logo

విహంగ విన్యాసాలపై సమాలోచన

యలహంక వాయుయాన కేంద్రం (ఎయిర్‌ బేస్‌)లో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కొనసాగే ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు.

Published : 25 Jan 2023 05:31 IST

రాజ్‌నాథ్‌సింగ్‌తో వీసీ సందర్భంగా బొమ్మై అధికారుల సమాలోచన

కలబురగి, న్యూస్‌టుడే : యలహంక వాయుయాన కేంద్రం (ఎయిర్‌ బేస్‌)లో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు కొనసాగే ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌తో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్సులో కలబురగి నుంచి బొమ్మై పాల్గొన్నారు. ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ 1996 నుంచి వరుసగా ఎయిర్‌షోకు బెంగళూరు ఆతిథ్యం ఇస్తోందన్నారు. గతంతో పోల్చితే ఈ ఏడాది భారీ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎక్కువ కంపెనీలు ప్రదర్శనకు వస్తుండగా, ఎక్కువ మంది సందర్శకులు విమానాల ప్రదర్శనలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో విమానాల విడిభాగాలతో పాటు, విమానాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

* పోలీస్‌ ఎస్సై నియామకాలకు సంబంధించి నిందితుడు ఆర్‌డీ పాటిల్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని బొమ్మై చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు ఇవ్వాలని డీవైఎస్పీ శంకరగౌడ డిమాండ్‌ చేశారని ఆర్‌డీ పాటిల్‌ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిందితుని వద్ద ఉన్న దాఖలాలు, సాక్ష్యాలకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆరోపణలలో నిగ్గు తేలేందుకు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించానని తెలిపారు. నిందితుడు ఈ కేసు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆరోపణలు చేస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. నిందితుడు విడుదల చేసిన వీడియో ఇంటర్వ్యూలోని వాస్తవాలను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలకు తాను బాధ్యత వహించనని స్పష్టం చేశారు. ఆరోపణలు చేస్తున్న నాయకులనే ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.


విద్యకే పెద్దపీట

దేవల గాణగాపుర : విద్యాలయ కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి బొమ్మై, తదితరులు

కలబురగి, న్యూస్‌టుడే : ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు విద్యాబుద్ధులు చెప్పించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పిలుపునిచ్చారు. గత పాతికేళ్లుగా దేవల గాణగాపురలో స్థానిక పేద కుటుంబాలకు విద్యాబోధనకు విశేషంగా శ్రమిస్తున్న హేరూరు విద్యా సంస్థలో మంగళవారం రజతోత్సవాలను ఆయన ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు విఠల హేరూరు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బోధకులు, విద్యార్థుల తల్లిదండ్రులలో తాను విఠల హేరూరు వ్యక్తిత్వాన్ని చూస్తున్నానని పేర్కొన్నారు. సమాజాభివృద్ధికి విద్యావంతుల అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హావేరి అంబిగెరె చౌడయ్య పీఠాధిపతి శాంతభీష్మ స్వామి, అల్లమప్రభు పీˆఠాధిపతి మల్లప్పణ్ణ స్వామీజీ, ఎమ్మెల్యేలు ఎం.వై.పాటిల్‌, దత్తాత్రేయ పాటిల్‌ రేవూర, ఎమ్మెల్సీ బాబూరావు చించనసూరు, మాజీ ఎమ్మెల్సీ బాబూరావు చించనసూరు, మాజీ మంత్రలు మాలికయ్య గుత్తేదార్‌, ప్రమోద్‌ మధ్వరాజ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని