logo

ఓట్ల తొలగింపు ఒట్టిమాట

ఓటరు జాబితా నుంచి మైనార్టీల పేర్లు తొలగిస్తున్నారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొట్టిపారేశారు.

Published : 03 Dec 2022 00:37 IST

తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి

సమావేశ వేదికపై వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి

ధార్వాడ: ఓటరు జాబితా నుంచి మైనార్టీల పేర్లు తొలగిస్తున్నారంటూ వస్తున్నవన్నీ వదంతులేనని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కొట్టిపారేశారు. వదంతులను విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. హుబ్బళ్లి విమానాశ్రయంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ పరిష్కరిస్తుందని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండదని గుర్తు చేశారు. జాబితా నుంచి ఎవరి పేర్లైనా తొలగిస్తే.. తక్షణమే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.రెండు చోట్ల ఓటరుగా పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఇప్పుడు ఇబ్బంది వస్తుందని చెప్పారు.

నవకర్ణాటకకు రూపు

బెళగావి: నవ కర్ణాటక నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి కోసం రామదుర్గ నియోజకవర్గానికి రూ.2739 కోట్లు కేటాయించామని చెప్పారు. నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, విద్య, ఆసుపత్రులు, ఆనకట్టల నిర్మాణం, జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీటిని అందించామని వివరించారు. బెళగావి, బీదర్‌, కలబురగి, యాదగిరి, విజయపుర జిల్లాల సరిహద్దుల్లోని 1800 గ్రామ పంచాయతీల అభివృద్ధికి నూతన కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. సరిహద్దులలోని పాఠశాలల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. గోవా, షోలాపూర్‌, కాసరగోడుల్లో తలా రూ.10 కోట్ల ఖర్చుతో కన్నడ భవనాలను నిర్మిస్తామని చెప్పారు. రామదుర్గ సమీపంలోని కొన్ని గ్రామాలు తరచూ ముంపునకు గురవుతున్న నేపథ్యంలో రూ.120 కోట్లతో మలప్రభ నదీ తీరంలో అడ్డుగోడ నిర్మించేందుకు ఇప్పటికే భూమి పూజ చేశామని గుర్తు చేశారు.

విగ్రహావిష్కరణ..

బెళగావి: హుబ్బళ్లి నుంచి రామదుర్గకు చేరుకున్న ముఖ్యమంత్రి బసవేశ్వర కూడలిలో ఏర్పాటు చేసిన జగజ్యోతి బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి సవదత్తి తాలూకా బాల లింగేశ్వర మఠానికి వెళ్లారు. మఠాధిపతి ఆయనను ఆహ్వానించి.. ఘనంగా సత్కరించారు. మంత్రులు సి.సి.పాటిల్‌, గోవింద కారజోళ, మురుగేశ్‌ నిరాణి, భైరతి బవసరాజు, శశికళ జొల్లె, లోక్‌సభ సభ్యురాలు మంగళా అంగడి, కర్ణాటక పాల సమాఖ్య అధ్యక్షుడు బాలచంద్ర జార్ఖిహొళి, ఎమ్మెల్యే మహాదేవప్ప యాదవాడ తదితరులు ముఖ్యమంత్రితో కలిసి రూ.671.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

రామదుర్గలో మీట నొక్కి బసవేశ్వరుడి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న బొమ్మై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని