దేశంలో తొలిసారిగా ఇంఫాల్‌లోని జవహార్‌లాల్‌ నెహ్రూ వైద్య విజ్ఞాన సంస్థలో టెలీ-ఐసీయూ హబ్‌లను ప్రారంభించారు. తర్వాతి రాష్ట్రం కర్ణాటక కానుంది.

దూరవైద్యంతో సేవలందించిన గుల్బర్గ వైద్య సంస్థ

సాంకేతికత తోడు

కరోనా నేర్పిన పాఠం వైద్య రంగానికి మేలే చేసింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను వీలైనంత చక్కగా వినియోగించుకునే దిశగా ఆవిష్కరించిందే టెలీ ఐసీయూ. కరోనా రోగులను పరీక్షించేందుకు వైద్యులు కూడా భయపడే పరిస్థితుల్లో టెలి వైద్యం ప్రారంభించారు. నిపుణుల కొరతే కాకుండా పీపీఈ పరికరాలను కొనలేని ఆర్థిక పరిస్థితుల్లో దూరవైద్యం అక్కరకు వచ్చింది.

* గూగుల్‌ క్లౌడ్‌, గూగుల్‌ ఫిట్‌బిట్‌ ట్రాకర్‌, ఆటోమైయిడ్‌, ఏఐ పవర్డ్‌ స్మార్ట్‌ ఐసీయూ, 4కే రెసొల్యూషన్‌ మానిటర్లు, డెస్క్‌టాప్‌, కంప్యూటర్లు, ఫిక్స్‌డ్‌ లైన్‌ ఇంటర్నెట్‌, ఇంటెన్సివ్‌ ఈఎంఆర్‌ ఆడియో, విజువల్స్‌ అండ్‌ అలర్ట్‌ వ్యవస్థలు ప్రతి టెలీ-ఐసీయూకు అందుబాటులో ఉంటాయి.


క్లౌడ్‌ వైద్యం

గూగుల్‌ క్లౌడ్‌ సాంకేతికతతో ఐసీయూలోని రాడార్‌ డిజిటల్‌ వ్యవస్థలు రోగికి సంబంధించిన డేటాను టెలి-ఐసీయూ హబ్‌లోని క్లౌడ్‌ పిజీషియన్‌కు పంపుతాయి. ఇక్కడి క్లినికల్‌ డెసిషన్‌ సపోర్ట్‌ వ్యవస్థ రోగికి అవసరమైన చికిత్సను గుర్తిస్తుంది. రోగి ఆరోగ్యానికి సంబంధించిన రియల్‌టైమ్‌ డేటాను వైద్య పర్యావరణ వ్యవస్థలకు వేగం, కచ్చితత్వంతో చేరవేస్తాయి. కమాండ్‌ సెంటర్‌లోని ప్రత్యేక నిపుణులు రోగికి అవసరమైన చికిత్సను స్థానిక వైద్యులకు సూచనల ద్వారా వివరిస్తారు. అవసరమైన పరీక్షలు, వాటి తాలూకూ నివేదికలు కూడా వర్చువల్‌ ద్వారా వేగంగా పరిశీలించే వ్యవస్థలు రాడార్‌ మానిటర్‌లో ఉంటాయి. క్లౌడ్‌ పిజీషియన్‌ సాంకేతిక సహకారంతో జిమ్స్‌లో ఏర్పాటు చేసిన టెలీ-వైద్యం కరోనా సమయంలో మరణాల ప్రమాణాను నియంత్రించేందుకు ఉపయోగపడింది.


ఏకకాలంలో సేవలు
- డాక్టర్‌ దిలీప్‌ రామన్‌, సహ వ్యవస్థాపకులు, క్లౌడ్‌ పిజీషియన్‌

టెలి-ఐసీయూ ద్వారా ఏకకాలంలో 80 మంది ఐసీయూ రోగులను పర్యవేక్షించే వీలుంది. వైద్యుల కొరత, నాణ్యమైన వైద్యం, వ్యయ నివారణలో టెలీ-ఐసీయూ సేవలు కీలకంగా ఉపయోగపడతాయి. ఆధునిక వైద్య విధానంలో ఇదో విప్లవాత్మక ప్రగతి. రాష్ట్రంలోని వైద్యులు, నర్సులకు ఈ వైద్యంలో శిక్షణ ఇస్తున్నాం.


గ్రామాల్లో మెరుగు
- డి.రణదీప్‌, కమిషనర్‌, ఆరోగ్యశాఖ

స్పెషలిస్ట్‌లు, మెడికోలకు టెలీ-ఐసీయూలో శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సేవలు అందుతాయి. వైద్య ఉపకరణాలు, డయాగ్నస్టిక్‌ వ్యవస్థలు లేని చోట్ల టెలి-ఐసీయూ సేవలు ఉపయుక్తం. కొత్తగా నియమించిన వైద్యులందరికీ ఇకపై టెలి-ఐసీయూ శిక్షణ తప్పనిసరి చేస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు