logo

కమలంతోనే దేశ వికాసం-బొమ్మై

భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఉద్ఘాటించారు.

Published : 19 Dec 2022 03:43 IST

పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న నేతలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఉద్ఘాటించారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, అణగారిన వర్గాలను సమాజంలోని ప్రధాన స్రవంతిలోకి తీసుకు వచ్చేందుకు వివిధ పథకాలను తమ పార్టీ అమలు చేస్తోందని చెప్పారు. ప్యాలెస్‌ మైదానం గాయత్రి విహార్‌లో భాజపా వివిధ మోర్చాలు, ప్రకోష్ఠాలకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశం ‘శక్తి సంగమం’లో ఆదివారం మాట్లాడారు. రాజనీతి శాస్త్రానికి, సామాజిక శాస్త్రాన్ని జోడించి, అభివృద్ధిని కోరుకుంటున్న తమ శ్రమను ఓటర్లు గుర్తించారన్నారు. వివిధ వృత్తులు, ఆర్థిక, మాధ్యమ, ప్రచురణ రంగాలకు చెందిన 24 విభాగాలకు చెందిన ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. దేశానికి దిశా నిర్దేశం చేసే మేధావులు, కౌశల్యం ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో భారతదేశాన్ని విశ్వ గురువు స్థానంలో కూర్చోబెట్టేందుకు మరోసారి కమలాన్ని వికసింపజేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది విధానసౌధ, ఆ తర్వాత లోక్‌సభకు జరిగే ఎన్నికలలో భాజపాకు పట్టం కట్టేందుకు ఇప్పటి నుంచి శ్రమించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై

కనీసం 140 సీట్లు వస్తాయి

గుజరాత్‌లో భారీ స్థాయి విజయం అనంతరం కర్ణాటకలోనూ తమకు కనీసం 140 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉందని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల అనంతరం కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు మునుపే తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆ పార్టీని ప్రజలు ఇప్పటికే మునిగిపోతున్న ఓడగా గుర్తించారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో భాజపాకు గట్టి పునాదులు వేసేందుకు తనతో పాటు ఎం.ఆర్‌.తంగ, అనంతకుమార్‌, బి.బి.శివప్ప తదితరుల శ్రమ ఉందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. మరోసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చి కర్ణాటకను మాదిరి రాష్ట్రంగా చేస్తామని పేర్కొన్నారు.

మాది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం

ఈసారి కర్ణాటకలో భాజపా ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. తమది డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో గత ఆరున్నర దశాబ్దాలలో ఎన్నడూ చూడని అభివృద్ధిని సాధించి చూపిస్తున్నామన్నారు.

సిద్ధరామయ్య ద్రోహం చేశారు

విపక్ష నేత సిద్ధరామయ్య తనను సిద్రాముల్లాఖాన్‌ అని పిలిచినా బాధపడనంటూ చేసిన వ్యాఖ్యలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఖండించారు. రామునిపై ప్రేమతో ఆయన తండ్రి సిద్ధరామయ్య అని పేరు పెడితే, తాను మరో మతానికి చెందిన పేరుతో పిలిచినా అభ్యంతరం లేదంటూ విపక్ష నేత చేస్తున్న ప్రకటనలు ఆయన తండ్రికి ద్రోహం చేయడమేనని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు తమకు చక్కని ఉత్సాహాన్ని అందించగా, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు హెచ్చరిక సందేశాలు ఇచ్చాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేస్తున్న పంచరత్న రథయాత్ర ఓట్లు రాల్చవని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బి.ఎల్‌.సంతోశ్‌ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానందగౌడ, పార్టీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌, తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని