logo

సద్దుమణగని సరిహద్దు

ఏటా డిసెంబరులో నిర్వహించే కర్ణాటక విధానసభ సమావేశాల నేపథ్యంలో చెలరేగే సరిహద్దు వివాదం ఈ ఏడాది కాస్త ముందుగానే చర్చకు దారి తీసింది.

Published : 03 Dec 2022 00:37 IST

వివాదాలతో నిత్యం ఇక్కట్లే

వివాదాగ్ని ఆరేదెలా?: బెళగావిపైనే మహారాష్ట్ర కన్ను

ఈనాడు, బెంగళూరు : ఏటా డిసెంబరులో నిర్వహించే కర్ణాటక విధానసభ సమావేశాల నేపథ్యంలో చెలరేగే సరిహద్దు వివాదం ఈ ఏడాది కాస్త ముందుగానే చర్చకు దారి తీసింది. భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు సిద్ధమవటంతో ఈ వివాదానికి ప్రాధాన్యం పెరిగింది. బెళగావి సువర్ణసౌధలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రికత్త వాతావరణాన్ని సృష్టించేవే. రెండు రాష్ట్రాలూ ఎన్నికలకు సిద్ధమవుతుండగా వివాదం మరింత పదునెక్కింది. ఇరు రాష్ట్రాలు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నా సరిహద్దు వివాదం తెరపైకి రావటం ఆసక్తికరం.

పార్టీలేవైనా అంతే..

కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరిహద్దు వివాదం ముగింపు లేని అంశంగా కొనసాగుతోంది. 1957లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన చట్టం మహారాష్ట్రకు న్యాయం చేకూర్చలేదని ఆ ప్రభుత్వం దశాబ్దాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉంది. బొంబాయి ప్రెసిడెన్సీలో భాగమైన బెళగావిని కర్ణాటకలో భాగం చేయటం మహారాష్ట్రను నేటికీ కలచివేసే అంశంగా మారింది. తమకు చెందిన ప్రాంతాల కోసం ఇరు రాష్ట్రాల వాగ్వాదాన్ని పరిష్కరించేందుకు 1967లో ఏర్పాటైన మహాజన్‌ కమిషన్‌ 814 మరాఠి భాషా గ్రామాలు కర్ణాటకలో, 247 కన్నడ భాషా గ్రామాలు మహారాష్ట్రలో భాగమని తేల్చి చెప్పింది. ఈ కమిషన్‌ను కర్ణాటక ప్రభుత్వం అంగీకరించినా మహారాష్ట్ర సవాలు చేస్తూనే ఉంది. 2017లో భాషా ప్రయుక్త చట్టాన్ని సవరించి కర్ణాటకలోని మరాఠి గ్రామాలు, బెళగావిని తిరిగి ఇవ్వాల్సిందిగా పొరుగు పాలకులు ‘సుప్రీం’ను ఆశ్రయించారు.

మంత్రులూ.. రావొద్దు

సరిహద్దు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే న్యాయవాదులను సమన్వయ పరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులు చంద్రకాంత్‌ పాటిల్‌, శంభురాజ్‌ దేశాయ్‌లను నియమించింది. ఈ అంశాలపై కర్ణాటకలోని మరాఠా భాషా పరిరక్షణ సంఘాలు, గ్రామీణుల నుంచి వివరాలు సేకరించేందుకు శనివారం బెళగావిలో వారు పర్యటించాలనేది ఆలోచన. సీఎం సూచనతో మంత్రుల ‘వివాద’ పర్యటన వాయిదా వేశారు. 6న అంబేడ్కర్‌ జయంతిలో పాల్గొనేందుకు వస్తున్నట్లు ‘మహా’మంత్రులు స్పష్టం చేశారు.


కర్ణాటక వాదన

మహారాష్ట్ర జత్‌ తాలూకాలోని 47 గ్రామ పంచాయతీలు ప్రతి ఏటా నీటి ఎద్దడిని ఎదుర్కొనేవి. ఆ గ్రామాలు కన్నడ భాషా గ్రామాలుగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఈ పంచాయతీలు 2012లో కర్ణాటకలో విలీనం కావాలని తీర్మానించాయి. ఈ తీర్మానం అనంతరం గ్రామాలను మా రాష్ట్రంలో భాగం చేయాలన్న ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా కర్ణాటక తెరపైకి తెచ్చింది. ప్రతిగా బెళగావి అంశాన్ని ‘మహా’ వివాదంగా మారింది. ఈనెల 19నుంచి బెళగావిలో సమావేశాలకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవగా ఈ వివాదం మళ్లీ జీవం పోసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు