logo

కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం చేస్తామని, త్వరలో ఇక్కడ చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని జిల్లా మంత్రి బి.శ్రీరాములు తెలిపారు.

Published : 08 Dec 2022 01:52 IST

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి, శాసనసభ్యుడు తదితరులు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం చేస్తామని, త్వరలో ఇక్కడ చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని జిల్లా మంత్రి బి.శ్రీరాములు తెలిపారు. కంప్లిలో రైతు సంపర్క కేంద్ర భవనం ప్రారంభోత్సవంతో పాటు రూ.9.7 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. త్వరలో కంప్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా పాలనాధికారికి సూచిస్తానన్నారు. కంప్లికోటె వద్ద తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. శాసనసభ్యుడు గణేశ్‌ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని కంప్లిని నగరసభగా మార్చాలన్నారు. పట్టణంలో ఇళ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేయాలని విన్నవించారు. వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుచేయాలన్నారు. పురసభ స్థాయి సమితి అధ్యక్షుడు సి.ఆర్‌.హనుమంత, పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా, ఉపాధ్యక్షురాలు కె.నిర్మల, జౌళి, మూల సౌకర్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షి గౌడ, ఏపీఎంసీ అధ్యక్షుడు హూవణ్ణ, మాజీ ఎంపీ జె.శాంత, తహసీల్దార్‌ గౌసియా బేగం, ముఖ్యాధికారి శివలింగప్ప, పురసభ సభ్యులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తా: గణేష్‌

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి విధానసభ క్షేత్రంలో తుంగభద్ర ఆయకట్టు రైతులకు సాగు నీరందించేందుకు ఓవైపు అల్లుడు (మాజీ శాసన సభ్యుడు సురేశ్‌ బాబు), మరో వైపు తమ్ముడు (శాసనసభ్యుడు గణేశ్‌) తీవ్ర కృషి చేస్తున్నారని జిల్లా మంత్రి శ్రీరాములు తెలిపారు. కంప్లి పురసభ కార్యాలయం ముందు బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన పైవిధంగా మాట్లాడారు. అంతకుముందు శాసనసభ్యుడు గణేశ్‌ మాట్లాడుతూ రాములన్నకు సురేశ్‌ బాబు అల్లుడైతే తాను తమ్ముడిలాండి వాడినన్నారు. గణేశ్‌ భాజపాలో చేరతారంటూ క్షేత్రంలో ఇటీవల వదంతులు విన్పిస్తున్నాయని, అలాంటిదేమీ లేదని. కాంగ్రెస్‌ నుంచే పోటీ చేస్తానంటూ గణేశ్‌ స్పష్టం చేశారు. అయినా నేడు కంప్లిలో వీరిద్దరూ ఇలా మాట్లాడడం వదంతులకు ఊతమిచ్చినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని