logo

కలతలతో తల్లడిల్లి.. కన్నతల్లి అఘాయిత్యం

కుటుంబ కలహాలతో వ్యధకు గురైన జ్యోతి అనే గృహిణి తన ఇద్దరు ఆడపిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఉదంతమిది. తానూ బలవన్మరణానికి పాల్పడాలని భావించి, భయంతో చివరి క్షణంలో వెనక్కు తగ్గి ప్రాణాలు కాపాడుకుంది.

Published : 08 Dec 2022 01:52 IST

పిల్లలపై పెట్రోలు పోసి నిప్పు

ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

సంఘటనా స్థలంలో చిన్నారుల చెంతనే  దిగాలుగా కూర్చున్న తల్లి జ్యోతి

కోలారు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో వ్యధకు గురైన జ్యోతి అనే గృహిణి తన ఇద్దరు ఆడపిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఉదంతమిది. తానూ బలవన్మరణానికి పాల్పడాలని భావించి, భయంతో చివరి క్షణంలో వెనక్కు తగ్గి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటనలో ఆమె పెద్ద కుమార్తె అక్షయ (8) మరణించింది. చిన్న కుమార్తె ఉదయశ్రీ (6) చావుబతుకుల మధ్య పోరాటం చేస్తోంది. ఆమెకు మొదట కోలారు జాలప్ప ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి, మెరుగైన చికిత్స కోసం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం అంజనాద్రి బెట్టపై మంగళవారం రాత్రి ఈ సంఘటటన సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని బూసాని కురుబపల్లికి చెందిన జ్యోతి  తిరుపతిలో నర్సింగ్‌ చదివింది. అప్పుడే తొమ్మిదేళ్ల క్రితం ముళబాగిలుకు చెందిన ప్రతాప్‌ అలియాస్‌ తిరుమలేశతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్యే ప్రేమించి వివాహం చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత వారి సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత జ్యోతి పుట్టింటికి వెళ్లగా అక్కడ కన్నవారి నిరాదరణతో వెనక్కి వచ్చింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇల్లు విడిచి తన బిడ్డలతో సహా బయటకు వచ్చేసింది. తాను ఒక్కర్తే చనిపోతే బిడ్డల జీవితం వీధిన పడుతుందని భావించింది. తనతో తెచ్చిన పెట్రోలును బిడ్డలు ఇద్దరిపై పోసి నిప్పంటించింది. మంట తీవ్రతకు పెద్ద కుమార్తె అక్కడికక్కడే చనిపోయింది. చిన్న కుమార్తె ఒంటికి మంటలు అంటుకున్న తర్వాత ఆమె మట్టిలో పొర్లాడడంతో ఆరిపోయాయి. బుధవారం ఉదయం పళ్లిగెరపాళ్యకు చెందిన స్థానికులు అంజనాద్రి బెట్టకు నడకకు వచ్చిన సమయంలో బాధతో కేకలు పెడుతున్న ఉదయశ్రీ పక్కన పిచ్చిదానిలా కూర్చున్న జ్యోతిని గుర్తించి, తక్షణమే ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట అక్కడికి చేరుకున్న ఎస్సై మంజునాథ్‌ ఉదయశ్రీని జాగ్రత్తగా ఎత్తుకుని ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు. జ్యోతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని