logo

చిరుతల కోసం డ్రోన్‌ వేట

రాజధాని నగర శివార్లను చిరుతలు హడలెత్తిస్తున్నాయి. బెంగళూరు నగరానికి మూడు వైపులా అటవీ ప్రాంతాలు విస్తరించడంతో వన్యజీవుల తాకిడి ఒక్కోసారి భయపెడుతోంది.

Published : 04 Dec 2022 01:41 IST

శివారు ప్రజలకు కునుకే కరవు

చిరుతలకు నిలయం.. నగర శివార్లలోని తురహళ్లి అటవీ ప్రాంతం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగర శివార్లను చిరుతలు హడలెత్తిస్తున్నాయి. బెంగళూరు నగరానికి మూడు వైపులా అటవీ ప్రాంతాలు విస్తరించడంతో వన్యజీవుల తాకిడి ఒక్కోసారి భయపెడుతోంది. క్రమంగా అడవులను నరికి.. జనావాసాలు విస్తరించడంతో వాటి అడుగులు ఎటువేయాలో తెలియకే ఇలా దారి తప్పి వస్తున్నట్లు పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి అటవీ ప్రాంతాలన్నీ ప్రస్తుతం నివాసాలుగా మారుతున్నాయి. చీకటి పడితే శివార్ల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు భీతి చెందుతున్నారు. ఉదయ వేళ నడక సాగించడానికీ జంకుతున్నారు. వారం రోజులుగా కెంగేరి, ఉత్తరహళ్లి, దేవనహళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటి సంచారం తీవ్రమైంది. కనీసం నాలుగు చిరుతలు నగరంలోకి ప్రవేశించాయనే భయంతో కొన్ని పాఠశాలకు విద్యార్థులను పంపడానికే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాటిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగినా ఎలాంటి ప్రయోజనం కానరావడం లేదు. బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనం నుంచి పెద్ద బోన్లు తెచ్చి పలు ప్రాంతాల్లో అమర్చారు. కెంగేరి సమీపంలోని తురహళ్లి అటవీ ప్రదేశం, యలహంక సమీప చిక్కజాల, తరబనహళ్లి, ఐటీసీ కర్మాగారం చుట్టుపక్కల వనాలు విస్తరించాయి. అక్కడే బెడద తీవ్రంగా ఉంది. వాటి ఆచూకీ తెలుసుకునేందుకు డ్రోన్‌ కెమేరాలను రంగంలోకి దించారు. తురహళ్లి అటవీ ప్రదేశానికి చేరువలోనే చిరుతలు ఇద్దరు మహిళలపై దాడి చేశాయి. అక్కడ ఏర్పాటు చేసిన బోన్లలోకి అవి వెళ్లకుండా పక్కగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. కోడిహళ్లి, తురహళ్లి, కెంగేరి చుట్టు పక్కల ప్రజలను అధికారులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా తిరగరాదని, గుంపులుగా శబ్దం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఉల్లాళ్ల రహదారిలోని ఓంకార హిల్స్‌ సమీపన ఇదే సమస్య ఎదురైంది. జంతువు కాలి గుర్తులను అధికారులు పరిశీలించి.. జాడ కనుగొనే ప్రయత్నంలో పడ్డారు. యలహంక సమీపంలోని ఐటీసీ ఫ్యాక్టరీ ఆవరణలోనూ ఓ బోను అమర్చారు. అక్కడికి వచ్చిన ఓ చిరుత లోపలికి వెళ్లకుండా.. బోను పక్కనే కదలివెళ్లిన ఆనవాళ్లు సీసీ కెమేరాలో నిక్షిప్తమయ్యాయని అధికారులు తెలిపారు. తరబనహళ్లి సమీప పొలాల్లో దాని కాలిగుర్తులు చూసి జనం హడలిపోతున్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పాలికె అటవీ విభాగం అధికారులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

నగర శివార్లలోని ఓ రహదారిపై చిరుత దర్జా నడకలు

ప్రత్యేక వేట...

నగరంలో చిరుతల సమస్య ఈనాటిది కాదు. ఉహించని రీతిలో నగరం విస్తరిస్తున్న క్రమంలో బన్నేరుఘట్ట అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం అవి నివాస ప్రాంతాలకు వస్తున్నట్లు వన్యజీవుల సంరక్షణ నిపుణులు వివరించారు. బన్నేరుఘట్ట పరిసరాలన్నీ ప్రస్తుతం బహుళ అంతస్తుల నిలయాలుగా మారిపోతున్నాయి. ఈ ప్రభావం అక్కడి కీకారణ్యంపై పడుతోంది. ఒకప్పుడు 200 ఎకరాల విస్తీర్ణంలోని తురహళ్లి అడవి 54 ఎకరాలకు కుదించుకుపోయింది. అక్కడ రాళ్ల గనులకు అనుమతించారు. వన్య జీవులకు ముప్పు ఏర్పడింది. పేలుళ్లకు భయపడి పలు ప్రాంతాల నుంచి చిరుతలు పారిపోయి వస్తున్నాయి. వీటిని నియంత్రించడానికి నగర అటవీ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. 1993లో జాలహళ్లిలోని బీఈఎల్‌ కర్మాగారం లోపలకు చిరుత ప్రవేశించడం అప్పట్లో కలకలం రేపింది. నల్లమల్ల అటవీ ప్రదేశం నుంచి సరకు రవాణా రైలు బోగిలో అది ప్రవేశించి.. ఇక్కడికి చేరుకోవడం అప్పట్లో పెను కలకలం రేపింది. నాటి దాడుల్లో ఓ వ్యక్తి దాని పంజాదెబ్బకు బలయ్యాడు. 2016 ఫిబ్రవరి 8న వైట్‌ఫీల్డ్‌ విబ్‌న్నార్‌ పాఠశాలలోకి చిరుత ప్రవేశించి అనేక మందిని గాయపరిచిన విషయం నగర ప్రజల కళ్లలో కదులుతూనే ఉంది. బన్నేరుఘట్ట చుట్టు పక్కల గ్రామాల్లోకి వన్యజీవులు ప్రవేశించి పశువులపై దాడులకు దిగుతున్నాయి. వాటి కదలికలను కనిపెట్టడం నగర పరిధిలో కష్టంఆ ఉందని సంబంధిత అటవీశాఖ ఉన్నతాధికారి రవికుమార్‌ తెలిపారు. నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ పథకం అవసరమన్నారు.


కలకలమే : వైట్‌ఫీల్డ్‌ విభిన్నార్‌ పాఠశాలలో ఆరేళ్ల కిందట ఓ చిరుత దాడి

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని