logo

గీతోపదేశం... నవ జీవనసారం

చరిత్రపుటల్లో ఐదువేల సంవత్సరాల కిందటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన గీత.. సర్వకాల సమస్యలకు పరిష్కార మార్గం! అందులోని ప్రతి శ్లోకం వ్యక్తిత్వ వికాసానికి స్ఫూర్తి మంత్రమని రాజకీయ, శాస్త్ర సాంకేతికత, కళ, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులు కొనియాడారు.

Published : 04 Dec 2022 01:41 IST

శ్రీకృష్ణ బోధనల విశ్లేషణ
ఇస్కాన్‌లో వేడుక ఘనం

రాజ్‌నాథ్‌సింగ్‌ చేతుల మీగా భగవద్గీతను అందుకుంటున్న ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి మనవరాళ్లు సౌందర్య, ఐశ్వర్య, నటి సప్తమీ గౌడ, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార

ఈనాడు, బెంగళూరు : చరిత్రపుటల్లో ఐదువేల సంవత్సరాల కిందటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన గీత.. సర్వకాల సమస్యలకు పరిష్కార మార్గం! అందులోని ప్రతి శ్లోకం వ్యక్తిత్వ వికాసానికి స్ఫూర్తి మంత్రమని రాజకీయ, శాస్త్ర సాంకేతికత, కళ, ఆధ్యాత్మిక రంగాల ప్రముఖులు కొనియాడారు. ‘గీత జయంతి’ సందర్భంగా బెంగళూరులోని ఇస్కాన్‌ నేతృత్వంలో శనివారం శ్రీరాజాధిరాజ గోవింద దేవాలయంలో నిర్వహించిన గీత దాన యజ్ఞ మహోత్సవానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప తదితర రాజకీయ ప్రముఖులు ముఖ్య తరలి వచ్చారు. ఇదే కార్యక్రమానికి జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, ఇస్రో అధ్యక్షుడు సోమనాథ్‌, భారతరత్న ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి మనవరాళ్లు ఐశ్వర్య, సౌందర్య, సినీ తార సప్తమీ గౌడ హాజరయ్యారు. వీరి రంగాలు, లక్ష్యాలు వేరైనా అనుసరించే మార్గం ఒక్కటేనని ప్రకటించారు. జీవితంలో విజయాలు, వైఫల్యాలు, ఆందోళనలు, భావోద్వేగాలు, నిరాశ.. తుదకు మరణాన్ని కూడా ఆనందంగా ఆహ్వానించే శక్తిని భగవద్గీత ద్వారా పొందినట్లు తమ జీవితాల్లోని అనుభవాలతో విడమరచి చెప్పారు.

యుద్ధనీతి నేర్పిన ‘గీత’

పాండవులు న్యాయబద్దంగా కోరిన గ్రామాలు ఇవ్వని కౌరవులు కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యారు. ఇతరులను ఇబ్బంది పెట్టని పాండవులు.. చివరికి కౌరవులను యుద్ధంలో ఓడించారు. ఇది అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా విశ్లేషించారు. ప్రస్తుతం భారత రక్షణ రంగం కూడా ఇదే యుద్ధ నీతిని అనుసరిస్తోందని ప్రకటించారు. శాంతి, సహమతం భారతీయ సంస్కృతిలో భాగమని ప్రపంచ దేశాలకు తెలుసని, యుద్ధనీతి, అహింసా ప్రవృత్తికి భగవద్గీత స్ఫూర్తి అని ప్రకటించిన ఆయన వివరించారు. మనిషి ధైర్యంగా జీవించే భరోసాకు ఇదే మూలమన్నారు. పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయుడు అవసరమని- శాంతి, క్రోదం, సంతోషం, దుఃఖం వంటి భావోద్వేగాలను ఎవరూ నేర్పరని విశ్లేషించారు. ఇలాంటి ఉద్వేగాలను నియంత్రించే పాఠాన్ని భగవద్గీత ద్వారా పొందగలమన్నారు.

సంస్కృతికి పెద్దపీట

భారత సమాజం 1990 వరకు పాశ్చాత్య సంస్కృతిని అనుసరించింది. నేడు మనదైన సంస్కృతిని పునఃస్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ సందర్భంగా అన్నారు. మనదేశంలో మొదలైన భక్తి సందేశాలను ప్రచారం చేసిన ప్రభుపాద ఇక్కడ విఫలమై అమెరికాలో ఈ విప్లవాన్ని విజయవంతం చేశారని వివరించారు. ఆ విప్లవ ప్రభావం మళ్లీ భారతీయ సంస్కృతికి జీవం పోస్తుందని విశ్లేషించారు. విజ్ఞానం, ఆధ్యాత్మిక మిశ్రమంగా ఉండే భగవద్గీత.. అందరినీ ధ్వంసం చేసే శక్తి, అందరినీ బతికించే భావనల మధ్య నలిగే సంధికాలంలో ఉద్భవించిందన్నారు. నేను కూడా గత ఏడాదిగా ఎన్నో సందిగ్ధత పరిస్థితుల్లో గీతలోని శ్లోకం నుంచి స్ఫూర్తి పొంది విజయం సాధించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. గీతలోని ప్రతి పుట, ప్రతి శ్లోకం జీవనసారమని ఆయన ప్రకటించారు. యాంత్రికంగా మారిన ఆధునిక సమాజానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప మాట్లాడుతూ అన్ని మతాలకు భగవద్గీత తల్లిలాంటిందన్నారు. జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కార మార్గమన్నారు.

గీత దాన యజ్ఞం

గీత జయంతి సందర్భంగా డిసెంబరు మాసంలో 10 లక్షలకు పైగా భగవద్గీత గ్రంథాలను వితరణ చేస్తామని ఇస్కాన్‌ అధ్యక్షుడు మధుపండిత్‌ దాస ఈ సందర్భంగా ప్రకటించారు. 700 మంది పిల్లలతో గీతాపారాయణం, కన్నడ, తుళు భాషా గాయకులు విద్యాభూషణ్‌తో ఆంగ్ల, కన్నడ, హిందీలో పాడిన మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, ఆరు భాషల్లో గీత అనువాదం తదితర ప్రాజెక్టులు ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి బొమ్మై ప్రారంభించారు.

ఇస్కాన్‌లో దైవదర్శనం చేసుకుంటున్న రాజ్‌నాథ్‌, బొమ్మై, మధుపండిత్‌దాస్‌

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని