logo

హస్తినకు తాకిన సరిహద్దు సెగ

మంగళవారం అగ్నిగోళంగా మారిన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు బుధవారం కాస్త ప్రశాంతంగా మారింది. పరిస్థితి ఇంకా అదుపులోనికి రాలేదని బెళగావి, విజయపుర జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది.

Published : 08 Dec 2022 01:52 IST

కర్ణాటక సర్కారు తీరుపై సర్వత్రా ఆక్షేపణ

వాహనాల రద్దుతో అష్టకష్టాలు
ఈనాడు, బెంగళూరు

మంగళవారం అగ్నిగోళంగా మారిన కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు బుధవారం కాస్త ప్రశాంతంగా మారింది. పరిస్థితి ఇంకా అదుపులోనికి రాలేదని బెళగావి, విజయపుర జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. కన్నడ సంఘాల నేతలు బెళగావి నుంచి బెంగళూరుకు చేరుకున్నా..ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల వ్యాఖ్యానాలు ఈ వివాదాన్ని మరింత సజీవంగా మారుస్తోంది. మహారాష్ట్ర మంత్రుల రాకను వ్యూహాత్మకంగా నిలువరించిన కర్ణాటక ప్రభుత్వం కొత్త చిక్కులు కొని తెచ్చుకుంది. ‘మహా’ మంత్రుల రాకపై ఆంక్షలు విధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తీరుపై బుధవారం ప్రారంభమైన పార్లమెంట్‌లోనూ విమర్శలు వెల్లువెత్తాయి. వెరసి బుధవారం సరిహద్దులకు పరిమితమైన వివాదం దిల్లీకి చేరుకుంది.

ముఖ్యమంత్రి తీరుపై ‘మహా’ ఆక్రోశం

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యలతోనే బెంగళూరులోని కన్నడ పరిరక్షణ సంఘాలు బెళగావిలో ఆందోళనను ఉధృతం చేశాయని మహారాష్ట్ర రాజకీయ నేతలు దుయ్యబట్టారు. అధికార పక్షం మొదలు విపక్షాలు, మహారాష్ట్ర ఏకీకరణ, నవ నిర్మాణ సమితులు బొమ్మై తీరును తీవ్రంగా ఆక్షేపించాయి. కేవలం సరిహద్దుల్లో సామరస్యాన్ని కాపాడేందుకు మహారాష్ట్ర మంత్రులను అడ్డుకున్నట్లు ముఖ్యమంత్రి బొమ్మై సమర్థించుకున్నారు. పరోక్షంగా ముఖ్యమంత్రి బొమ్మై సరిహద్దు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లు శివసేన, ఎన్‌సీపీ నేతలు ఆరోపించారు. సుప్రీం కోర్టులో విచారణ ఉన్న అంశంపై చర్చించబోనని ప్రకటిస్తూనే సున్నిత అంశంపై కన్నడిగులను రెచ్చగొట్టారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మహారాష్ట్రలో చేతకాని సర్కారు ఉందని ఆరోపించారు. అసలు భాజపా మూలాలు లేని బసవరాజ బొమ్మై..మహారాష్ట్ర ప్రజలను నిర్దేశించటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెళగావి కోసం దశాబ్దాలుగా చెలరేగుతున్న వివాదం దృష్ట్యా..ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన వెనుక కేంద్ర హస్తం ఉందని ఆయన దుయ్యబట్టారు.

పార్లమెంట్‌లోనూ

బుధవారం ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సరిహద్దు వివాదం ధ్వనించింది. ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ సులే..సరిహద్దు వివాదంపై ప్రస్తావించారు. గత పది రోజులుగా కర్ణాటక ప్రభుత్వం అలజడిని సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. కేవలం రాజకీయ లక్ష్యంతోనే కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్రను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో మరాఠా ప్రజలు, వాహనాలపై దాడులు సరికాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తక్షణమే స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఇందుకు స్పందించిన కర్ణాటక ఎంపీ శివకుమార్‌ ఉదాసి..మహారాష్ట్ర రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఈ వివాదంతో రాజకీయం చేయటం అలవాటుగా చేసుకున్నట్లు ఆరోపించారు. అభద్రతతో మహారాష్ట్ర రాజకీయ పార్టీలు చేస్తున్నట్లు చర్యలకు పార్లమెంట్‌లో స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న అంశంపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.

అమిత్‌షాకు నివేదించిన ఫడణవీస్‌

దిల్లీ, ముంబయి: సరిహద్దుకు సంబంధించి కర్ణాటక-మహారాష్ట్రల నడుమ రేకెత్తిన వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను నివేదించారు. వివాదాన్ని చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ‘మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన’ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే అన్నారు. వచ్చే ఏడాది కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వివాదాన్ని రాజేస్తున్నారని విమర్శించారు.


అఖిలపక్ష సమావేశం అవసరమా?

సరిహద్దు వివాదంపై అఖిల పక్ష సమావేశం అనివార్యత ఇంకా రాలేదని రాష్ట్ర జలవనరుల మంత్రి గోవింద కారజోళ అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దంగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు యత్నిస్తోంది. ముఖ్యమంత్రి బొమ్మై ఈ విషయంపై సమాలోచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇందులో రాజకీయనేతల వ్యాఖ్యలు, సలహాలు అవసరం లేదని సూచించారు. ఇదే అంశంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ సున్నిత అంశాలపై ఆందోళనలు, నిరసనలు చేస్తే సహించలేది లేదని హెచ్చరించారు. చట్టాలను చేతులోనికి తీసుకుంటే చట్టాలే వారిని శిక్షిస్తాయన్నారు.


వాహనాల రద్దు

బుధవారం కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వాహన సంచారం స్తంభించింది. కేఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ బస్సులను బెళగావి, సోలాపూర్‌, కొల్లాపూర్‌, నిప్పాణి, ముద్దే బీహాళ్‌, సవదత్తి, పుణె, పణజి, వాస్కో తదితర డిపోల నుంచి బస్సుల సంచారాన్ని నిషేధించారు. బెళగావి నుంచి పుణెకు 240, పుణె నుంచి బెళగావికి 140 బస్సు సర్వీసులు ఉండగా, వీటిల్లో 70శాతం సేవలను నిలిపివేశారు. ఈ కారణంగా విద్యార్థులు, వాణిజ్య, ఆహార ఉత్పత్తుల సరఫరా స్తంభించింది. నిత్యం ఈ సరిహద్దుల మధ్య 2,500కుపైగా ప్రైవేటు వాహనాలు, లారీలు సంచరిస్తుండగా, బుధవారం వీటిల్లో 60శాతం వాహనాలను నిలిపివేసినట్లు బెళగావి లారీ యజమానుల సమాఖ్య వెల్లడించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని